ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా తమ పార్టీ వారిని అందలమెక్కిస్తూ ప్రజలు అసహ్యించు కునేలా చేసింది.
ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. మంది బిడ్డను తమ బిడ్డ అంటూ ఎత్తుకొని మురిసిపోతున్నది… ముద్దాడుతున్నది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై జులుం ప్రదర్శిస్తూ లాఠీచార్జీలు, అరెస్టులకు తెరతీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను ఉద్రిక్తతల మధ్య, డ్రా పద్ధతిలో కైవసం చేసుకొని తామేమీ తప్పు చేయలేదు అన్నట్టు బీరాలు పోతున్నది కాంగ్రెస్. ఇదెక్కడి న్యాయం.. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే సందేహం కలుగుతన్నది. ఇక్కడ ఆటవిక న్యాయం అమలవుతున్నది.
ముఖ్యంగా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ తరఫున 9 మంది వార్డు కౌన్సిలర్లను మంచి మెజారిటీతో గెలిపించి ప్రజలు తీర్పు చెప్పారు. కానీ ఆ మ్యాండేట్‌ను కాదని అధికార కాంగ్రెస్ డ్రా పద్ధతిని తెరపైకి తెచ్చి అక్రమ మార్గంలో తమ ఖాతాలో వేసుకున్నది. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ప్రతిని చేతబట్టి పార్లమెంట్ హాలుకు వస్తున్న మీ నాయకుడు రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నదా ఇదంతా? లేక ఇదంతా మీరు చేసే పనేనా? అనే సందేహం కలుగుతున్నది.
రాజ్యాంగాన్ని గౌరవించేవారు ఎవరైనా ఇలాంటి నీతిమాలిన చర్యలకు ఒడిగట్టరనేది సుస్పష్టం. వేలాది మంది పోలీసులను మోహరించి తమది గాని సీటును ఇప్పుడు గెలుచుకోవచ్చుగాక… రానున్న రోజుల్లో ఇదే మీ పతనానికి పునాదిగా మిగలవచ్చు. మీలాంటి వారి చేతుల్లో రాజ్యాంగం అపహాస్యం పాలవుతుంటే చూస్తూ కోరుకున్న ప్రతి ఒక్కరూ దోషులే. ప్రశ్నించేవాడిని అణచివేయడం అనేది ఇప్పుడు రివాజుగా మారింది. కానీ ఈ ప్రశ్న వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటుగా మారి మీ భవితవ్యాన్ని శాసిస్తుందనేది 100% సత్యం. ఈ సత్యాన్ని ఎవరూ ఆపలేరు. ఇలాంటి తప్పుడు పనులతో మీరు ఇప్పుడు అధికారంలో రావచ్చు కాక.
కాంగ్రెస్ చేసే ఇటువంటి చేష్టలే అధికార మార్పిడికి పునాదిగా మారనున్నాయి. ఇది వీర తెలంగాణ.. తిరగబడే తత్వం ఉన్నది. ఆనాటి నిజాం రాజు నుంచి మొన్నటి సమైక్య పాలకులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణకు ఉంది. ఇది పాలకుర్తి గడ్డ. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ గడ్డపై కాంగ్రెస్ అరాచకాలు సాగవు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నది. ..ఇది సత్యం… ముమ్మాటికీ సత్యం.
– కల్వకొలను ప్రవీణ్ రాజు