చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా విశ్వనగర స్థాయి అందుకునేందుకు అంగలు వేస్తున్నది. రెండేండ్ల పాలనలో రాష్ర్టాన్ని పెరికి పోగులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నగర వైభవానికి కత్తెర వేసేందుకు నడుం బిగించింది. మూడు ముక్కలు చేసి మూలకు తోయాలని బరితెగించింది. ‘పెండ్లి చేయడం చేతకాదు గానీ చెడగొట్టడమంటే అదెంతసేపు’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు వైఖరి. కొత్తది ఏదీ కట్టలేము కానీ ముక్కలు చేయడం చిటికెలో పని అన్నట్టుగా ధ్వంసరచనకు ఒడిగడుతున్నది.
ఏమి సాధిస్తారో ప్రజలకు వివరించకుండానే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా మూడు తెరుగులు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. శివారు మున్సిపాలిటీలను విలీనం చేసి హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా, దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని బీరాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి అదంతా అటకెక్కించి అసలుకే ఎసరు తెచ్చారు. ఇది విశ్వనగరం ఆకాంక్షలకు గొడ్డలిపెట్టని చెప్పక తప్పదు.
వలస పాలనలో ఎనలేని నిర్లక్ష్యానికి గురైన రాజధాని నగరం అభివృద్ధిపై స్వరాష్ట్ర సాధన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా సర్కారు పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నగరాభివృద్ధిని దార్శనికతతో పరుగులు తీయించి ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించారు. మెగా ప్రాజెక్టులతో ఆగమేఘాల మీద ప్రగతిని పరుగులు పెట్టించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ సరఫరా సమస్య లేకుండా చేశారు. కృష్ణా, గోదావరి జలాలతో నగరం నీటిగోసను తీర్చి, జీహెచ్ఎంసీ పరిధిలోని నివాస గృహాలకు ఉచిత సరఫరా చేపట్టి దాహార్తి అనేది దరిజేరకుండా కట్టుదిట్టం చేశారు. అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే కడుపు నిండా భోజనం సమకూర్చారు.
దేశంలో మొదటిసారిగా విపత్తు సహాయక దళం (డీఆర్ఎఫ్) ఏర్పాటు చేసి కష్టకాలంలో ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆకాశహర్మ్యాలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవాక్‌లతో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆకాశమే హద్దు అన్నట్టుగా ప్రోత్సహించారు. పడమరకే పరిమితమైన నగరాభివృద్ధిని తూర్పు దిశకు మళ్లించారు. పారిశ్రామిక విస్తరణకు పటిష్టమైన శాంతిభద్రతల వ్యవస్థ అవసరం. అందుకే నగర పోలీసు విభాగాన్ని షీ టీమ్స్, హ్యాక్ ఐ వంటి వినూత్న సాంకేతికతలతో ఆధునీకరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించి పటిష్టమైన ప్రపంచ స్థాయి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
గ్లోబల్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దారు. నగరాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికతో బాటలు వేసి పదేండ్ల కాలంలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభించింది. అంతర్జాతీయ ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ మేటిగా నిలిచింది. అటు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా నగరంలో ఫార్మా రంగం బలంగా వేళ్లూనుకొన్నది. ఈ చొరవల ఫలితంగా అత్యంత జీవన యోగ్యమైన నగరంగా హైదరాబాద్ మార్కులు సంపాదించింది. కానీ ఇప్పుడదంతా డోలాయమానంలో పడింది.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో మహానగర మహోజ్వల ఖ్యాతి మసకబారింది. అస్తవ్యస్త విధానాల ఫలితంగా రియల్ ఎస్టేట్ సడుగులు విరిగి నిస్సహాయ స్థితికి చేరుకుంది. హైడ్రా కూల్చివేతల వంటి అనాలోచిత, దుస్సాహసిక చర్యలు రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. అమ్ముడుకాని రియల్ ఎస్టేట్ యూనిట్లలో ఇప్పుడు హైదరాబాద్ టాప్‌లో నిలుస్తున్నది. ఇప్పుడు చేపట్టిన మూడుముక్కలాటతో మహానగరం అస్తిత్వానికే ఎసరు వచ్చింది. ఫ్యూచర్ లేని సిటీల వెంట పరుగులు పెడుతూ మహానగరం ఫ్యూచర్‌నే బలిపెడుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి వచ్చే పెట్టుబడులు ప్రభావితం అవుతాయని చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్నపళంగా ఈ కత్తిరింపులు ఎందుకు చేపట్టినట్టు? అంటే పాలనా సౌలభ్యం కోసం అని సర్కారు సాకులు చెప్తున్నది. ఈ కాకమ్మ కబుర్లను నమ్మేవారు ఇప్పుడు ఎవరూ లేరు. ఆ సౌలభ్యం మాటేమోగానీ ప్రజలు మాత్రం మూడుదిక్కులకు పరుగులు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. మహానగరం రూపురేఖలను ఇష్టారాజ్యంగా మార్చడం ఏమాత్రం క్షంతవ్యం కాదు.