కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ ‘తెలంగాణ తల్లి’ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో వేలాదిమంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కొత్త విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. అంతేకాదు, కావాలంటే ఆ విగ్రహాన్ని గాంధీభవన్లో ప్రతిష్ఠించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఇప్పటివరకున్న విగ్రహం తెలంగాణ తల్లి వలె లేదని, దేవత లాగా ఉన్నదనే బలహీన వాదన వినిపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్పృహను మరిపించడానికి పరాయి పాలకులు అన్నిరకాలుగా ప్రయత్నించారు. దానికి విరుగుడుగా తెలంగాణ తల్లి ఆవిర్భవించింది. మేధావులు, కవులు, కళాకారులు యోచించి, చర్చించి తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంలోంచి ఉద్యమ అవసరంగా 2007లో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఆ రూపాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం అనవసరం.
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పలు వివాదాలు, ఆరోపణలకు గురై రాజకీయ ఉపకరణంగా మారిం ది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ మొదటి నుంచీ విమర్శిస్తూనే వస్తున్నది. మతపరమైన భావనలు పుష్కలం గా ఉండే ఎంఐఎం దేవతలను, అమ్మలను విగ్రహాలుగా పెట్టడాన్ని ఎలాగూ ఆమోదించదు. ఇక బీజేపీ నేతలు తమాషా చూసే ధోరణిని అవలంబిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. సగటు తెలంగాణ అమ్మ, సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించగా, అందుకు పోటీగా మేడ్చల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మునపటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే మళ్లీ తాజాగా ఆవిష్కరించారు.
ఉద్యమ సమయంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వెంటనే తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్చడంపై దృష్టిపెట్టింది. విగ్రహం ఎలా ఉండాలనే దానిపై అందుబాటులో ఉన్న తమ పార్టీ అనుకూలురతో సమాలోచనలు జరిపి కొత్త విగ్రహాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో ‘దేవత వరాలు ఇస్తుంది, అమ్మ ఆకలి తీరుస్తుంది. ఈ తల్లి మన అమ్మకు ప్రతిరూపం’ అని కొత్త విగ్రహంపై వస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఈమె అమ్మ, ఆమె దేవత. దేవత కన్నా అమ్మే గొప్ప’ అనే అర్థం వచ్చేటట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ, ఇది రాజకీయ ఉద్దేశంతో చేసిన ప్రతిచర్య తప్ప ఇందులో ఔచిత్యం అంతగా లేదు.
పరిపాలనలో తమ ముద్ర ఉండాలని పాలకులు అనుకోవడం సహజమే. కానీ, ఉన్నవాటిని తుడిచి తమ ముద్ర వేసుకోవడం వర్తమాన ప్రజాస్వామికపు రోజుల్లో సబబు కాదు. చివరికి ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ గొడవగా, ఇంకా పిండితార్థం తీస్తే కులాల గొడవగా మార్చారు.
‘తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం మూర్ఖత్వం. సీఎం తల తిక్క ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వాన్ని గాయపరుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి తెలియని రేవంత్రెడ్డి.. రాజకీయ స్వార్థంతో, నా మీద కక్షతో పిచ్చి పనులకు పూనుకొంటున్నారు’ అని కేసీఆర్ అన్నారు.
నిజానికి, తెలంగాణ తల్లి భావన కేసీఆర్ ఒక్కరిది కాదు, యావత్ తెలంగాణ సమాజానిది. ఈ మాటను కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. అయితే, ఆ భావనకు రూపం ఇచ్చే పనికి మాత్రమే కేసీఆర్ పూనుకున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు కొందరు తెలంగాణ ఆలోచనాపరుల సూచన ప్రకారం… ప్రొఫెసర్ తోమారపు గంగాధర్ తెలంగాణ తల్లి విగ్రహానికి తుది రూపునిచ్చారు.
కేసీఆర్ పెట్టిండని విగ్రహరూపు మార్చాలనుకోవడం సబబు కాదు. తెలంగాణను ఆంధ్రాలో కలుపుకోవాలనే కుట్రలో భాగంగా ఆంధ్రా మాతను పక్కనబెట్టి తెలుగుతల్లిని నాడు పరాయి పాలకులు తెరమీదికి తెచ్చారు. అయితే, 70 ఏండ్ల కిందటనే దాశరథి, రావెళ్ల వెంకట్రామారావు వంటి కవులు, తెలంగాణ తల్లి భావనను చిక్కబరిచారు, ప్రచారంలోకి తీసుకువచ్చారు. భాషాప్రయుక్త రాష్ర్టాల పేరిట తెలంగాణ, ఆంధ్రా విలీనానికి ముందే ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’ అని దాశరథి అనగా.. ‘నా తల్లి తెలంగాణరా.. వెల లేని నందనోద్యానమ్మురా’ అని రావెళ్ల వెంకట్రామారావు అన్నారు. కాకతీయుల కాలం నాటి మూలాలతో సాంస్కృతిక అస్తిత్వ భావనలు ప్రతి తెలంగాణ పౌరుడిలో నిక్షిప్తమై ఉంటాయి. వారందరి ఆకాంక్షల ఫలితమే తెలంగాణ తల్లి. ప్రజల్లో తెలంగాణ స్పృహను పెంచి వారిలో ఐక్యతను పెంచడానికి తెలంగాణ తల్లి భావన అవసరమైంది. ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక అవసరమై, దానికొక పవిత్రతను ఆపాదించడానికి ఒక రూపం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోంచే తెలంగాణ తల్లి రూపుదిద్దుకున్నది. అయితే, ప్రస్తుత పాలకులు అల్పమైన తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు.
‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండా’ అని తెలంగాణ పిన్న పెద్దలతో పరాయి పాలకులు పాడించారు. కానీ, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ నారాయణరావు, పల్లా దుర్గయ్య, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు ఆంధ్రా వేరు, తెలంగాణ వేరు అనే స్పృహతో పని చేశారు. ఆ స్పృహ చిక్కబడి తెలంగాణ ఉద్యమమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రెడ్ల ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనలేదు.
కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయ, ఉద్యోగులు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారు. భాష, యాసలు, సంస్కృతి, చరిత్ర, అస్తిత్వాల పట్ల తమ కవిత్వం, రచనలు ఆటపాటల ద్వారా ప్రజల్లో ఉద్యమం పట్ల అవగాహన పెంచారు. భావజాలాన్ని వ్యాప్తిజేశారు. ఆ క్రమంలో తెలంగాణ తల్లి రూపుదిద్దుకున్నది.
మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చేతన బలంగా ముందుకువచ్చింది. తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. అప్పుడే తెలుగు తల్లిని ‘ఎవడి తల్లి దిక్కుమాలిన తల్లి’ అని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఈసడించుకున్నారు. ‘మా తల్లి మాకు ఉంటుం ది. మా తల్లి తెలంగాణ తల్లి’ అని అన్నారు. గిరిజనుల్లో పొలానికి, పశువుల పాకకు, పురిటిగడ్డకు కూడా దేవత ఉంటుంది. తెలంగాణ గ్రామాల్లో ఇంటికో మైసమ్మ, ఊరికో ఊరడమ్మ, చెరువుకో కట్ట మైసమ్మ, కోటకో కోట మైసమ్మ ఉంటుంది. అన్ని శుభకార్యాల్లో నేటికీ తొలి పూజలు వీరికే అందుతాయి. అటువంటిది నాలుగు కోట్ల మందికి, రెండు కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి తల్లి ఎందుకు ఉండొద్దనే ఉద్దేశం నుంచే తెలంగాణ తల్లి ఆలోచన పుట్టిం ది. ఎల్లమ్మకు ప్రతీకగా గవ్వలు చలామణిలో ఉన్నాయి. సమ్మక్క-సారలమ్మలకు ప్రతీకగా కుంకుమ భరిణని భావిస్తున్నాం. శంఖుచక్రాలను విష్ణుమూర్తిగా కొలుస్తాం. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ తల్లి.
‘ఒక ప్రాంత ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా ఉండాల్సిన తల్లి రూపం దివ్యంగా, భవ్యంగా, భగవత్ స్వరూపంగా ఉండాలె. ప్రజలు చూడగానే చేతులెత్తి నమస్కరించుకునేలా ఉండాలె’ అని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచీ చెప్తున్నారు.
కొత్త విగ్రహావిష్కరణ గొప్ప నిర్ణయమని ప్రభుత్వం అంటున్నది. నాలుగు కోట్ల ప్రజల ఆలోచన కొత్త తల్లి అని సీఎం చెప్తున్నారు. అంతేకాదు, దయచేసి రాజకీయాలకతీతంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదిద్దామని అన్నారు.
కానీ, పాత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను తిరగదోడుదామనేది మంచి సంప్రదాయమైతే కాదు. ఇది అలవాటుగా మారితే ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ మార్పులు ప్రధాన వ్యాపకాలు అయిపోతాయి. పాత వారి ఆనవాళ్లు లేకుండా చేస్తామనే తలంపు మంచిది కాదు. సరికొత్త ఆలోచనలు, ప్రజారంజక పాలనా పద్ధతులతో చరితార్థులు కావాలె కానీ, ఇలా చేయడం రాజకీయం తప్ప మరేమీ కాదు.
– దుర్గం రవీందర్ 93464 54912