భారత్ వంటి వర్ధమాన సమాజాల్లో ఎక్కడైనా సరే సామాన్య ప్రజల అవసరాలు, కోరికలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, కనీసమైన నిత్య జీవితావసరాలు తీరడం. రెండు, ఆ స్థితి నుంచి మరొక అడుగు ముందుకు వేయగలగడం. అలా ఒక చిన్న ముందడుగు అయినా వేయగలగాలని కోరుకున్నప్పుడు అది వారికి కలలుగనే దశ అవుతుంది.
సామాన్యుల కలలు ఏమిటో పసిగట్టగలిగి, వాటిని తాము తీర్చగలమని వాగ్దానం చేస్తూ, వారి ఓట్లను సంపాదించి అధికారానికి రావడం వరకు ఆక్షేపించవలసింది ఉండదు. అయితే, ఆ విధమైన కలలను తీర్చాలంటే ఆ పార్టీకి చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి. అలా కాకుండా కేవలం అధికారం కోసమే ఆ వాగ్దానాలు చేసి, కలలను మాత్రం తీర్చకపోవడం కలల బేహారితనం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి బేహారిగానే వ్యవహరిస్తున్నది.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కనీస అవసరాల కోసం సామాన్యులు పరితపించారు. సుదీర్ఘ కాలం ఫ్యూడల్ వ్యవస్థలలో, వలస పాలనలో మగ్గినదాని ఫలితంగా ఏర్పడిన పేదరికంలో అత్యధికులకు తిండి, బట్ట, నివాసం, కనీస వైద్య సదుపాయాలు, ప్రాథమిక స్థాయి విద్య, చేసేందుకు కూలి పనుల ఉపాధి అయినా అందుబాటులో ఉండేవి కావు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వెనుకబడి ఉండగా, ఆ కారణంగా వర్తక వ్యాపార రంగం కూడా అందుకు తగినట్టే ఉండేది. ఈ పేదరికపు దశను పేదల అర్ధాకలి, ఆకలి చావులు ప్రతిఫలించేవి. అటువంటి దశ నుంచి వీలైనంత త్వరగా బయట పడేందుకు అవసరమైన సహజ వనరులు, అవకాశాలు ఉండినప్పటికీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగా, విధానపరమైన లోపాలు, ఆచరణలో నిజాయతీ లేమి, పాలకుల స్వార్థం కారణంగా ఆ స్థితి నుంచి ప్రజలు బయటపడేందుకు దాదాపు 50 సంవత్సరాలు పట్టింది.
ఆ విధంగా 20వ శతాబ్దం చివరకు వచ్చేసరికి సామాన్యులకు పైన పేర్కొన్న కనీస అవసరాల దశ పూర్తిగా కాకున్నా చాలా వరకు గడిచిపోయింది. వాస్తవానికి ఆ మొదటి దశలోనూ రాజకీయ పార్టీలు అధికారం కోసం హామీలివ్వడం, మ్యానిఫెస్టోలు ప్రకటించడం, విధానపరమైన ప్రకటనలు, చట్టాలు చేయడం ఉండేది. కానీ, అమలు కావడం అరకొరగా, ప్రజలను మోసగించడం ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో సామాన్యుల కలలనేవి కనీస జీవితావసరాలను పొందడానికి మాత్రమే పరిమితమై ఉండేవి. అప్పటి దృష్టితో ఆలోచించినట్టయితే అది కూడా రాజకీయ పార్టీల కలల బేహారితనమే. ఆ కాలమంతా అత్యధిక భాగం పాలించింది కాంగ్రెస్ అయినందున, ఆ పార్టీ ప్రధానమైన బేహారి కావడం, ప్రజలను మోసగించడం, అందుకు పర్యవసానంగా తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కోల్పోయి ఇక తిరుగులేని క్షీణ దశలోకి ప్రవేశించడం జరిగిపోయాయి.
ఆ శూన్యాన్ని ఇతరులు ఆక్రమిస్తూ పోయారు. ఒక విషయం గుర్తు చేస్తే ఎవరైనా నమ్ముతారో, లేదో తెలియదు కానీ, 1952 నాటి మొదటి ఎన్నికల తర్వాత 1957లో జరిగిన రెండవ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ పలు రాష్ర్టాల్లో ఓట్లు, సీట్లు, కేరళలో అధికారాన్ని సైతం కోల్పోయినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ అన్నదేమిటి? పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే సామాన్యులు మరింత చైతన్యవంతులై తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ, కాంగ్రెస్ను పక్కకు తోసివేసి తమ దారిలో తాము ముందుకు సాగిపోగలరని వర్కింగ్ కమిటీ సమావేశంలోనే హెచ్చరించారు. ఆ శతాబ్దం ముగుస్తున్న దశకే కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా ఏమైందో తెలిసిందే.
అప్పటి సామాన్యుల ఆశలు, కలలు కూడా కనీస అవసరాలైనా తీరని దుస్థితి నుంచి బయటపడటం. తర్వాత 20వ శతాబ్దం ముగుస్తుండిన కాలం నుంచి మొదలుకొని ప్రస్తుత 21వ శతాబ్దం కూడా ప్రవేశించినప్పటి నుంచి దేశ ఆర్థిక స్థితిగతులు క్రమంగా మెరుగుపడడం మొదలైంది. అందుకు అనుగుణంగా సామాన్యుల జీవితాలు కూడా నెమ్మదిగా బాగుపడుతుండగా, పైన పేర్కొన్నటువంటి కనీస జీవితావసరాలు కనీసమైన విధంగా తీరడం మొదలైంది. ఆ సరికి స్వాతంత్య్రానంతరపు మూడవ తరం ఉనికిలోకి వచ్చింది.
అలా ఒకవైపున కనీస అవసరాలు తీరుతుండటం, మరొకవైపు సరికొత్త తరాలు ఉనికిలోకి రావడంతో సామాన్య ప్రజలకు జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలన్న కోరికలు, లేదా కలలు, సహజమైన రీతిలో ఆరంభమయ్యాయి. వారి మొదటి దశ కోరికలు, అవసరాల ఆధారంగా కలల బేహారులుగా మారిన రాజకీయ పార్టీలు తిరిగి రెండవ దశలోనూ కలల బేహారుల అవతారంలో తమ నాటకంలో రెండవ అంకాన్ని ప్రారంభించారు. అంతే తప్ప, నెహ్రూ హెచ్చరికల నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ప్రస్తుతం మనం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూస్తున్నది సరిగ్గా ఇదే. ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టో, వివిధ డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్లు, కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేల వ్యక్తిగత హామీల నుంచి మొదలుకొని కనిపిస్తున్నది యావత్తూ కలల బేహారి చాణక్యమే. మోసకారితనమే. అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తికావస్తున్నా ఇందులో మార్పు లేదు. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఏ తరగతిని కదిలించినా వినిపిస్తున్న మాట ఇదే. ఇందులో మరొక దయనీయమైన స్థితి కనిపిస్తున్నది. తాము హామీలతో సృష్టించిన కలల బేహారితనం ప్రజలకు అర్థమైపోయింది. తమకు తామే సృష్టించుకున్న ఆ వలయంలోంచి బయటపడలేకపోతున్న కాంగ్రెస్, వాటి నుంచి దృష్టి మరల్చేందుకు ఎప్పటికప్పుడు మరిన్ని కలలు సృష్టించ బూనుతున్నది. వెనుకటివి నకిలీవని అర్థమైన సామాన్యులు కొత్త నకిలీలపై సహజంగానే పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది అనుభవంతో సర్వసాధారణంగా వినవస్తున్నది ఒకటే. మాటలెక్కువ, చేతలు తక్కువ అని. ఆ ఒక్క మాట చాలు రాష్ట్ర ప్రభుత్వ నేతలు, వారితోపాటు అధిష్ఠాన నాయకత్వం అద్దంలో తమ ముఖం తాము చూసుకునేందుకు. దీనికితోడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలో ఎక్కడా లేని అబద్ధాలతో రికార్డులు సృష్టిస్తున్నారు.
అటు అధిష్ఠానం, ఇటు రాష్ట్ర నాయకులు పదేండ్లపాటు అధికారాన్ని కోల్పోయి ఒడ్డున పడిన చేపల్లా గిలగిలా కొట్టుకున్నారు. ఈ స్థితిలో కలల బేహారితనపు మోసకారి వ్యూహాలతోనైనా సరే అధికారాన్ని తిరిగి సంపాదించాల్సిన దిక్కుమాలిన స్థితి ఎదురైంది. దీంతో వ్యూహకర్తలను కాంట్రాక్టు చాణక్యులుగా రంగంలోకి తెచ్చి హిమాచల్, కర్ణాటక, తెలంగాణల్లో గట్టెక్కారు. కానీ మూడు చోట్లా ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. వారి బాధ హామీలను అమలు చేయలేకపోతున్నామని కాదు, తాము వంచనాపూరిత కలల బేహారులమని ప్రజలకు తెలిసిపోతున్న స్థితిలో మరిన్ని కలలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టడం ఎలాగనే. 67 సంవత్సరాల క్రితం పార్టీకి నెహ్రూ చేసిన హెచ్చరిక ఇటువంటి మార్గాన్ని అనుసరించమని మాత్రం కాదు.
ఇక, ఢిల్లీ నాయకత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గ్యారెంటీల పల్లీప్యాకెట్లను మసాలా కలిపి పంచిన తర్వాత ఇక ఈ మూడు రాష్ర్టాల ప్రజలకు ముఖం చూపించే ధైర్యం చేయలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా ఆ ఎత్తుగడలు హర్యానా, మహారాష్ట్రలలో చిత్తయిపోయిన తర్వాత. అందుకే ఈ ఏడాదికాలంలో ఒక్కసారైనా ఇటు వచ్చి ప్రజలకు ముఖం చూపించలేకపోయారు.
– టంకశాల అశోక్