ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గద్దెనెక్కినంక.. ’అయ్యో.. లంకె బిందెలు ఉన్నయనుకున్నం’ అంటూ గులుగుడు మొదలువెట్టిన్రు. ఈ 34 నెలల పాలనల వీళ్లు సృష్టించిన ‘సంపద’ ఎంతనో వాళ్లకే తెల్వాలె. కొత్తగ ఫ్యాక్టరీలు, కంపెనీలు తేకపోగా, అన్నీ రంగాలను దివాలా తీయించిన్రు. భూముల రిజిస్ట్రేషన్ ధరలు, లిక్కర్ రేట్లు భారీగా పెంచిన్రు. ఓహో ఇదేనా సంపద సృష్టించే తెలివి!
సర్కార్ వారు సంపద సృష్టిని ఇంకో లెవెల్‌కు తీసుకపోయిన్రు. ఇప్పుడు నడుస్తున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సాకుతో.. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున 4:30 గంటల వరకు, 20న రాత్రి 3 గంటల వరకు బార్లు, క్లబ్బులు తెరుచుకోవచ్చని పచ్చ జెండా ఊపిన్రు. ఇది విన్న పబ్లిక్ ’ఇదేనా సార్ మీరు చెప్పిన సంపద సృష్టి! జనాలు ముక్కున వేలేసుకుంటున్నరు. దీని మీద సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
పాపం.. జనాలు ఇండ్లల్లో కూర్చొని టీవీలల్ల మ్యాచ్‌లు చూస్తుంటే, వీళ్లేమో తెల్లారే వరకు బార్లను బార్లా తెరిచివుంచి ‘తాగండి.. రాష్ట్ర సంపదను పెంచండి’ అని పిలుపునిస్తున్నట్టు కనవడుతున్నది. మొత్తానికి అక్కడ మెస్సీనో, రొనాల్డోనో గోల్ కొడితే.. ఇక్కడ మన లిక్కర్ సేల్స్ కలెక్షన్ల గోల్ కొట్టాలని సర్కార్ ప్లాన్ చేసిందన్నమాట!

అవును మరి! మన పెద్దలు ఊరికే అన్నరా.. ’రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా?’ అని. కాకపోతే ఇక్కడ రాజు తల్చుకున్నడో లేదో గానీ, గుంపు మేస్త్రి కండ్లళ్ల ‘ఆనందం’ చూడడానికి కొందరు అధికారులు, పోలీసులు, కొన్ని పత్రికల పెద్దలు తెగ తాపత్రయపడిపోతున్నరు. సీఎం ఎక్కడికి పోతే అక్కడ.. నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలు, నిరుద్యోగులు, రైతులను పోలీసోళ్లు ‘ప్రేమగా’ తీసుకపోయి బండ్లల్ల ఎక్కిస్తున్నరు. ’ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ’ అని కొందరు లబోదిబోమంటున్నరు. సీఎంను ఇంప్రెస్ చేసేందుకు మరికొందరు ఓవరాక్షన్ చేస్తున్నరు.
కొన్ని పత్రికలు, టీవీలు, డిజిటల్ టీవీల వాళ్లు భలే గమ్మతు మోపయిన్రు. సర్కార్ సైడోళ్లు బూతులు మాట్లాడినా అక్షరం పొల్లు పోకుండా రాస్తున్రు. బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్‌మీట్ పెట్టి ఎంత మంచి ముచ్చట చెప్పినా.. చిన్నచిన్నగా రాసుకుంట జాగ్రత్తపడుతున్రు. కాంగ్రెస్ వాళ్లంటే వాళ్లకు ఏదైనా భయమో లేకపోతే ఏదైనా వచ్చేది రాకుంటపోతదని ఆందోళననో తెల్వది మరి.
సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా స్పెషల్ ఆర్డర్లు వచ్చినయా.. లేక వీళ్లకు వీళ్లే మొత్తానికైతే పేజీలకు పేజీలు భజన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎదురు తిరిగితే అరెస్టులు.. నిజాలు రాస్తే ప్రకటనల కత్తెర్లు! ఇట్లయితే ఎట్లాయే? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కితే.. జనం గొంతు లేపరా? ఏదేమైనా.. జీఎం సారు కండ్లల్ల ఆనందం కోసం మీడియా చేస్తున్న ఈ ‘సర్కస్ ఫీట్లు’ చూస్తుంటే.. జనాలకు నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలేదు!

‘దొంగలు పడ్డంక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినయి’ అన్నట్టు సర్కార్ తీరున్నది. బీఆర్ఎస్ వాళ్లు ఎల్ నినో వస్తది, కరువు తన్నుకొస్తది, గోదావరి నీళ్లు ఎత్తిపోయున్రి అని నెత్తీ నోరు మొత్తుకొని చెప్తే ’మీకేం తెలుసు పోండి’ అన్నట్టుగా సర్కార్ లైట్ తీసుకున్నది. ఇప్పుడు కరువు వచ్చి నెత్తిన కూర్చున్నది.
ఇప్పుడు వరదంతా పోయి కింది రాష్ట్రపోళ్లు ఎత్తిపోసుకున్నాక, మన చెరువులన్నీ ఎండిపోయినాక… సీఎం, మంత్రులు ప్రాజెక్టుల వెంట షికార్లు కొడుతున్రు! పరిశీలనలు, పర్యవేక్షణల పేరుతో హడావుడి చేస్తున్రు. ’అత్యవసర క్యాబినెట్ మీటింగ్‌లు’ పెట్టి తలలు బద్దలు కొట్టుకుంటున్రు. ఇదంతా ముందే చేసి ఉంటే గీ తిప్పలు ఉంటుండేనా? అంటున్రు జనాలు.
’నీళ్లు లేవు, బొగ్గు నిల్వలు లేవు సారూ… కరెంట్ కోతలు పక్కా వస్తయి’ అని బీఆర్ఎస్ వాళ్లు మొత్తుకుంటున్నా సర్కార్ సప్పుడు చేస్తలేదు. ఈ విషయంలో కూడా ఇట్లే మొద్దు నిద్ర పోతే… రేపు కరెంట్ పోయి చీకట్లో కూర్చోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది. సీఎం మంత్రులు పగటి కలలు ఆపి, అప్రమత్తమైతే మంచిగుంటది. ఇంట్లో కరెంట్ లేక, పొలాల్లో నీళ్లు లేకపోతే పాలకుల పీఠాలు కదలడం ఖాయం.

‘ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత’ అన్నట్టుంది కాంగ్రెసోళ్ల కథ. ఓటు వేసి గెలిపించిన జనాలను మర్చిపోయి, ఊ అంటే హస్తిన వైపు చూస్తున్నరు. కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇక్కడ ఫైలు కదులుతున్నది. ఆఖరికి ఏ చిన్న ముచ్చటకైనా ఢిల్లీ దాకా విమానాలల్ల పోయి, వాళ్ల అనుమతి కోసం చేతులు కట్టుకొని నిలబడటమేనా స్వయం పాలన? ఇదేనా అస్తిత్వం, ఇది ముమ్మాటికీ రిమోట్ కంట్రోల్ పాలన.
ఇక్కడి ముఖ్యనేతకు పక్క రాష్ట్ర ముఖ్యనేత మీదున్న ప్రేమ.. ఆదొక వైపరీత్యం. మన రాష్ట్ర ప్రయోజనాలు గంగల కలిసినా పర్లేదు గానీ, పక్కాయన మనసు మాత్రం అస్సలు నొయ్యద్దట! ఇది మనోళ్ల పాలనా? లేక పక్కోళ్ల ప్రయోజనాల కోసం చేస్తున్న గులాంగిరీనా? గోదావరిల నీళ్లు కిందకి పాయె.. మనం చూస్తూ కూర్చునుడాయె. కోర్టుల పిటిషన్ కొట్టుడుపాయె.. కాగ్నిజెంట్ కంపెనేమో ఆశలు పెట్టి ఏపీ పాయె.. మన నిరుద్యోగుల ఆశల మీద నీళ్లుపోసె! ఇంకా ఇట్లనే చూస్తూ కూర్చుంటే తెలంగాణ ఆగమైపోతది. ఇప్పటికైనా ఢిల్లీ గులాంగిరీ, పక్క రాష్ర్టాల భజనలు బంద్ చెయ్యాలె. కుర్చీలు కాపాడుకోవడం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలె. మన పాలన మన కోసమే నడవాలె, ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం కాదు!
– దాము నర్మాల