‘మూసీ పునరుజ్జీవం’ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం మెదడులో తెలివిగా వచ్చిన ఆలోచన. ఎన్నికల హామీల నాడు ఆ ఊసు లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనే సాకుతో పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను మరిచిపోయింది. ప్రజల్లో పెరుగుతున్న అసహనం నుంచి దృష్టి మళ్లించేందుకు తెరపైకి హైడ్రాను తెచ్చింది. అది ఏడాది కాలంలో చేసిన హంగామాలో ప్రజలకు జరిగిన నష్టమే ఎక్కువ.
నగరంలో చెరువుల సంరక్షణ పేరిట మొదలైన కూల్చివేతల కన్ను మూసీ నది పరీవాహక ప్రాంతంపై పడింది. నది ఇరువైపులా భూమిని కబ్జా చేసుకొని ఇళ్లు కట్టుకున్నారని వాటిని గుర్తించి, ఇళ్లకు మార్కింగ్ చేసి అక్కడి సామాన్య కుటుంబాలను బెంబేలెత్తించారు. వారంతా చిన్న వ్యాపారాలు, దినసరి కూలిపై బతికేవాళ్లే. ఎన్నో ఏండ్లుగా ఉంటూ, అక్కడే పుట్టి పెరిగినవారు ఇప్పుడు తట్ట బుట్ట పట్టుకొని ఎటు పోవాలని అధికారులను నిలదీశారు.
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ చర్యను తప్పుబట్టాయి. మూసీ పక్కన ఓ రాత్రి గడిపితే వారి బాధ మీకు అర్థమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. వారం రోజులైనా అక్కడి జనంతో కలిసి బతుకడానికి సిద్ధమే అని హరీశ్‌రావు సవాల్‌కు సిద్ధపడ్డారు. ఇక తప్పదన్నట్టు పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకం కింద కట్టి ఉన్న ఇళ్లను వారిలో కొందరికి కేటాయించారు.
తమ పని ప్రదేశాలకు దూరంగా వెళ్లలేమని చాలామంది కొత్త చోట్లకు వెళ్లడానికి నిరాకరించారు. నిరాశ్రయులు కాబోయే స్థితిలోకి వెళ్లిన ఆ పేద ప్రజలు ప్రస్తుతానికి తమ ఇండ్లలోనే బతుకుతున్నారు. అంతా రసాభాసగా మధ్యనే ఆగిపోయిన మూసీ పునరుజ్జీవం మళ్లీ ముందుకు వచ్చింది. దీనితో ముడిపడి ఉన్న సమస్యలేవీ దారిలోకి రాకముందే మూసీ కొత్త అందాల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవల కొబ్బరికాయ కొట్టింది.
మూసీ నది చుట్టుపక్కల ఎలాంటి మార్పులు తేవాలో తెలుసుకునేందుకు మంత్రుల, అధికారుల బృందం జనవరిలో సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ నది పక్కన అభివృద్ధి చెందిన పార్క్‌లు, వ్యాపార కేంద్రాలు చూసి వచ్చారు. లక్షా ముప్ఫై వేల కోట్ల రూపాయల ప్రణాళికతో మూసీ పునరుజ్జీవం ప్రభుత్వం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హామీ ఇచ్చిన పథకాలకే డబ్బులు లేవని, అప్పులు పుట్టడం లేదంటున్న ప్రభుత్వం ఇంత భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుంది, దానికోసం ప్రజలపై మళ్లీ కొత్త పన్నుల భారం మోపడం అవసరమా అని విపక్షాల నుంచి విమర్శ వచ్చింది. వెంటనే మాట మార్చిన రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు
పెడుతుందని అనలేదన్నారు. ఆ మొత్తంలో చాలా మట్టుకు ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉంటుందని సవరించారు.
మూసీ ప్రక్షాళనలో పెట్టుబడికి, నిర్వహణకు సింగపూర్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మూడురోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘గోదావరి తాగునీటి పథకంలోని రెండు దశలకు, మూసీ నది పునరుజ్జీవనం’ కోసం గండిపేట వద్ద శంకుస్థాపన చేశారు. దీనికోసం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో, వార్తల్లో స్పష్టంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వకు వీల్లేదని ఇంతకాలం చెప్తున్న ప్రభుత్వం అదే కాళేశ్వరం ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి నగరానికి నీటి మళ్లింపు పథకానికి శంకుస్థాపన జరిపింది.
ఒకవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతున్న సమయంలో అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి నీటి వాడకంపై బీఆర్ఎస్ నేతలు వేసిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. గండిపేటకు తెస్తున్నది కాళేశ్వరం నీళ్లా.. కాదా.. అనేది ముఖ్యమంత్రి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి మాట మార్చారు. గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టే మూలమని కొత్త పాట ఎత్తుకున్నారు.
ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పునాదిరాయి పడిన ఆ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం రూ.2,052 కోట్లు ఖర్చుచేసి 2016లో పూర్తి చేసిందని హరీశ్‌రావు తెలిపారు. అంతేకాకుండా మల్లన్నసాగర్ 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టినదే అని రేవంత్ అన్నారు. ఈ మాటలు కూడా వివాదాలకు తావిచ్చాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానమైన మల్లన్నసాగర్‌కు వచ్చే నీళ్లు కేవలం ఎల్లంపల్లివి అనడం సాంకేతికంగా తప్పే అవుతుంది.
మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే కట్ట తెగి కింది గ్రామాలు కొట్టుకుపోతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పదే పదే అనేవారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేయడంతో నీళ్లు వదలక తప్పలేదు. వచ్చే వానకాలం నాటికీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రక్షించుకొని, వాటి నీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నదని మంత్రి ఇటీవల అన్నారు. ఎంత వద్దనుకున్నా కాళేశ్వరం నీళ్లు వాడక తప్పని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగు అయిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోని 85 పిల్లర్లలో రెండు మాత్రమే పాక్షికంగా దెబ్బ తిన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా వరదలకు తట్టుకొని ఆ బ్యారేజీ వంద టీఎంసీల నీటి నిల్వతో ఉందని, ఆ నీళ్లతో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లలో ఎత్తిపోతలు జరుగుతున్నాయని, చుట్టూ గ్రామాల్లో పంటలు పండుతున్నాయని ఇటీవల ఆ ప్రాంతాలను పర్యటించిన బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాళేశ్వరం విషయంలో నిర్మాణం, అవినీతి, ప్రయోజనం అనే అంశాలను గంపగుత్తగా కాకుండా విడివిడిగా చూడాలి. కాళేశ్వరం నీళ్లు పంట పొలాల్లోకి వస్తున్నాయి. జనం దాహార్తి తీరుస్తున్నాయి. మూసీ నది ప్రక్షాళనకు పరుగులు తీస్తున్నాయి. ‘కూలేశ్వరం’ అనే మాట ప్రాసకు పనికొచ్చినా వాస్తవానికి సరిపోదు.
– బద్రి నర్సన్