సబ్బండ తెలంగాణ జనులారా! ఆధిపత్య శక్తులు, మతోన్మాద గుంపులు మళ్లీ వస్తున్నయ్. ఎజెండా కర్రలకు జెండా గుడ్డలు చుట్టుకొని, రంగురంగుల కండువాలతో కొంగులు ముడేసుకొని తెలంగాణ దిక్కు అడుగులు వేస్తున్నయ్. రంగస్థలాన తేనె పూసిన కత్తులు మళ్లీ మెరుస్తున్నయ్. మేకవన్నె పులులు మోఖా కోసం ఎదురుచూస్తున్నయ్. తెర మీదికి పవన్ కల్యాణ్ వచ్చిండు. అతను నటుడు. చెప్పినట్టు ఆడటమే ఆ పాత్ర ధర్మం. దర్శకులు తెర వెనుక ఉన్నారు. మైకులో స్వరం అతనిదే. కానీ మర్మం మరొకటి ఉన్నది. నాడు రాష్ట్ర ఆవిర్భావాన్ని అడ్డుకోలేకపోయామనే బాధ పడ్డ శక్తులు, నేడు అదును చూసుకొని అధికారం మీద ఆధిపత్యం కోసం మూకుమ్మడిగా కలసి వస్తున్నయ్.. తెలంగాణా..! జాగ్తే రహో!
తెలంగాణ నీ అయ్య జాగీరా’ అని ఆంధ్రా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడుగుతున్నడు. అదీ తెలంగాణ ఆవిర్భావం రోజున. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసి మూతి తిప్పింది ఇతనే. రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారని బువ్వ తినకుండా పదకొండొద్దులు పస్తులు పడుకున్నానని చెప్పుకొన్నది ఇతనే. ప్రత్యేక రాష్ర్టాన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి తనకు ఇష్టమైన నాయకుడని ప్రకటించిందీ ఇతనే. తెలంగాణోళ్ల దిష్టితగిలి ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నయని బాధపడ్డదీ ఈ కల్యాణమే. ఇతనే ఇప్పుడు తెలంగాణ నాది అంటున్నడు. కొండగట్టు అంజన్నకు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన అంటున్నడు. గద్దర్‌కు కారు కొనిచ్చిన అని చెప్తున్నడు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతు లేపేది జనసేన పార్టీనే అని బల్లగుద్దుతున్నడు. తెలంగాణను తానే పునర్నిర్మిస్తానని ఢంకా బజాయిస్తున్నడు.
నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు. తెలంగాణకు జలం అంటే కేవలం సాగు కాదు. అది రైతు ఇంట జవజీవం. ఆర్థిక స్వావలంబన, సామాజిక స్థిరత్వం, రాజకీయ ఆత్మగౌరవం. కాళేశ్వరంలో దుంకితే తెలంగాణ చెరువుల్లో గోదావరి మత్తడై పారింది. కరువునేల పంటచేలై మెరిసింది. కోస్తాంధ్రను తలతన్నే వరి పంట పండించింది. దేశానికే అన్నంగిన్నెగా నిలిచింది. కాళేశ్వరం నిలబడే ఉంటే మీ రాష్ట్ర జల ప్రణాళికలకు ఆటంకమని, గోదావరి జలాలపై తెలంగాణ హక్కు మరింత బలపడుతుందనే విషపు ఆలోచనతో ఆ ప్రాజెక్టును వివాదాల ఊబిలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొడితే.. ఆ నీళ్లను దారి మళ్లించి పోలవరం-బనకచర్ల వంటి ప్రతిపాదనలతో గోదావరి జల ప్రవాహాలపై కొత్త సమీకరణాలను సృష్టించాలనే దుష్ట పన్నాగం జరుగుతున్నది.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఇటువంటి కుట్రల్లో కూటమి ప్రభుత్వ భాగస్వామిగా మీ పాత్ర లేదా జనసేన అధినేత గారూ? ‘తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే చర్యలు తప్పని చంద్రబాబు నాయుడికి మీరు బహిరంగంగా చెప్పగలరా?’ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది… సమాధానమున్నదా?
200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించే బనకచర్ల ప్రాజెక్టు కడుతానని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్నడు. ఇదేం లెక్క అని తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తే.. వరద జలాలు తీసుకుంటే మీకేం నష్టం? అని బుకాయిస్తున్నడు. గోదావరిలో నికర జలాల లెక్కనే ఇంకా ఖరారు కాలేదు. తెలంగాణ, ఏపీ వాటాల లెక్కే తేలలేదు. ఏ లెక్కలూ తేలకుండానే.. 200 టీఎంసీల వరద జలాలు ఎక్కడి నుంచి తెచ్చినవ్ బాబూ? అని నిలదీయగలవా పవన్ కల్యాణ్? తెలంగాణ జలహక్కుల్ని బలిపెట్టే బనకచర్లను ఆపుమని అడుగగలవా? తెలంగాణ రైతాంగం అడుగుతున్నది.. జవాబివ్వగలవా? కొత్తగా నల్లమలసాగర్ అని మళ్లో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది మీ ఏపీ ప్రభుత్వం. దానికి మా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీ చంద్రబాబు లింకు పెట్టిండు.
నల్లమలసాగర్‌కు తెలంగాణ అంగీకరిస్తేనే పాలమూరు ప్రాజెక్టుకు చంద్రబాబు ఒప్పుకొంటారని కేంద్రమంత్రి ద్వారా సంకేతాలు పంపిస్తున్నడు. కృష్ణా నికర జలాల ఆధారంగా ఏనాడో రూపుదిద్దుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు, ఇంకా నీటి లభ్యతే నిర్ధారణ కాని ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధం ఏమిటి? పాలమూరు ప్రాజెక్టు చట్టబద్ధమైన తెలంగాణ హక్కు. నల్లమల సాగర్ ప్రశ్నలతో నిండిన, ఇంకా కాయితం మీదికి కూ డా రాని ప్రతిపాదన. రెండింటినీ ఒకే త్రాసు లో ఎలా వేస్తారు? ఒకే గాటన ఎలా కడుతరు? తెలంగాణ ప్రజల హక్కును రాజకీయ బేరసారా ల బల్ల మీద పెట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు చంద్రబాబు? అని గల్లా పట్టుకొని నిలదీయగలరా ఏపీ డిప్యూటీ సీఎం గారూ? బుద్ధిజీవుల ప్రశ్నకు బదులివ్వగలరా?
నాడు ఎవరి పెత్తనానికి, ఎవరి పన్నాగాలకు, ఎవరి కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాడిందో… ఈరోజు వాళ్ల రాజకీయ వాదనలు మోసుకునే పవన్ కల్యాణ్ తెలంగాణకు వచ్చిండు. నన్ను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నరు. కానీ నేను భయపడను అంటున్నడు. తమరిని రావొద్దని ఎవరు అన్నారు? పంచాయతీ ఎన్నికల్లో వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చారు.. పోటీ చేశారు. ప్రజలు కూడా తమ తీర్పు చెప్పిండ్రు. ఎన్ని చోట్ల మీకు డిపాజిట్లు వచ్చాయో మీకు తెలుసు. ఆ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో మీ రాజకీయ బలానికి కొలమానం. వివాదం తమరి రాక మీద కాదు.
మీరు మోస్తున్న రాజకీయ సందేశం మీద. రాజకీయ వాహకుడిగా మారి ముసుగు రాజకీయ సంభాషణను బయట కేంద్రాల నుంచి నిర్వచించాలనే ప్రయత్నాలను తెలంగాణ సమాజం సహించదు. బయట శక్తుల రాజకీయ ఎజెండాలను ఇక్కడి ప్రజలపై రుద్దాలని చూస్తేనే ప్రతిఘటన ఎదురవుతుంది. ‘రాజు బలహీనుడు అయినప్పుడు శత్రువు అవకాశంగా మార్చుకుంటాడు’ అనేది చాణక్య నీతి. తెలంగాణ మీద ఇప్పుడు జరుగుతున్న ఎత్తుగడలు కూడా అలాంటివే. రాజు బలహీనతను ఆసరాగా చేసుకొని కూటమిగా వస్తున్నరు. అందు లో ముందు వచ్చిన వాడు పవన్ కల్యాణ్.
తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ, తెలంగాణ పుట్టుకనే సహించని బాబు, తెలంగాణ పుట్టినప్పుడు బువ్వ ముట్టని పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఈ నేల ఆత్మను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. తెలంగాణ సమాజం ఇటువంటి వాళ్లను ఎప్పటికీ శత్రువులు గానే చూస్తుంది.
శత్రువు అంటే కేవలం సరిహద్దులు బయటి నుంచి దండెత్తుకొచ్చే వాళ్లు మాత్రమే కాదు. ఒక జాతి అస్తిత్వాన్ని అర్థం చేసుకోలేని వాడు, స్థానిక ప్రజల స్వయంనిర్ణయ హక్కును గౌరవించలేని వాడు, వారి చరిత్ర, ఆకాంక్షలు, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూసేవాడు కూడా శత్రువే. ఒకే ప్రజలను రెండు రకాలుగా చూసేవారూ.. ఒకరిపై విషం, విద్వేషం కక్కుతూ, మరోవైపు తామేదో ఉద్ధరిస్తున్నామని విర్రవీగేవారూ విరోధులకు తక్కువేమీ కాదు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ నేల శత్రువులను మొదటిసారి చూస్తున్నది కాదు. ఎవరు శత్రువులో గుర్తించలేని స్థితి లో ఏనాడూ లేదు. కాకతీయుల కాలం నుంచి, 1969 ఉద్యమం నుంచి, మలిదశ తె లంగాణ పోరాటం వరకు ప్రతి తరమూ ఆధిపత్య శక్తులతో తలపడింది. అంతిమ గమ్యాన్ని ముద్దాడింది. అటువంటి తెలంగాణతో పెట్టుకోవద్దు.
జై తెలంగాణ
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు