పదవీ విరమణ పొందిన ఓ జర్నలిస్టు మిత్రుడితో మాట్లాడుతుంటే పెన్షన్ ప్రస్తావన వచ్చింది. నాకు ఎలాంటి పెన్షన్ రావడం లేదని అతను చెప్పాడు. అలా ఎందుకని కొంతసేపు మాట్లాడిన తర్వాత అతను చెప్పిన విషయం విన్నాక బాధేసింది. ‘నాకు నెలకు రూ. 2 వేల పెన్షన్ వస్తుంది. ఈ విషయం చెప్తే నవ్వుతారు. అందుకే, ఇంట్లో కూడా చెప్పలేదు. నా ఉద్యోగానికి పెన్షన్ ఉండదని చెప్పాను. తల్లిదండ్రులతో పాటు చాలామంది బంధువులు ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ పొందారు. వాళ్లు వేలాది రూపాయలు పెన్షన్ పొందుతున్నప్పుడు నేను రూ. 2 వేల పెన్షన్ అని చెప్తే నా పరువు పోతుంది. దానికన్నా అసలు పెన్షన్ ఉండదని చెప్తేనే గౌరవం. అందుకే చెప్పలేదు’ అని నాతో చెప్పాడు. ‘మూడు దశాబ్దాల పాటు ఉద్యోగం చేస్తే, పెన్షన్ కోసం మన జీతం నుంచి కొంత జమ చేసుకొని మనకు రూ. 2 వేల పెన్షన్ ఇవ్వడానికి పాలకులకు సిగ్గు లేనప్పుడు మనకు వచ్చే పెన్షన్ ఎంతో చెప్పుకొంటే తప్పేమిటి?’ అని నా అభిప్రాయం నేను చెప్పాను.
నెలకు రూ.500 ఇస్తాను, దీంతో పండుగ చేసుకో, నెలంతా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో బతకమని ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుంది? క్రూరమైన జోక్‌గా అనిపిస్తుంది కదూ. ఓ సినిమాలో అలీ భిక్షగాడిగా నటిస్తాడు. రూపాయి నాణెం భిక్షం వేసి పండుగ చేసుకో అంటే.. ఏ పండుగ చేసుకోవాలి ‘దసరానా, దీపావళా, రంజానా?’ అని అలీ అడుగుతాడు. ఈ సీన్ సినిమాలో బాగా పండింది. సినిమా కాబట్టి నవ్వుకున్నాం. కానీ, కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కుటుంబాలపై ఇలాంటి క్రూయల్ జోక్ వేస్తూ నవ్వుకుంటున్నది. సినిమాలో ఈ జోక్ కన్నా క్రూయల్‌గా దేశంలో 13 లక్షల మందికి నెలకు కేవలం రూ.500 పెన్షన్ ఇస్తూ పండుగ చేసుకోమంటున్నారు. నెలకు రూ.500 లోపు పెన్షన్ వస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. రూ. 3 వేల పెన్షన్ వస్తే పెన్షన్‌దారుల్లో వారు సంపన్న వర్గం అన్నట్టు.
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద పదవీ విమరణ పొందిన ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారు. ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ సౌకర్యం ఉండదు. కొన్ని కంపెనీలకే వర్తిస్తుంది. మహా మహా మీడియా సంస్థల్లో సైతం ఈ మాత్రం సౌకర్యం కూడా ఉండదు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికభద్రత, వృద్ధాప్యంలో జీవన వ్యయం కోసం, వృద్ధాప్యంలో ఆదాయ భరోసా, కుటుంబ రక్షణ, ఉద్యోగులకు ప్రోత్సాహం వంటి ఎన్నో ఉదాత్త ఆశయాలతో ఈ పెన్షన్ పథకాన్ని అమలుచేస్తున్నారట. ఇచ్చేది నెలకు ఐదు వందలే అయి నా, ఆశయాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
రూ.వెయ్యి లేదా రూ.ఐదు వందల పెన్షన్‌తో రిటైర్మెంట్ జీవితాన్ని గౌరవప్రదంగా జీవించమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. గౌరవప్రదంగా బతికేందుకు ఆ ఐదు వందల రూపాయల్లో దేనికి ఎంత ఖర్చు చేయాలో కూడా కేంద్రం సూచిస్తే బాగుండేది. ఇది కూడా ప్రభుత్వం ఉదారంగా, పెద్ద మనసుతో ఇవ్వడం లేదు. ఉద్యోగి జీతం నుంచి మూడు దశాబ్దాలపాటు కొంత మొత్తం కట్ చేసుకొని పదవీ విరమణ పొందాక పెన్షన్ ఇస్తుంది.
ఈపీఎస్ 95 కింద మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 78 లక్షలు కాగా, వీరిలో 36 లక్షల మంది రూ.1000 కన్నా తక్కువ పెన్షన్ పొందుతున్నవాళ్లున్నారు. 2014లోనే కనీస పెన్షన్‌ను రూ.1000 చేశారు. కనీస పెన్షన్ వెయ్యి అంటే, ఎవరికైనా కనీసం రూ.వెయ్యి పెన్షన్ వస్తుందనుకుంటాం. దీనిలో ఓ మ్యాజిక్ ఉంది. కనీస పెన్షన్ వెయ్యి అయినా 36 లక్షల మందికి రూ.వెయ్యి లోపు పెన్షన్ వస్తుంది. 13 లక్షల మందికి రూ.700లోపు వస్తుంది. రూ.500 పెన్షన్ వచ్చే వాళ్లూ ఉన్నారు.
మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత గత పదేండ్ల నుంచి మినిమం పెన్షన్ రూ.7 వేలు చేస్తారని, కాదు, రూ.8 వేలు అని జోరుగా ప్రచారం సాగింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది చెయ్యి నొప్పి పెట్టేవిధంగా మోదీని కీర్తిస్తూ వాట్సాప్ యూనివర్సిటీల మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తూపోయారు కానీ, కనీస పెన్షన్ ఈ పదకొండేండ్లలో రూపాయి కూడా పెంచలేదు. పెన్షన్‌దారులు, రిటైర్ కావలసినవారు కోట్లలో ఉంటారు కాబట్టి, కనీస పెన్షన్ రూ.8 వేలు అని వెబ్సైట్లో వార్త రాగానే వేలమంది క్లిక్ చేస్తారు. వ్యూయర్షిప్ కోసం పదేండ్ల నుంచి చాలా వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్లు రూ.8 వేల పెన్షన్ గురించి రోజూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కానీ, కేంద్రం పైసా పెంచలేదు.
వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం గడపడానికి తెలంగాణలో రూ.2 వేల పెన్షన్ చెల్లిస్తున్నారు. ఆంధ్రాలో నెలకు రూ. 4 వేల పెన్షన్ చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో రూ.4 వేల పెన్షన్ అని చెప్పి 18 నెలలవుతున్నా అమలుచేయడం లేదు. వృద్ధులకు రాష్ర్టాలు రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తుంటే, ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం తీసుకొని కేంద్రం మాత్రం రూ.500, రూ.1000 పెన్షన్ చెల్లించడం బాధాకరం.
కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగినా, భవిష్య నిధి ట్రస్ట్ సమావేశం జరిగినా పెన్షన్ పెంచుతారని లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంటారు. పదేండ్ల నుంచి వార్తల్లో తప్ప వాస్తవంలో పెన్షన్ పెంచే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం పెన్షన్‌గా వస్తుంది. చాలామందికి ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చిన జీతం కన్నా రెట్టింపు పెన్షన్ వస్తుంది.
ఈపీఎస్ కింద హయ్యర్ పెన్షన్ చెల్లించాలని 2022, నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వచ్చిన సమయంలో జీ బిజినెస్ హిందీ ఛానల్ చూస్తున్నాను. అన్ని వార్తలు నిలిపివేసి దేశంలో కోట్ల మందిపై ప్రభావం చూపే చారిత్రాత్మక తీర్పు అని హడావుడి. చర్చలో భవిష్య నిధి రిటైర్డ్ ఉన్నతాధికారిని పిలిచారు. అంత హడావుడి చేస్తున్నా ఆ అధికారి మాత్రం నెమ్మదిగా ‘అంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు. భవిష్య నిధి ట్రస్ట్ వద్ద అన్ని నిధుల్లేవు. తీర్పును అమలుచేయడం సాధ్యం కాద’ని చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. మూడేండ్లయినా సుప్రీం కోర్టు తీర్పు అమలుకు నోచుకోలేదు. ఏదో ఒక వంకతో హయ్యర్ పెన్షన్‌ను దాటవేస్తున్నారు. కనీస పెన్షన్‌ను కూడా పెంచడం లేదు.
ఈపీఎస్ పథకం కింద జీతానికి కోత పెట్టి వెయ్యి, రెండు వేల పెన్షన్ పొందడం కన్నా ఉద్యోగంలో చేరిన మొదటి నెల అంతే మొత్తం మ్యూచువల్ ఫండ్‌లో వేసుకున్నా పదవీ విరమణ పొందిన తర్వాత ఇంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం పొందవచ్చు. నిజానికి ప్రైవేటు ఉద్యోగులే జీతం కోతతో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నారు. తాము చెల్లించే దానికన్నా పొందుతున్న పెన్షన్ చాలా తక్కువ. పెన్షన్ గురించి చెప్పుకోవడం రిటైర్డ్ అయినవారికి సిగ్గుచేటుగా ఉన్నది. కానీ, పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
– బుద్దా మురళి