ప్రపంచం మొత్తం కొవిడ్‌తో అల్లకల్లోలం అవుతుంటే పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా, ఏకపక్షంగా కేవలం క్యాబినెట్ ఆమోదంతో 2020 జులై 29న నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇదొక విషం కలిపిన తీపి పదార్థమని చెప్పవచ్చు.కీలక విషయాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యా వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయి.
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది. అయితే ప్రపంచీకరణ వేగంగా విస్తరించిన ఈ పోటీ ప్రపంచ కాలంలో ఇంగ్లీష్ మీడియంలో చదవడానికే చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలనే నిబంధన సరైనది కాదు! ఈ విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. ఈ నిబంధనను కార్పొరేట్ పాఠశాలలు పాటిస్తాయా అనే అనుమానం ఉంది. మాతృ భాషలో బోధనతో పాటు, సంస్కృత భాషను విద్యార్థి ఐచ్ఛిక భాషగా తీసుకోవాలని ఈ విద్యా విధానం సూచిస్తున్నది. దేశంలో విద్యను కాషాయికరణ చేస్తున్నారనడానికి ఇది ఉదాహరణ అని కొందరు మేధావులు, లౌకిక వాదులు విమర్శిస్తున్నారు.
పిల్లల్లో సృజనాత్మకత పూర్వ ప్రాథమిక విద్యా దశలోనే పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమయంలో మెదడు ఎదుగుదల ఉంటుందని సైన్స్ చెబుతున్నది. ఎదిగే పిల్లలకు చదువుతో బాటు పౌష్టికాహారం ముఖ్యం. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్ వాడీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ అంగన్ వాడీలను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని ఈ కొత్త విద్యా విధానం సూచిస్తున్నది. ఈ అనుసంధానం భవిష్యత్తులో అంగన్వాడీల ఎత్తివేతకు కారణం కావచ్చు.
బోర్డు పరీక్షలు 3, 5, 8, 10, 12వ తరగతులకు ఉంటాయని ఈ విద్యా విధానం సూచించింది. ఈ పరీక్షలను పూర్తిగా కేంద్రం అధీనంలోని టెస్టింగ్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వృత్తి విద్యలను నేర్పిస్తాం అని చెప్పడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఫెయిల్ అయిన వారికి విద్యను శాశ్వతంగా దూరం చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ విధానం రూపొందించినట్టు అర్థం అవుతున్నది. పైగా ఎలాంటి వృత్తి విద్యలు నేర్పిస్తామనే విషయాన్ని ఇందులో స్పష్టంగా వివరించలేదు.
డిగ్రీ కోర్సును నాలుగేళ్లు చేయడం, డిగ్రీలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో పరీక్ష రాయాలని ఈ విధానంలో చెప్పడం రాజ్యాంగ లక్ష్యాల్లో ఒకటైన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పటికే ‘నీట్’ పేరుతో వైద్య విద్యను కేంద్రం రాష్ర్టాల నుంచి లాక్కొని దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నది. దీని వల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఆ అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేక వైద్య విద్యకు దూరం అవుతున్నారు! నాలుగేళ్ల డిగ్రీ కోర్సు కూడా విద్యార్థులకు భారంగా మారనుంది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో కూడా మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్, రెండో ఏడాది పూర్తి చేస్తే డిప్లొమా, ఇలా సంవత్సరం లెక్కన సర్టిఫికెట్లు ఇవ్వాలనుకోవడం ఉన్నత విద్యలో స్థూల జాతీయ నమోదు నిష్పత్తి పెరిగినట్టు చూపించటానికి మాత్రమే.
స్థూల నమోదు నిష్పత్తిని పెంచడం, జీడీపీలో 6 శాతం నిధులు విద్యకు కేటాయించడం, నిర్బంధ విద్యను 3 ఏండ్ల వయస్సు గల పిల్లల నుంచి అమలు చేయడం, మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ అమలు లాంటి కొన్ని నుంచి ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నాయి. కానీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా, విద్యను ప్రైవేటీకరించేలా ఈ విధానంలో చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగంలో మొదట విద్య రాష్ర్టాల జాబితాలో ఉండేది. ఆ తరువాత రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. దీంతో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల అనుమతి లేకుండా కేంద్రం విద్యా విధానాలను రూపొందిస్తున్నది. కొత్త విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానించడం ఇందుకు ఉదాహరణ. డిజిటలైజేషన్లో భాగంగా ఆన్లైన్ విద్యకు ఈ కొత్త విద్యా విధానం ప్రాధాన్యతను ఇచ్చింది. ఇది పేద విద్యార్థులకు భారంగా మారనుంది. విదేశీ యూనివర్సిటీలను దేశంలోకి ఆహ్వానించడం ద్వారా త్వరలో దేశంలో కార్పొరేట్ యూనివర్సిటీలు ప్రవేశించి విద్య మరింతగా వ్యాపారీకరణ జరిగే అవకాశం ఉంది. స్థూలంగా ఈ కొత్త విద్యా విధానం ధనికుల కోసం ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తున్నది. ఈ విద్యా విధానాన్ని తెలంగాణ, తమిళనాడు సహా చాలా రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా కేంద్రం వెబ్సైట్లో వచ్చిన సూచనలను మాత్రమే పరిగణనలోనికి తీసుకొని ముందుకు వెళ్లడం ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
కొత్త విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. విదేశీ యూనివర్సిటీలను దేశంలోకి ఆహ్వానించడం ఇందుకు ఉదాహరణ.
కె.శ్యామ్:93980 04592