‘మునుగోడు జనం ఓట్లు గుద్దితే ఢిల్లీ గద్దె దద్దరిల్లాలె’ అని చండూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు నియోజకవర్గం అంతటా ప్రతిధ్వనించింది. పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా వచ్చిన ఓటర్లే దీనికి సాక్ష్యం. మునుగోడు ప్రజలు ప్రజాస్వామ్య పండుగను గొప్ప స్ఫూర్తి మంతంగా జరుపుకొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్దే విజయం అని ప్రకటించాయి. ‘మీరిచ్చే మెజారిటీనే బీఆర్ఎస్కు పునాది’ అని కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ నమూనాను దేశవ్యాప్తం చేసే మహాప్రస్థానానికి మునుగోడు తొలి అడుగు వేసిన సూచనలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఉప ఎన్నికలు అక్కడి ప్రజాప్రతినిధి మరణిస్తేనో, ఏదైనా బలీయమైన కారణంతో రాజీనామా చేస్తేనో వస్తుంటాయి. కానీ, మునుగోడు ఉప ఎన్నిక ఈ రెండు విధాలా రాలేదు. దేశ రాజకీయాల్లో తమకు గట్టి సవాల్‌గా మారుతారని భావిస్తున్న కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ తీసుకొచ్చిన ఉప ఎన్నిక ఇది. దీనికోసం అదానీని కూడా పక్కనపెట్టి రూ.18 వేల కోట్ల భారీ కాంట్రాక్టును రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర పాలకులు బహుమతిగా ఇచ్చారు. ఈ కారణంగా ఈ ఉప ఎన్నికలో డబ్బుమూటలు మంచినీళ్లలాగా ప్రవహించాయి. రాజగోపాల్‌రెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టటానికి చేయని ప్రయత్నం లేదు.
ఆయన కంపెనీ సుశీ ఇన్ఫ్రా నుంచి కోట్ల రూపాయల మొత్తాలు స్థానిక బీజేపీ నేతల బ్యాంకుఖాతాల్లో అకస్మాత్తుగా జమ అయ్యాయి. ధనబలాన్నే నమ్ముకున్న ఆయన ప్రజల మీద అనేకసార్లు నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నాలుగేండ్లు ఏం చేశావంటూ ప్రజలు ప్రశ్నించినప్పుడు వారిపై బూతులు లంకించుకోవటం, తన అనుచరులతో దాడులు చేయించటం రాజగోపాల్‌రెడ్డికి, ఆయన ప్రాతినిధ్యం వహించిన బీజేపీకి ప్రజలపై ఉన్న చిన్నచూపును తెలియజేసింది.
మునుగోడులో గెలవటానికి బీజేపీ అనేక కుట్రలకు తెగబడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనుగోలు చేసి, తమ పార్టీలో చేర్చుకొని, టీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ఢిల్లీ కేంద్రంగా పథక రచన చేసింది. కానీ, కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మర్చిపోలేని గుణపాఠం నేర్పించారు. కకావికలమైన కాషాయ శ్రేణుల నాయకుడు తడిబట్టల ప్రమాణం అంటూ చేసిన డ్రామా కూడా రక్తికట్టలేకపోయింది. ఏ రకంగానూ తమ ఆటలు సాగకపోవటంతో, వృద్ధమహిళల చేతుల మీద గోరింటాకు వేసి వారి ఓట్లు చెల్లకుండా చేయటం వంటి పనులకూ బీజేపీ పాల్పడింది. టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన గుర్తులను పలువురికి కేటాయించి ఎన్నికల సంఘం కూడా వివక్ష చూపింది. ఇన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఢిల్లీ గద్దె దద్దరిల్లేలా మునుగోడు ఓటర్లు స్పందించారు. సత్యమేవ జయతే.