Sonu Sood | సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ వ్యసనం యువతను, చిన్నారులను పెను ప్రమాదంలోకి నెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆన్లైన్ గేమింగ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని గతంలోనే కోరిన ఆయన.. ఈ తాజా ఘటన నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని బలంగా వినిపించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘ఘజియాబాద్‌లో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారు హింసకో, పేదరికానికో బలవ్వలేదు.. ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ వ్యసనం సృష్టించిన కనిపించని ఒత్తిడికి బలైపోయారు. నేను మళ్ళీ చెబుతున్నాను.. చదువు కోసం తప్ప, మిగతా అన్ని విషయాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్‌లను నిషేధించాలి. బాల్యానికి కావాల్సింది సరైన మార్గదర్శకత్వం, ప్రేమ.. అంతే కానీ అల్గారిథమ్స్, స్క్రీన్లు కాదు. ఇది ఎవరినో నిందించడం కోసం కాదు, మన పిల్లలను కాపాడుకోవడం కోసం చేస్తున్న విజ్ఞప్తి. ఈ ఘటనను మరో వార్తగా చూసి మర్చిపోవద్దు.. ఇప్పుడైనా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’. అంటూ సోనుసూద్ రాసుకోచ్చాడు.
Social media can wait. Childhood can’t. 🙏 pic.twitter.com/KByJ38D1oS
— sonu sood (@SonuSood) February 4, 2026