న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక పరిణామం చోటుచేసుకుంటున్నది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రూ.950 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం(ఎస్ఎల్సీ) నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్రంగానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్ స్పేస్) దీనికి సంబంధించిన అర్హులైన భారత ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కొత్త స్పేస్‌పోర్ట్ ద్వారా చిన్న రాకెట్ల ప్రయోగాలు మరింత సులభతరం కానున్నాయి. శ్రీహరి కోట నుంచి ప్రయోగాల సమయంలో శ్రీలంకను తప్పించుకునేందుకు అధిక ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తున్నది. అయితే కులశేఖరపట్నం నుంచి నేరుగా దక్షిణం వైపు రాకెట్లను ప్రయోగించడం ద్వారా ఇంధన ఆదా జరుగడంతో పాటు పేలోడ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇస్రో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం(ఎస్ఎస్ ఎల్వీ)తోపాటు స్కైరూట్, అగ్నికుల వంటి ప్రైవేట్ రాకెట్ల ప్రయోగాలకు ఇది ప్రత్యేక కేంద్రంగా మారనుంది. ఎంపికైన ప్రైవేట్ సంస్థకు ఇస్రో సాంకేతిక మార్గదర్శకత్వం, ప్రారంభ ప్రయోగాల సమయంలో శిక్షణ అందిస్తుంది. అయితే ఈ బిడ్లలో పాల్గొనే కంపెనీలకు కఠినమైన ఆర్థిక, అనుభవ ప్రమాణాలను విధించారు. గత ఏడేండ్లలో కనీసం రూ.3,500 కోట్ల ప్రాజెక్ట్ టర్నోవర్ కలిగి, రూ. 1,000 కోట్ల నికర విలువ కలిగిన భారతీయ సంస్థలు మాత్రమే అర్హమైనవని స్పష్టం చేసింది.