Sweet Potatoes | మన ఆరోగ్యానికి మేలు చేసే దుంప జాతి ఆహారాల్లో చిలగడదుంపలు కూడా ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి సహజంగానే తీపి రుచిని కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. చిలగడదుంపలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని కాల్చుకుని, వేయించి, ఉడికించి అనేక రకాలుగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని వండే విధానమే రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిని ఎక్కువగా ప్రాసెసింగ్ చేయడంతో పాటు కొన్ని వంట పద్దతుల కారణంగా చిలగడదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందని అలాంటి సమయంలో వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
చిలగడదుంపను వండే విధానం గ్లెసెమిక్ ఇండెక్స్ ను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిలగడదుంపను కాల్చి వంట చేస్తూ ఉంటారు. తొక్క తీసి కాల్చడం వల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 94 వరకు చేరుకుంటుంది. తద్వారా ఇవి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాల్లో చేరిపోతాయి. కాల్చిన చిలగడదుంపలతో పాటు తెల్లబియ్యం, బంగాళాదుంపలు వంటి వాటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. కాల్చిన చిలగడదుంపలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని కాల్చి తీసుకోకపోవడమే మంచిది. అలాగే చిలగడదుంపలను వేయించడం కూడా మంచిది కాదు. వేయించడం వల్ల వాటిలో ఉండే స్టార్చ్ నిర్మాణం మారుతుంది. వేయించడం వల్ల ఇవి చక్కెరతో సమానంగా మారిపోతాయి. అంతేకాకుండా వేయించడం వల్ల నూనె కారణంగా వచ్చే అధిక క్యాలరీలు కూడా శరీరంలోకి వెళ్తాయి. దీంతో ఆరోగ్యప్రయోజనాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర, బరువు పెరిగే అంశాలను దృష్టిలో ఉంచుకుని వీటిని వేయించి తీసుకోకపోవడమే మంచిది.
చిలగడదుంపలను ఉడికించి తీసుకోవడం అన్నింటి కంటే మంచి పద్దతని నిపుణులు చెబుతున్నారు. ఉడికించడం వల్ల చిలగడదుంపలు సాధారణం నుండి మధ్యస్థ గ్లైసెమిక్ సూచికలోకి వస్తాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎక్కువగా ప్రభావితం చేయవు. ఎక్కువ సమయం ఉడికించడం వల్ల వాటి స్టార్చ్ నిర్మాణంలో మార్పులు వస్తాయి. అలాగే ఉడికించడం వల్ల ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులతో పాటు ఇతరులు కూడా వీటిని ఉడికించి తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే వీటిని బేక్ చేసి కూడా తీసుకోవచ్చు. బేక్ చేయడం వల్ల ఇవి మధ్యస్థ గ్లైసెమిక్ సూచికలోకి వస్తాయి. వీటిని ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు లేదా ప్రోటీన్ తో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. చిలగడదుంపలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని వండే విధానంలో వచ్చే తేడాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చిలగడదుంపలను కాల్చి, వేయించి తీసుకోవడానికి బదులుగా ఉడికించి, బేక్ చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని వారు సూచిస్తున్నారు.