‘ఒక దేశం-ఒక పార్టీ’ దిశగా దేశాన్ని బీజేపీ తీసుకువెళ్తున్నది. 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ప్రధాని, సీఎం ఎవరైనా రాజీనామా చేయాలి లేదా పదవీ దానంతట అదే ఊడిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్నది. బీజేపీకి ఉన్న బలం, విపక్షాలకున్న బలహీనత, మిత్రపక్షాల నిస్సహాయత వల్ల ఈ బిల్లు చట్టం కావడం పెద్ద కష్టమేమీ కాదు.
తమను పాలించేవారు పరిశుద్ధులై ఉండాలని ప్రజలు కోరుకుంటారు. నేరాలు చేసి జైల్లో ఉన్నవారు ప్రధానిగా, ముఖ్యమంత్రులుగా తమను పాలించాలని ఏ పౌరుడూ కోరుకోడు. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ చట్టం ద్వారా పరిపాలనలో నీతి నిజాయితీ నిలబెట్టడం సాధ్యమవుతుందని ప్రభుత్వం చెప్తున్నది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు జరిగిన మారణహోమంతో అమెరికాలో అడుగుపెట్టరాదని నిషేధం విధించారు. అమిత్ షాను నేరారోపణలతో గుజరాత్ నుంచి బహిష్కరించారు. వీరి కేసులను విచారించిన పోలీసు అధికారులు శంకరగిరి మాన్యాలు పట్టారు. అధికారులు, న్యాయమూర్తులు అనుమానాస్పదంగా మృతిచెందారు. అలాంటి మోదీ ప్రధానిగా, అమిత్ షా హోంమంత్రిగా పదవుల్లో ఉండకుండా, పాలనలో నీతి నిజాయితీ నిలబెట్టడం కోసం చట్టం తీసుకురావడం వింతే.
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ సవరణ తమ రాజకీయ ప్రత్యర్థులను, తమ మిత్రపక్షాలను, మొత్తం దేశాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో భాగమే. ఈ పదకొండేండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ర్టాల్లో తీసుకున్న నిర్ణయాలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రి రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పక్షాన్ని దించేసి తమవారిని అందలమెక్కిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బెదిరింపుల ద్వారా అక్కడి నాయకులను చెప్పు చేతుల్లో ఉంచుకుంటున్నారు. అలా లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టడం ఇదీ ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న ప్రేమ.
అరుణాచల్‌ప్రదేశ్‌లో 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ముఖ్యమంత్రి ఖండూను బీజేపీలోకి చేర్చుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మణిపూర్, గోవా, పుదుచ్చేరిలో ఇలానే ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. మధ్యప్రదేశ్‌లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 2020లో జ్యోతిరాదిత్యతో పాటు కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరగా కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్‌సింగ్ చౌహన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019లో కర్ణాటకలో ఇలానే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. పదేండ్లలో ఆరు రాష్ర్టాల్లో ఇలా దొడ్డిదారిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇదీ ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న నమ్మకం.
ఇక నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల రికార్డును పలు సంస్థలు ప్రకటించాయి. 94 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి. రాజకీయాల్లో నేర ప్రవృత్తి నివారణకు రాజ్యాంగ సవరణకు పూనుకున్న పార్టీలోనే అత్యధికంగా కేసులున్న ఎంపీలున్నారు. వీరంతా రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటు వేస్తారు మహానుభావులు. కాంగ్రెస్‌కు 99 మంది పార్లమెంట్ సభ్యులుంటే వీరిలో 49 మందికి నేర చరిత్ర ఉన్నది. మొత్తం 220 మంది పార్లమెంట్ సభ్యులకు నేర చరిత్ర ఉన్నది. పార్టీలకతీతంగా నేరచరిత్ర గల ఎంపీలు మాత్రమే ఒక గ్రూపుగా ఏర్పడితే వీళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం దేశంలో 30 మంది ముఖ్యమంత్రులకుగాను 12 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో అత్యధిక కేసులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా, చంద్రబాబు 3వ స్థానంలో ఉన్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు తలుచుకుంటే నచ్చని నాయకుడిపై కేసులు పెట్టి 30 రోజులు కస్టడీలో పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నిజంగా ప్రజాస్వామ్యంపై అంత అభిమానం ఉంటే పార్టీ మారిన వారి సభ్యత్వం తక్షణం రద్దయ్యే విధంగా చట్ట సవరణ చేసేవారు. పార్టీలు మార్చి ప్రభుత్వాలను కూల్చేది వారే కాబట్టి చట్టంలో మార్పు తీసుకురారు. కానీ, తమ మాట వినని నాయకుడు పదవిని కోల్పోవడమే కాదు, జైలు పాలవుతారని బెదిరించే విధంగా 130వ రాజ్యాంగం సవరణకు పూనుకుంటున్నారు. ఈ బిల్లు చట్టం అయితే విపక్షాల ముఖ్యమంత్రులే కాదు, మిత్రపక్షాల ముఖ్యమంత్రులు సైతం బీజేపీ కనుసన్నల్లో పని చేయాల్సిందే. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి అన్ని రాజకీయపక్షాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొని ముఖ్యమంత్రులను కీలు బొమ్మలుగా మార్చే ప్రయత్నమే 130వ రాజ్యాంగ సవరణ ప్రయత్నం. ఒక దేశం -ఒకే పార్టీ దిశగా బీజేపీ వేస్తున్న అడుగులు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.
– బుద్దా మురళి