కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలన అంతా పైన పటారం, లోన లొటారమేనని తేలిపోయింది. విశ్వగురు, వికసిత్ భారత్‌గా దేశాన్ని మోదీ తీర్చిదిద్దుతున్నారని, స్వతంత్ర భారతంలోనే మోదీ పాలన స్వర్ణయుగమని బీజేపీ బృందాలు విశేషణాలు జోడించి మరీ భజనలు చేశాయి. కానీ ఇప్పుడు అసలు రంగు బయటపడింది. సాక్షాత్తు మోదీనే తన గాలిబుడగను తానే పేల్చుకున్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నదని చేతులెత్తేశారు. ఆర్థికం అదుపు తప్పిందని చెప్పేశారు.
మోదీ తెలంగాణకు వస్తున్నారు, వరాలు ఇస్తారంటూ గల్లీ బీజేపీ లీడర్లు ఎప్పటిలాగే హడావుడి చేశారు. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా రాష్ర్టానికి ఇచ్చిన వరాలో, వరహాలో ఏమీ లేకపోయినా.. ప్రచారం మీద బతికే అలవాటు వారిది. తీరా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చి ప్రసంగ కవాతు చేసిన మోదీ పీచే ముడ్ అంటూ అటు బీజేపీ శ్రేణులను, ఇటు జనాలను ఉలిక్కిపడేలా చేశారు. దేశం పరిస్థితేం బాగాలేదని, ప్రజలు విలాసాలు తగ్గించుకోవాలని, దుబారా ఖర్చు పెట్టకూడదని సుద్దులు చెప్పారు. తెలంగాణకు ఏవో పైసలిచ్చి పోతారని అనుకుంటే పైజామాలో రెండు జేబులు తెరిచి తూచ్ అన్నారు.
సరే, దేశం ఆర్థికంగా అధ్వానంగా ఉన్నది. సంక్షోభంలో కూడా చిక్కుకున్నది. మరి ప్రధాని అయిన మోదీ, ఎలా గట్టెక్కిస్తారో చెప్పాలి కదా! కానీ ఆ బాధ్యతను కూడా ప్రజల భుజాలపై పడేశారు. నిండుకున్న దేశ ఖజానా నిండుకుండలా తయారయ్యేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. ఏడాదిపాటు ప్రజలు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, ఫంక్షన్లకు బంగారం కొనుగోలు చేయవద్దని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలని, సొంత వాహనాలు వదిలిపెట్టి మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజారవాణాను ఆశ్రయించాలని నొక్కి వక్కాణించారు.
కానీ వ్యక్తిగత వాహనాలను తగ్గించుకొంటే, జనమంతా ప్రయాణించేందుకు సరిపడా ప్రజారవాణా వ్యవస్థ ఉన్నదో లేదో మోదీకి తెలుసా? యూరియా వాడకం కూడా తగ్గించాలని రైతులకు కూడా సలహా ఇచ్చారు. విదేశీటూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల మోజును వదిలిపెట్టాలని ప్రధాని సెలవిచ్చారు. విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, బంగారం కొనుగోళ్లు ఎంత మంది ప్రజలు చేస్తున్నారు? ఇప్పటికే యూరియా కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
ఇప్పుడు ఇంకా కోత పెట్టాలంటే రైతులు నట్టేట మునగాలా? ఆఖరికి వంట నూనె వాడకం కూడా తగ్గించుకోవాలని చెప్పారు. సరుకుల లిస్ట్ నుంచి విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను తొలగించాలని చెప్పుకొచ్చారు. అంటే వ్యాపార సంస్థలకు అంతా దోచిపెట్టగా పాలకుల అసమర్థతతో కుదేలైన అర్థిక రంగాన్ని ఇప్పుడు ప్రజలు కడుపులు కట్టుకొని నిలబెట్టాలన్నమాట. అదే దేశభక్తి అంట, ఇదొక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని ఎవరైనా అనుకోవడంలో ఏమైనా తప్పవుతుందా?
దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ నిస్సహాయతను ప్రదర్శించడానికి కారణాలు ఏమై ఉంటాయి? 12 ఏండ్ల బీజేపీ పాలనలో దేశం ఆర్థిక రంగంలో విధ్వంసానికి గురైంది. రెండు వ్యాపార దిగ్గజాలకు దేశాన్ని దోచిపెట్టగా ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది. ఇదే అసలు కారణం. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే డాలర్ రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కానీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ కుదుపునకు కారణమైంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.60 కాగా, 2026 నాటికి రూ.94కు చేరింది.
దేశంలో వృద్ధి రేటు 2014లో 7.41శాతం ఉంటే, 2026లో 6.5గా నడుస్తున్నది. ఇలా ఏ రంగం తీసుకున్నా పతనావస్థనే కనిపిస్తున్నది. 2014లో నాటి ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడిన మాటలు ఇప్పుడు చూస్తే నవ్వుకోని జనాలు ఉండరు. ఇంత జరుగుతున్నా బీజేపీ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా, విశ్వగురుగా అవతరించిందంటూ కమలం పార్టీ ప్రచారకులు ఊదరగొట్టారు. కానీ వాస్తవం ఏంటో స్వయంగా మోదీనే సెలవిచ్చారు.
అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులవుతుంటే దేశంలో పేదలు మరింత పేదలు అవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేయడం మంచిది కాదని సెలవిచ్చే కేంద్రం పెద్దలు, బడా వ్యాపారుల వేలకోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాత్రం మాఫీ చేస్తారు. దేశ సంపదను కొల్లగొట్టేవాళ్లతో స్నేహం చేసే పాలకులు చెప్పే ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే.. పేద ప్రజలు కడుపు కట్టుకొని దేశభక్తిని చాటుకోవాలంట. బడాబాబులు దోచుకున్న సంపదను కక్కించి పాలకులే తమ దేశభక్తి చాటుకోవచ్చు కదా!