దేశంలో నేర, కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది మంచి, ఏది చెడు? అనే చర్చ జరగాలి. ఏది నిజం, ఏది అబద్ధమో తేలుస్తూనే వర్తమాన వాస్తవాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశమంతా విషం చిమ్ముతూ కాషాయ రాజ్యస్థాపన కోసం కదం తొక్కుతూ కుట్రలకు తెర లేపుతున్న వారి పట్ల జాగరూకతతో మెలగాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఇవి.
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతున్నదనే నిజాన్ని యావత్ దేశమే ఒప్పుకొంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 13 అవార్డులు ప్రదానం చేయడమే దానికి తాజా ఉదాహరణ. ఇప్పుడు దేశంలోని నేరపూరిత రాజకీయాలను ఓసారి పరికించి చూద్దాం. 2004లో 24 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే, 2009 నాటికి అవి 30 శాతానికి చేరుకున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.
2014లో 34 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే, 2019లో అవి 43 శాతానికి పెరిగాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. 2009 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో మహిళలపై నేరాలకు పాల్పడినట్లు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 231 శాతం పెరిగిందని ఒక అధ్యయనంలో తేలింది. ఇదే కాలానికి మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదైన లోక్‌సభ ఎంపీల సంఖ్య 850 శాతం పెరిగింది. వీరిలో అత్యధికులు బీజేపీకి చెందినవారే. అంటే నేరగాళ్లను, మోసగాళ్లను భారతీయ జనతా పార్టీ పెంచి పోషిస్తున్నదని ఈ నివేదికల్లోని నిగూడార్థం. అంతేకాదు, గత ఐదేండ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులున్న 66 మంది అభ్యర్థులకు ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.
రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 46 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, బీఎస్పీకి చెందిన 40 మంది అభ్యర్థులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో 23 మంది వారసులకు టికెట్లు కేటాయించగా 70 మందికి పైగా నేరగాళ్లకే బీజేపీ టికెట్లివ్వడం ఆ పార్టీ నేరపూరిత రాజకీయాలకు నిదర్శనం. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ అవినీతికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, భారతీయ జనతా పార్టీలోని 35 శాతం మంది పార్లమెంటు సభ్యులపై క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. 22 శాతం మందిపై కోర్టుల్లో తీవ్రమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీవ్రమైన కేసులున్న 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్లో మంత్రులుగా చెలామణి అయ్యారు. క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న అభ్యర్థులను ఆలింగనం చేసుకునే విషయంలో బీజేపీ ఏనాడూ వెనక్కి తగ్గలేదు.
తొమ్మిదేండ్లలో తెలంగాణలోని పల్లెలు కొత్త రూపును సంతరించుకున్నాయి. పల్లె స్థితిగతులు పూర్తిగా మారి తెలంగాణ నేడు దేశంతో పోటీపడే స్థాయికి ఎదిగింది. తెలంగాణ తనకు తానుగా పునర్నిర్మించుకుంటూ 79 కేంద్ర అవార్డులు గెలుచుకున్నది. ఇక నగరాలు, పట్టణాల్లో పోటీ పడితే హైదరాబాద్‌ను మించిన మేటి నగరం దేశంలో మరొకటి లేదనడంలో సందేహం లేదు.
ఇక రాష్ర్టాల వారీగా చూస్తే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనింగ్ మాఫియా సహా అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతున్నది. దాని పాప ఫలితం ఈ దఫా ఎన్నికల్లో అక్కడ కొట్టొచ్చినట్టు కనడుతున్నది. పీఎం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కల్తీ సారా మరణాలు, డ్రగ్స్ అడ్డా నుంచి మొదలు అక్కడున్న అవినీతి మరెక్కడా లేదు. ఇక యూపీ గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీ హయాంలో ఈ దేశం తుపాకులకు, లాకప్ డెత్‌లకు, మాఫియా ముఠాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, శాంతిభద్రతలు కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో యూపీలోని యోగి సర్కార్ విఫలమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు లెక్కే లేదు. ఇలా చెప్పుకుంటే పోతే బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పోలిస్తే నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా అవగతమవుతుంది. తెలంగాణలో పేకాట క్లబ్‌ల పతా లేదు. గడుంబా బట్టీల్లేవు. మాఫియాలు, గ్యాంగ్స్టర్ల ఊసే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో సుభిక్ష, సుస్థిరత, సుపరిపాలన సాగుతున్నది.
ఛిద్రమైన నాటి తెలంగాణ పల్లె బతుకుల స్మృతిలోకి వెళ్తే గుండెలు బరువెక్కుతాయి. అలాంటి తెలంగాణ ఇవ్వాళ ఆదర్శ రాష్ట్రంగా, సుభిక్షంగా వర్ధిల్లుతున్నది. ఇక్కడి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్నది. అందుకే తెలంగాణకు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గాని, దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు గాని ఎక్కడా పొంతన లేదు.
మొత్తంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు తొమ్మిదేండ్లుగా ఆటవిక పాలన అందించింది. అందుకే యావత్ భారత ప్రజానీకం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశానికి కనపడుతున్న నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన ఈ దేశానికి నాయకత్వం వహిస్తే అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగెడుతాయని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
– గుంటిపల్లి వెంకట్ 94949 41001