ఒక దినపత్రికలో ఇటీవల కేసీఆర్ గురించి ప్రచురితమైన తాటికాయంత శీర్షిక ఆయనపై దుష్ప్రచారానికి పరాకాష్ఠ. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య నాయకుడిపై ఆ వార్తా పత్రిక విషం కక్కిందనడానికి ఆ శీర్షికే నిదర్శనం. ప్రజాస్వామ్యంలో మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణిస్తుంటాం. అలాంటిది ఒక పత్రికకు ప్రజా జీవితంలో ఏ వార్త ప్రధానమో, ఏది కాదో అర్థం కాని పరిస్థితి నెలకొనడం శోచనీయం.
ఆ పత్రికకు ఎంత కసి, కక్ష ఉంటే తప్ప ఇంతటి దుస్సాహస శీర్షికతో కూడిన ఒక వార్త ప్రచురిస్తుంది? ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, విలువలు పాటించవలసిన జర్నలిజం.. నిజనిర్ధారణ సిద్ధాంతాన్ని గాలికి వదిలేసి, విద్వేషపూరిత విష ప్రయోగం మనుషుల మస్తిష్కాల్లోకి జొప్పించజూడటం హేయనీయం. కేసీఆర్ వ్యక్తిత్వ హననానికి నిర్లజ్జగా, నిర్హేతుకంగా సదరు పత్రిక పూనుకోవడం అత్యంత దారుణం. మానసిక హీన దుర్బల ఉద్వేగంలో ఉచ్ఛరించిన పదజాలాన్ని సార్వజనీన ఆమోదమైందని, సత్యదూర భావనలను ప్రచురించడం ఏ పాటి జర్నలిజం నైతిక వర్తనమో అర్థం కావడం లేదు.
దేశ కాలమాన పరిస్థితులను, సమస్యల విషవలయంలో చిక్కుకున్న ప్రజలను కాపాడుకోవడానికి సువిశాల మానవీయ దృక్పథంతో విలువలకు కట్టుబడి భావనలను వ్యక్తపరచవలసిన పత్రిక చేయవలసిన పని ఇదేనా? పొద్దస్తమానం మానవ ఉద్వేగాలతో ఆటలాడుతూ జర్నలిజాన్ని పచ్చి వ్యాపారాత్మకంగా, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం బలి చేస్తూ సంయమనం, సుహృద్భావం, ప్రజా సంక్షేమం.. ప్రమాణాలుగా విరజిల్లవలసిన మాధ్యమం పచ్చి ప్రకోపాల వ్యక్తీకరణకు వాహకమై ప్రజలను రెచ్చగొట్టి సమాజ కల్లోలానికి ప్రేరేపించడం విచారించదగిన దుష్పరిణామం.
ఉద్రేకాలను పురిగొల్పుతూ తాము సంధించే విషపూరిత, విద్వేషపూరిత శీర్షికల వల్ల సాధించేదేముంది? ఏ రాజకీయ పక్షాన్నో, ఏ పార్టీ నాయకుడినో సమర్థించి తను పబ్బం గడుపుకోవడానికి జర్నలిజం వ్యవస్థనే సాధనంగా మలుచుకోవడం ఒక దుష్ట సాంప్రదాయం. భారత రాజ్యాంగం ప్రసాదించిన ‘స్వేచ్ఛ’ వెర్రితలలు వేస్తున్న జర్నలిజం నియంత్రణ కోల్పోయి ఇలాంటి శీర్షికలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నది. తమ స్వార్థపూరిత పరిధిలో సమాజాన్ని నియంత్రించాలనుకోవడం పరమ దుర్మార్గం. ఏది రాస్తే ప్రజలకు చేరుతుందనేది ప్రధానం కాదు. ఏది రాసినా చెల్లుబాటు అవుతుందని.. స్వేచ్ఛ పేరుతో ఇంతగా దిగజారిన పరిస్థితిని కల్పించే ఏ మాధ్యమమైనా ఖండనీయమే.
రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అహరహం తపించి, రాష్ర్టాన్ని సాధించి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. దేశంలో ఎవరికీ ఊహకందని నిర్మాణాత్మక ప్రగతి పథకాలను ప్రవేశపెట్టి, సర్వవిధాలుగా తెలంగాణను తీర్చిదిద్దిన మహా మనీషి కేసీఆర్. అలాంటి వ్యక్తిని కించపరుస్తూ అదే సెన్సేషనల్ వార్తగా ప్రచురిస్తూ పైశాచికానందాన్ని పొందడం జర్నలిజానికి ఒక మాయని మచ్చ.
– కె.లక్ష్మణ్ గౌడ్ 97049 30509