లోక్‌సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. పాతకాలం నాటి డీ లిమిటేషన్ విధానాన్ని అమలుచేస్తే దక్షిణాదికి కలిగే నష్టంపై నిర్వహించిన ఈ సమావేశంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.
సమకాలీన రాజకీయాల్లోని స్వార్థపూరిత ధోరణులు, గెలుపు-ఓటములు, అధికార పదవుల చుట్టూ తిరిగే సాధారణ రాజకీయ ప్రసంగాలకు విభిన్నంగా, వినూత్నంగా, విప్లవాత్మకంగా ఓ స్వరం వినిపించింది. ఈ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రులు, సీనియర్ నేతల్లో అతి చిన్న వయస్సు కేటీఆర్‌ది. అయితే, వాగ్దాటితో కూడిన భాషా ప్రయోగంగా మాత్రమే కేటీఆర్ ప్రసంగాన్ని చూడవద్దు. భారత జాతి నిర్మాణంలో దశాబ్దాల పాటు అపూర్వ భాగస్వామ్యం అందించిన దక్షిణాదికి డీ లిమిటేషన్ వల్ల జరిగే నష్టాలను, అందుకు పరిష్కారాలను సూచించిన తీరు అద్భుతంగా తోచింది. 12 నిమిషాల పాటు సాగిన కేటీఆర్ ప్రసంగం దేశ రాజకీయ ప్రసంగాల్లో అత్యంత కీలకమైన ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోతుంది.
కేటీఆర్ తన ప్రసంగాన్ని తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ చరిత్రను గర్వంగా జాతీయ రాజకీయ వేదికపై సొంతం చేసుకుంటూ, దేశ అస్తిత్వ రాజకీయాల్లో ద్రవిడ ఉద్యమం, తమిళ ఉద్యమాల స్ఫూర్తిని ప్రస్తావిస్తూ ప్రారంభించారు. ఈ దేశం చైనా, రష్యా వంటి ఏకరీతి కలిగిన దేశం కాదని, భిన్నమైన బహు సంస్కృతుల, భాషా, భౌగోళిక విభిన్నతను కలిగిన రాష్ర్టాల సమాహారమని, రాజ్యాంగం ప్రస్తావించిన అంశాన్ని ప్రారంభంలోనే ప్రస్తావించి, ప్రసంగానికి ఒక ప్రాతిపదికను తయారుచేశారు. పద్నాలుగేండ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన అపూర్వమైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కేటీఆర్ భావోద్వేగంగా ప్రారంభించారు.
ప్రస్తుతం ఉన్న డీ లిమిటేషన్ విధానంలో లోక్‌సభ స్థానాలను పెంచితే ఉత్తరాదికి కలిగే మందబలం వల్ల జరిగే నష్టాన్ని ప్రస్తావించేందుకు, అంబేద్కర్ వంటి మహనీయులు చెప్పిన మెజారిటీ నియంతృత్వం అన్న పదబంధాన్ని ఉపయోగించి, మందబలం వల్ల కలిగే నష్టాలను, అరువై ఏండ్ల పాటు అనుభవించిన తెలంగాణ ఉద్యమ అనుభవాన్ని కలిపి ప్రస్తావించారు. ఆ వెంటనే డీ లిమిటేషన్ వల్ల దేశాభివృద్ధిలో అద్భుతమైన భాగస్వామ్యాన్ని దశాబ్దాలుగా అందిస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు జరిగే తీవ్ర నష్టాన్ని గట్టిగా చెప్పారు. దేశ హితం కోసం జనాభాను నియంత్రించుకొని, అద్భుతమైన పరిపాలన, ఆర్థిక విధానాలతో ప్రగతి సాధించి, జీడీపీలో 36 శాతం వాటా ఇస్తున్న దక్షిణాదికి దశాబ్దాలుగా జరుగుతున్న వివక్షను, అన్యాయాన్ని ప్రస్తావించినప్పుడు, ఆయన గొం తులో ఆవేదనతో పాటు దక్షిణాది సాధించిన ప్రగతిపైన గర్వం కనిపించింది.
తనకున్న పరిమిత సమయంలో అనేక అంశాలను, రాజకీయ ఫిలాసఫీని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి ఉన్న తేడాను, డీ లిమిటేషన్ వంటి సంక్లిష్ట సమస్యను, దాని పరిష్కార మార్గాలను అద్భుతంగా వ్యక్తపరిచారు. ప్రపంచంలో ఎక్కడైనా క్రమశిక్షణతో పురోగతి సాధించిన ప్రాంతాలకు ప్రతిఫలం దక్కుతుంది కానీ, ఈ డీ లిమిటేషన్ విధానంలో కేంద్రం శిక్షించే కుట్ర చేస్తుందని స్పష్టం చేశారు. ఆనాటి భారతదేశ నిర్మాతల అపూర్వ జ్ఞానాన్ని, దీర్ఘ దృష్టిని, వారు సూచించిన మార్గాన్ని కేటీఆర్ మరోసారి దేశానికి గుర్తుచేసిన తీరు అపూర్వంగా అనిపించింది.
డీ లిమిటేషన్ చేయాల్సిందే అని భావిస్తే, కచ్చితంగా అంబేద్కర్ వంటి మహనీయులు సూచించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఫెడరల్ స్ఫూర్తి, రాష్ర్టాల హక్కులు, దేశ విభిన్నతను కాపాడాల్సిన బాధ్యత వంటి అనేక అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా నిర్లక్ష్యానికి గురవకుండా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయా రాష్ర్టాలు సాధించిన ఆర్థిక ప్రగతి, పరిపాలన విధానాలు, అభివృద్ధి వంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని, రాష్ర్టాలు దేశానికి అందిస్తున్న భాగస్వామ్యం మేరకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, పరిపాలన సౌలభ్యం కోసమైతే ఎంపీల సంఖ్య అలాగే ఉంచి, ఎమ్మెల్యేల సంఖ్యను జనాభా ప్రాతిపదిక మేర పెంచుకునే విధానాన్ని అనుసరించాలనే పరిష్కారాలను సూచించారు.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధం అన్నదమ్ముల మాదిరి ఉండాలని, కేంద్రం పెద్దన్న మాదిరి ఉండాలి కానీ, టీవీ షోలో బిగ్‌బాస్ మాదిరిగా కాదని చురకలు అంటించిన చాతుర్యం అందరినీ ఆకట్టుకున్నది. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ నీతులు వల్లె వేస్తున్న కేంద్రం, డీ లిమిటేషన్ వంటి సంక్లిష్టమైన అంశం వచ్చేసరికి కోహెర్సివ్ ఫెడరలిజం దిశగా అడుగులు వేస్తుందని, బలమైన రాష్ర్టాలు ఉన్నప్పుడే బలమైన దేశం ఉంటుందన్న కామన్ సెన్స్‌ను కేంద్రం గుర్తించాలని చెప్పిన తీరు, మొత్తం డీ లిమిటేషన్ వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది.
కేటీఆర్ ప్రసంగం ఈ రోజు ఉన్న సంక్షోభ రాజకీయ పరిస్థితుల్లో ఒక వెలుగు రేఖగా నిలుస్తుంది. సమాచారం, స్పష్టత, భావోద్వేగం, సరళమైన భాషతో బలమైన సందేశాన్నిచ్చి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ జమానాలోనూ 12 నిమిషాల్లో సంక్లిష్టమైన రాజకీయ అంశాలను దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పవచ్చని నిరూపించింది. రాజకీయ నాయకులు కేవలం అధికారాలు, పదవులు, ప్రచారాల కోసం కాకుండా, సమాజ హితం కోసం, దేశ హితం కోసం నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరాన్ని ఎత్తిచూపింది. నిన్న చెన్నై సమావేశంలో కేటీఆర్ ప్రసంగం సంక్లిష్టమైన డీ లిమిటేషన్ చర్చకు ఆజ్యం పోసే నిప్పు కణికగా నిలిచింది. అయితే, ఈ నిప్పు కణిక దేశ భవిష్యత్తును పునర్నిర్మించే యజ్ఞం ప్రారంభానికి ఉపయోగపడే దక్షిణాగ్నిగా, శుభకరమైన సంకేతంగా నిలవాలని, డీ లిమిటేషన్ వివాదానికి అర్థవంతమైన, ప్రజాస్వామిక, న్యాయమైన ముగింపు రావాలని ఆశిస్తున్నాను.
– డాక్టర్ అయాన్ రాజన్న