ప్రశాంతత నెలకొంటున్నట్టు అందరూ భావిస్తున్న కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదం పంజా విసరడం దిగ్భ్రమ కలిగిస్తున్నది. మతోన్మాద కర్కశ నరమేధానికి పాతికమందికి పైగా అమాయక పౌరులు బలికావడం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తున్నది. ప్రకృతి రమణీయతతో అలరారే కశ్మీర్ ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా పేరెన్నిక గన్నది. అలాంటి చోట పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదం విరుచుకుపడటంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులోనూ మృతుల్లో హనీమూన్‌కు వచ్చిన పర్యాటకులు ఉండటం అత్యంత బాధాకరం.
కొత్త పెండ్లికొడుకు శవం పక్కన నవవధువు రోదిస్తున్న దృశ్యం ఉగ్ర ఘాతుకం అనాగరిక, అమానవీయ, అర్థరహిత దిగజారుడు తనానికి అద్దంపట్టింది. ఉగ్రవాదులు ఒక వర్గంవారిని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారూ మృతుల్లో ఉండటం గమనార్హం. పర్యాటకులను చంపడం పిరికిపందల చర్య తప్ప మరోటి కాదు. దీనిద్వారా ఉగ్రవాదులు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏ రకమైన విలువలూ ఈ క్రౌర్యాన్ని సమర్థించలేవు. ఇది లష్కరే తోయిబా అనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ నుంచి పుట్టుకువచ్చినది రెసిస్టెంట్ ఫ్రంట్ పనే అంటున్నారు. బాధ్యులెవరైనా ఈ నిరర్థక మారణహోమానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.
370 అధికరణం రద్దు, రాష్ట్ర విభజన, కొంచెం ఆలస్యంగానైనా ఎన్నికల నిర్వహణ అనే కీలక ఘటనల క్రమం తర్వాత కశ్మీర్ మెల్లమెల్లగా కుదుటపడుతున్నదనే భావన ప్రజల్లో కలుగుతున్నది. దాని ఫలితంగా కశ్మీర్ సందర్శించే పర్యాటకులూ పెరుగుతున్నారు. ఎత్తయిన రైలు వంతెన, పొడవైన సొరంగాలు వంటి హంగులూ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. కానీ ఇప్పుడు భరోసా పోయి భయం వచ్చిచేరింది. భయం నీడలో విహార యాత్రలు సాగడం అసాధ్యమే. కశ్మీర్ ప్రధాన ఆదాయవనరుగా ఉండే పర్యాటకం మరోసారి పెనుప్రమాదంలో చిక్కుకుంది. దాల్ సరస్సులో షికారాలను ఒడ్డున కట్టిపడేసే పరిస్థితి దాపురించింది. సరిహద్దులు దాటివస్తున్న ఉగ్రవాదంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య కశ్మీరీ ప్రజలు బలిపశువులు కావడం విచారకరం.
మంగళవారం నాటి మారణహోమం పుల్వామా తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. అప్పటిలాగే ఇప్పుడు కూడా నిఘా వ్యవస్థల వైఫల్యం తీవ్ర విమర్శలకు గురవుతున్నది. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరాన్ అనే మారుమూల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. అక్కడికి కాలిబాటన లేదా గుర్రాలపై మాత్రమే వెళ్లడం సాధ్యం. అలాంటి చోట తగిన భద్రత కల్పించడంలో యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వమూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రం బాధ్యతే ఎక్కువ. ఎందుకంటే కశ్మీర్ ఇంకా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంది. అక్కడ అణువణువూ కేంద్ర బలగాల ఆధీనంలోనే ఉంటుంది. కశ్మీర్ లో సుదూర పర్యవసానాలకు దారితీసే మార్పులు తెచ్చింది కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అనేది మరిచిపోరాదు.