Telangana | అప్పుడే పదేండ్లు గడిచాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని శాసనసభలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి సవాల్. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తెలంగాణ రానే రాదు చివరి బాల్ వేసి తెలంగాణను అడ్డుకుంటామని లగడపాటి సవాల్, పార్లమెంట్లో లగడపాటి పెప్పర్ స్ప్రే ప్రయోగించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం మొన్న మొన్ననే జరిగినట్టు ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నది. అనేక అడ్డంకులను తట్టుకొని ఆరు దశాబ్దాల కల సాకారమైంది. రానే రాదనుకొన్న తెలంగాణ ఏర్పడి పదేండ్లవుతున్నది.
కాలచక్రంలో పదేండ్లు అనేది చాలా స్వల్పకాలమే కావచ్చు కానీ ఈ పదేండ్లలో తెలంగాణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కరువు, పేదరికంలో దేశంలో నంబర్ వన్ స్థాయి కోసం పోటీ పడిన ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తలెత్తుకొని నిలబడింది. ఉమ్మడి రాష్ట్రంలో తరుచుగా తెలంగాణ జిల్లాలకు కరువు వార్తలు రాసేందుకు వచ్చేవారు. అదే జాతీయ మీడియాలో దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అనే వార్తలు చూసి ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం అనిపించేది.
పరిశ్రమలకు, వ్యాపారులకు, ప్రజలకు కనీస అవసరాలు నిరంతర విద్యుత్తు, మంచినీళ్లు, మౌలిక సదుపాయాలు, మంచి రోడ్లు కావాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనాకాలంలో ఈ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం. హైదరాబాద్ వంటి మహానగరంలోనే కాదు గ్రామాల్లో సైతం 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా ఊహించని విజయం. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచినప్పుడు రైతులు ఉద్యమించారు. ఉచిత విద్యుత్తు ఇస్తే విద్యుత్తు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయని చంద్రబాబు చెప్పిన మాట ఆనాటి రాజకీయాల్లో బాగా పాపులర్. ఉమ్మడి రాష్ట్రంలో అతి కష్టమ్మీద ఏడు గంటల ఉచిత విద్యుత్తు అమలుచేస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా జరిగింది.

మిగిలిన రంగాల్లో అభివృద్ధి ఎలా ఉన్నా ఐటీరంగంపై చాలామందికి అనుమానాలుండేవి. తెలంగాణ ఏర్పాటును కోరుకున్నవారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినవారు ఇద్దరూ తెలంగాణ ఏర్పడితే ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటి? అని సందేహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి తెలంగాణలో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల విలువ కాగా, 2022 నాటికే రూ.1,83,569 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఎన్నో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నాయి. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఒకవైపు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు మరోవైపు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత, చెరువుల్లో లక్షల కొద్దీ చేప పిల్లలను వేయడం, గొర్రెల పంపిణీ వంటి పథకాల వల్ల, రైతుబంధు వంటి పథకాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చింది.
తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398 రూపాయలు. అదే జాతీయ తలసరి ఆదాయం 1 లక్ష 72 వేల, 776 రూపాయలు. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు. అంటే పదేండ్లలో తెలంగాణ స్వరూపం, సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పు జరిగిందో ఈ అంకెలే చెప్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ అంటే రౌడీలు, పేదరికం, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు అలా ఒక ముద్ర పడిన తెలంగాణ పదేండ్లలో తనను తాను పునర్నిర్మించుకొని దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక ఐటీ ఎగుమతుల రాష్ట్రంగా, జాతీయ సగటు కన్నా రెట్టింపు తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ తలెత్తుకొని నిలిచింది. తెలుగు మీడియాలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుల ఆత్మహత్యల వార్తలు ఆక్రమించుకొని ఉండేవి. అలాంటిది అత్యధిక వరి పండించడమే కాదు, హైదరాబాద్ నుంచి ఎటువైపు వెళ్లినా వంద కిలోమీటర్ల వరకు వ్యవసాయ భూమి కోట్లలో పలుకుతున్నది.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వైద్యరంగంలో విప్లవం లాంటిది. గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటు పేదవారికి నాణ్యమైన విద్య లభించేందుకు దోహదం చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోయూ ట్యూబ్‌లో ఓ మహిళ మాట్లాడిన మాటలు గుండెలు పిండేసినట్టు అనిపించాయి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది.
1993-94 ప్రాంతంలో గోపినాథ్ రెడ్డి అని జిల్లా ఎస్పీ ఉండేవారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల తాగునీటి కోసం జీప్ ప్రతిరోజూ హైదరాబాద్ వచ్చేది. కేవలం తాగునీళ్లు తీసుకువెళ్లడానికి వచ్చేది. ఆ కాలంలో ఆ జిల్లాలో రిపోర్టర్‌గా పని చేయడం వల్ల ఈ విషయం తెలుసు. జిల్లా ఉన్నతాధికారులు జిల్లాల్లో మంచినీళ్లు కూడా తాగకపోయేవారు. ఫ్లోరోసిస్ అని భయపడేవారు. రిపోర్టర్‌గా ఈ విషయం తెలుసు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన మహిళ చెప్పిన విషయం అసలు ఊహించలేక పోయాను. ఈ ప్రాంతానికి చెందినవారు పెళ్లి చేసుకున్నా పిల్లలు కనడానికి భయపడి దూరంగా ఉన్నాం. ఫ్లోరోసిస్ సమస్యతో పిల్లలు పుడతారేమో అనే భయంతో అని ఆ మహిళ చెప్పింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు సురక్షితమైన మంచినీరు లభిస్తున్నది. ఎన్నికల్లో కులం, మతం వంటివాటికి ప్రాధాన్యం లభించినప్పుడు ఫలితాలపై ఆ ప్రభావం ఉంటుంది. అయితే ఎన్నికల రాజకీయాలను పక్కనపెడితే తెలంగాణ పదేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది నిజం.
‘ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ముందుగా ప్రకటించిన దాని ప్రకారం విద్యుత్తు కోత విధించేవారు. ఇది కాకుండా మధ్యమధ్యలో కరెంట్ కోత ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎలా వ్యాపారాలు చేశామా అనిపిస్తున్నది.’ అని తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో జరిగిన మార్పు గురించి సికింద్రాబాద్ మోండా మార్కెట్లో వ్యాపారి చెప్పిన మాట ఇది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని కాలాన్ని విభజించినట్టు తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ ఏర్పాటు తర్వాత అని తెలంగాణ గురించి కాలాన్ని విభజించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్తు సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు అలానే కొనసాగాయి. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యలు మనకు వారసత్వంగా వచ్చాయి. ఒక ఏడాది పాటు ఇలానే విద్యుత్తు సమస్య ఉంటుంది. రెండవ ఏడాది నుంచి మనకు ఎంత విద్యుత్తు అవసరమో అంత సమకూర్చుకోగలం, మూడవ ఏడాది నుంచి మిగులు విద్యుత్తు ఉంటుందని సభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రకటిస్తే నమ్మబుద్ది కాలేదు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కె.జానారెడ్డి మీరు చెప్పింది నిజమైతే మీ పార్టీ కోసం ప్రచారం చేస్తా అని సవాల్ చేశారు. జానారెడ్డి ప్రచారం చేయలేదు కానీ విద్యుత్తు రంగంలో అది నిజమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో వారానికి రెండు మూడు రోజులు పరిశ్రమలకు పవర్ హాలీ డే ప్రకటించేవారు. పరిశ్రమల వారు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసేవారు. అలాంటి చీకటిరోజుల నుంచి అడుగులు వేయడం మొదలుపెట్టిన తెలంగాణ పదేండ్ల ప్రయాణంలో ఇంటింటికి మంచి నీళ్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి వాటిలో దేశానికి దారి చూపుతున్నది.
– బుద్దా మురళి