ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ ప్రతికూల మార్పులతో ఉష్ణోగ్రతలు, కరువుకాటకాలు, అకాల వర్ష వడగండ్లు, అకాల వరదలు, తుపాన్లు, భూతాప ప్రకోపాలు, కార్బన్ ఉద్గారాల ప్రభావం ఎక్కువవుతుంది. తీవ్ర వేడిగాలులు, నీటి ఎద్దడి, సముద్ర మట్టాల పెంపు, మానవాళి ఆహార అభద్రతా కోరల్లో చిక్కడం, పర్యావరణ కాలుష్యం పెరగడం, వలసలు, జీవవైవిధ్యానికి విఘాతం, వర్షపాతాల్లో హెచ్చుతగ్గులు లాంటి దుష్ఫలితాలు సంభవించనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణప్రతికూల మార్పులను అరికట్టకుంటే ప్రపంచ మానవాళి బతుకులు తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూగోళంపై ఈ ఏడాది అతి బలమైన ఎల్‌నినో ఏర్పడవచ్చనే చేదు విషయాన్ని స్కైమెట్ వాతావరణ సంస్థ నివేదిక బహిర్గతం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కటాన్ని ఎల్‌నినో అని అంటారు. సాధారణం కంటే 2.5 డిగ్రీల ఎక్కువగా సముద్రనీటి ఉష్ణోగ్రతలు పెరడాన్ని ‘సూపర్ ఎల్‌నినో’ అని పిలుస్తున్నారు. దీని ప్రభావంతో గాలుల దిశ మారిపోయి ప్రతికూల వాతావరణ మార్పులకు ఆజ్యం పోయవచ్చని అంచనా వేశారు. మే మాసంలో ఏర్పడే ఎల్‌నినో ఆగస్టు నాటికి బలపడి సూపర్ ఎల్నినోగా ఏర్పడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
మనదేశంలో ఈ యేడాది రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ సీజన్లో సాధారణం కంటే 6 శాతం (దీర్ఘకాల సగటులో 94 శాతం) వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో రెండో సీజన్లో జూలై-సెప్టెంబర్‌లో రుతుపవనాలు బలహీనపడవచ్చని పేర్కొన్నది. జూన్‌లో సాధారణ వర్షాలు పడినప్పటికీ రెండవ సీజన్లో వర్షాలు బలహీనపడతాయని అంచనా.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షాలు పడతాయని తెలుస్తున్నది. ఈ వేసవిలో వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో సాధారణం కంటే అధిక వేడి ఉంటుందని నివేదించింది. రానున్న నాలుగు నెలల కాలంలో రుతుపవన వర్షపాతం సగటున 817 మి.మీ ఉంటుందని అంచనా. దీనివల్ల దేశంలో 30 శాతం కరువు రావచ్చని పేర్కొన్నది.
ఇటీవల కాలంలో అకాల వర్షాలు అన్నదాత రోదనలకు ఆజ్యం పోస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంట నేలపై వాలిపోతున్నది. పండ్ల తోటల్లో కాయలు రాలుతున్నాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్న కంట కన్నీటి వరదలు పారుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షం, వడగండ్లతో కర్షకులు విలవిల్లాడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు రానున్న రోజుల్లో సూపర్ ఎల్‌నినో బలపడితే కరువు కరాళనృత్యం చేయవచ్చు. ఆహార అభద్రత రాజ్యమేలవచ్చు. ఇలాంటి వాతావరణ ప్రతికూల మార్పులకు కారణాలను తెలుసుకొని, వాటిని అరికట్టేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి.
– డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి 99497 00037