తెలంగాణ, ఆంధ్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో ఇదివరకు వ్యాసంలో చూశాం. ఇక భాషా ప్రాతిపదిక మీద ఈ భాషల గురించి అవగాహన లేని ప్రధానమంత్రి నెహ్రూని ఎలా ఒప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించారో తర్వాతి వ్యాసంలో చూద్దాం. ఇప్పుడు తెలుగు, ఆంధ్రం భాషలను అసలు ఒకే భాష అనవచ్చా? అన్నది పరిశీలిద్దాం. కన్నడ అక్షరాలు కూడా తెలుగు అక్షరాలతో పోలిక కలిగి ఉంటాయి. అంతమాత్రాన ఆ రెండు భాషలు ఒకటేనా? అంతేకాదు, దేశం బయటకు వెళ్లి చూస్తే చాలా యూరోపియన్ భాషలకి, మనకు తెలిసిన ఇంగ్లీష్ వర్ణమాలే ఉంటుంది. అయితే పదాలు, అక్షర క్రమం, ఉచ్ఛారణ, అర్థాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అలాగే తెలంగాణ తెలుగు, ఆంధ్ర ప్రాంతంలో ఉపయోగించే ఆంధ్రం కూడా వేరు భాషలు, ఒకటే భాషకి మాండలికాలు కావు. ఈ ప్రాంతాలు కూడా రెండు వేరు దేశాలుగా ఉన్నట్టు భారతంలో కూడా ఆధారాలున్నాయి. ఇక ఈ భాషల పూర్వ చరిత్ర గురించి తెలుసుకుందాం!
ఆంధ్ర పదం ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. అందులో ఓ కీలక కథ ప్రకారం విశ్వామిత్ర మహర్షికి తన నూరుగురు కొడుకుల మీద కోపం వస్తుంది. వారి అవిధేయతని విమర్శించి, కుక్క మాంసం తింటూ బతకాలని శపించి ఇంట్లోంచి వెళ్లగొడతాడు. అప్పుడు వారిలో కొందరు దక్షిణ దిశకి ప్రయాణించి, దండకారణ్యం గుండా తెలంగాణ ప్రాంతం దాటి కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో సిరపడ్డారు. ఆ ప్రాంతాలే ఈనాటి ఆంధ్ర దేశం. ఈ ప్రయాణంలో తమకు తారసపడిన ద్రవిడ భాషని గ్రహించి, తమ భాష అయిన సంస్కృతంతో కలిపి ఆంధ్ర భాషగా వారు మాట్లాడటం మొదలుపెట్టారు.
అందుకే ఆంధ్ర పూర్తిగా సంస్కృత పదభూయిష్టమై, వ్యాకరణ రీతులు కూడా సంస్కృత వ్యాకరణంతోనే కలుస్తాయి. వారి భాష సంస్కృతం. మొదటినుంచీ వారి సంస్కృతి ఆర్య సంస్కృతి. మూడు లింగాల మధ్య ఉన్న తెలంగాణ ప్రాంతం అప్పటిదాకా తెలంగిగా పిలవబడి ఈ సంస్కృత సోపతి వచ్చాక త్రిలింగ దేశంగా వ్యవహరింపబడింది. క్రీ.పూ.300వ సంవత్సరం నుంచి పరిపాలించిన చోళరాజుల కాలంలో నిర్మింపబడిన లింగమంతుల స్వామి ఆలయం సూర్యాపేటలో ఇప్పటికీ పూజలందుకుంటున్నది. అప్పటి పేరు మూడు లింగాల ప్రాంతమే తెలంగాణ. ఈ మూడు శైవక్షేత్రాలు బహుశా శివ భక్తులైన చోళుల కాలంలోనే నిర్మింపబడి ఉండాలి.
ఒక్క ద్రాక్షారామ దేవాలయాన్ని చాళుక్య రాజు భీమా కట్టాడని చరిత్ర చెప్తుంది. భరతముని రచించిన నాట్య శాస్త్రంలో (క్రీ.పూ.2వ శతాబ్దం) కూడా ఆంధ్ర జాతి, వారి భాష ఆంధ్రమని చెప్పబడింది. భరతముని తెలుగు అన్న పదం ఎక్కడా వాడలేదు. అలాగే ప్రాకృత భాషా సాహిత్యంలో కూడా ఆంధ్ర వారి భాష ఆంధ్రమనే ఉంది తప్ప, తెలుగు అన్న పదమే లేదు. ఈ ప్రాకృతాన్ని ఎక్కువగా వాడుకున్న బౌద్ధ వాఙ్మయంలో కూడా కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో నివసించిన ఆంధ్రుల ప్రసక్తి ఉన్నది. వారి భాష ఆంధ్రమనీ సుస్పష్టంగా చెప్పబడింది. కానీ, తెలంగాణలో ఉన్న బౌద్ధ ఆరామాల్లో మాత్రం ఇక్కడి ప్రజల భాష తెలుగు అని స్పష్టంగా ఉంది.
వాల్మీకి రామాయణంలో ఆంధ్ర దేశ ప్రసక్తి ఉంది. దండ కారణ్యానికి సరిగ్గా కింది భాగంలో ఉందనీ, దానిని దాటితే పౌండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలు వస్తాయనీ సీతని వెతకడానికి తన సైన్యాన్ని పంపిస్తూ, వారికి సుగ్రీవుడు వివరిస్తాడు అక్కడి భౌగోళిక వివరాలు. వేదవ్యాసుడు మహాభారతంలో కూడా ఆంధ్ర జాతి ప్రస్తావన చేస్తాడు. ఆంధ్ర రాజులను సహదేవుడు చిత్తుగా ఓడించాడని చెప్తాడు. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే కురుక్షేత్ర మహా యుద్ధంలో అధర్మపరులు, దురాశాపరులైన కౌరవుల వైపు ఆంధ్రులు ఉండి, తమ న్యాయమైన హక్కు కోసం పోరాడిన పాండవులతో యుద్ధం చేశారు.
ఆంధ్రుల మీద సుదీర్ఘ వ్యాసం రాసిన లగడపాటి రాజగోపాల్ ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. మరి తెలంగాణ బిల్లు పాసవ్వకూడదని ఆయన కూడా తోటి పార్లమెంటు సభ్యులు మూర్ఛపోయేటట్టు పెప్పర్ స్ప్రే చేశాడుగా! కౌరవ బుద్ధి పోనిచ్చుకోలేదు. ఈ రకంగా వేదాల్లో, చరిత్రల్లో, పురాణాల్లో, వాజ్ఞయాల్లో, ఆఖరికి 10వ శతాబ్దం తర్వాత కూడా వారి భౌగోళిక ప్రాంతం ఆంధ్రమనీ, వారి జాతి ఆంధ్ర జాతి అనీ, వారి భాష ఆంధ్ర భాష అనీ చాలా స్పష్టంగా ఉంది.
క్రీస్తు పూర్వం నుంచి త్రిలింగ దేశ ప్రస్తావన వేరే చోట్ల ఉంది. అంతేతప్ప, ఆంధ్రులతో కలిపి గాని, లేక ఈ రెండు భాషలు ఒకటే అని గాని ఎక్కడా లిఖింపబడలేదు. ఈ మధ్య మెదక్‌లో దొరికిన 1300 ఏళ్ల కిందటి శాసనంలో త్రిలింగ దేశంలో తెలంగాణపురం (ప్రస్తుత తెల్లాపూర్) ఉందనీ, ఇది ప్రత్యేక దేశమనీ ఉంది.
ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడే భాషని మొదటినుంచీ కూడా ఆంధ్రము అనే కవులందరూ వ్యవహరించారు, నొక్కి వక్కాణించారు. వ్యాస రచిత భారతాన్ని అనువదించిన వారిని ఇలా పొగిడారు. ‘నయం ఆంధ్ర భాషగ నొనర్చి జగతిబొగడు గతి నన్నపార్యు, తిక్కనను, క్రితక్రతు శంభుదాసు నెర్రకవి దలతుభక్తి!’. నన్నయకు ముందో, వెనకో అన్న వివాదం ఉన్నా, ఆ కాలంలోని ఇంకో కవి నన్నె చోడుడు కూడా ఆంధ్రం, తెలుగు వేరు భాషలని గుర్తించాడు. రెండు భాషల్లోనూ కవిత్వం వెలువడిందనీ, ఆంధ్ర కవులు పూర్తిగా సంస్కృత పదభూయిష్టమైన భాషలో రాస్తే, తెలుగు కవులు తేనెలొలుకు ప్రాంతీయ భాషలో కవితలల్లారని అప్పటి కవులందరూ గుర్తించారు.
ఈ భేదం ఆంధ్ర కవిత్రయం వారి భారతం, తెలంగాణ తెలుగు మహాకవి పోతన భాగవతం చదివితే తెలుస్తుంది. కవిత్రయం రాసినది ఎవరైనా ఆంధ్ర ఆచార్యులు చెప్తే, వివరిస్తే గానీ అర్థం కాదు. అదే పోతన భాగవతం తెలుగు భాష వచ్చిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. ఇద్దరు పరమశివ భక్తులైన నన్నె చోడుడి కుమార సంభవం, తెలంగాణ కవి పాల్కురికి సోమనాథుడి బసవపురాణం గమనించినా ఈ రెండు భాషల మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది.
అంతేకాదు, తానే మొదటి తెలుగు కవి అని గ్రహించి సోమనాథుడు కవి పండితులను ఈ విధంగా ప్రార్థించాడు: ‘ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృతభూయిష్ట రచన మానుగా సర్వ సామాన్యంబు గామి జాను తెలుగు విశేషము ప్రసన్నతకు’. పండితారాధ్య చరిత్రలో చేసిన ఈ విన్నపం అర్థం ఇది: ‘నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారేమో, సాక్షాత్తూ వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోకి తెస్తున్నాను, ఆదరించండి’ అని.
పాల్కురికి సోమనాథుడు సంస్కృత, కన్నడ, తెలుగు, ప్రాకృత, తమిళ, మరాఠీ భాషల్లో కూడా పండితుడు, బహు భాషా కోవిదుడైనా, ప్రాంతీయ భాష, తన మాతృ భాష అయిన తేనెలూరే తెలుగునే ఎంచుకున్నాడు. నిజానికి ఇతనినే మొట్టమొదటి తెలుగు కవి అనాలి. ఎందుకంటే, ఆంధ్రంలో భారతం అనువదించిన నన్నయ వాళ్లు పూర్తిగా సంస్కృత ఛందస్సు, సంస్కృత వ్యాకరణం నిబంధనలు పాటించారు. కానీ, సోమనాథుడు తెలుగు ఇతివృత్తాలు, తెలుగు ఛందస్సు, తెలుగు నుడికారం, జాను తెలుగును స్వీకరించి ఒక మహాకావ్య రచన చేశాడు. ఇందులో ఆంధ్ర భాష పదం ఒక్కటీ కనిపించదు. అంటే ఈ రెండు వేటికవి సంపూర్ణంగా ఏర్పడిన భాషలే కదా!
20వ శతాబ్దంలో కూడా ఈ రెండు భాషలు వేరన్న భావమే స్పష్టంగా ఉంది. ఆంధ్రులు తమ స్వరాష్ట్రం కోసం నడిపిన సభలను ఆంధ్ర మహాసభలన్నారు. 1956 వరకు వచ్చిన వార్తా పత్రికలు కూడా ఆంధ్ర వారిది ఆంధ్ర భాషగానే వ్యవహరించాయి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కూడా ‘ఆంధ్ర’ రాష్ట్ర ఉద్యమమే కానీ, తెలుగు అన్న పదం వాడలేదు.
20వ శతాబ్దంలో కూడా ఈ రెండు భాషలు వేరన్న భావమే స్పష్టంగా ఉంది. ఆంధ్రులు తమ స్వరాష్ట్రం కోసం నడిపిన సభలను ఆంధ్ర మహాసభలన్నారు. 1956 వరకు వచ్చిన వార్తా పత్రికలు కూడా ఆంధ్ర వారిది ఆంధ్ర భాషగానే వ్యవహరించాయి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కూడా ‘ఆంధ్ర’ రాష్ట్ర ఉద్యమమే కానీ, తెలుగు అన్న పదం వాడలేదు. నిజానికి తమ భాష తెలుగు అని అనుకొని ఉంటే 1953లో మద్రాసు నుంచి విడిపోయినప్పుడే, 1952లోనే రాష్ట్రమైన తెలంగాణలో కలపమని ఎందుకు అడగలేదు? తమ ఆంధ్ర, తెలంగాణ తెలుగు ఒకే భాషలని అతి తెలివైన నాయకులకు మూడేళ్లకి గానీ తెలియలేదా?
ప్రత్యేక రాష్ట్రమయ్యాక తమ రాష్ట్రంలో ఉన్న వనరులు ఉపయోగించుకునే తెలివి లేక, ప్రజల అభివృద్ధి మీద శ్రద్ధ లేక, మూడేండ్లలోనే ఆర్థికంగా చితికిలపడి, 12 కోట్ల రూపాయలు కేంద్రానికి అప్పుపడ్డాక, అప్పుడు బుర్రల్లో మెరిసిందా కొత్త ఐడియా తమ ఆంధ్రం, తెలంగాణ తెలుగు ఒకటేనని. ఈ విలీనానికి కారణం భాషలు ఒక్కటి కావడం కాదు, భావసమైక్యత అంత కంటే కాదు. 1955లో విడుదలైన ‘మాయాబజార్’ సినిమాలో కూడా గోంగూరని ‘ఆంధ్ర శాకం’ అన్న వాళ్లకి తెలుగు మీద హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు ప్రాంతాల కలయిక తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తుందని చెప్పగానే కంగుతిన్న ఆంధ్ర రాజకీయ నాయకులు తెలుగు జపం మొదలుపెట్టారు. పోనీ కలిశాక అయినా తెలంగాణ తెలుగుని గౌరవించారా? వచ్చే వాస్యంలో చూద్దాం.
– కనకదుర్గ దంటు 89772 43484