తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి బీఆర్ఎస్ విజయావకాశాలపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విశ్లేషణలు, సర్వేలు అన్నీ, ఇన్నీ కావు. ఎవరికి వారు కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావం, తాము ఏదైనా జరుగాలని కోరుకుంటున్నారో (విష్ ఫుల్ థింకింగ్ ) ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. తాము చెప్పిందే నూరుశాతం జరుగుతుందంటూ నమ్మబలుకుతున్నారు. ఆ వార్తా కథనంపై రోజంతా చర్చ, మర్నాటికి మరో కొత్త పోస్టు, దానిపై విశ్లేషణ. ఇలా ఫోకస్ అంతా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్, ఆ పార్టీ అభ్యర్థులపైనే ఉన్నది.
రాష్ట్రంలో బీఆర్ఎస్కు చాలా టైట్ ఫైట్ నడుస్తున్నదని ఒకాయనంటారు. ఎందుకయ్యా అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, మార్పు కోరుకుంటున్నారని, ప్రజలంతా గంపగుత్తగా తిరుగుబాటు చేస్తున్నారంటారు. ఇక సందులో సడేమియా అన్నట్టుగా ఫలానా కులానికి టికెట్ రానందున ఈసారి పార్టీకి మద్దతు పలుకడం లేదని, జనసమితి, సీపీఐ, వైఎస్సార్టీపీ మద్దతు కలసివస్తుందని కాకిలెక్కలు చెప్తున్నారు. పైగా నమ్మేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చలేదని, అందువల్లే కేసీఆర్ గెలుపు కష్టసాధ్యమంటూ కుహనా మేధావులు విశ్లేషిస్తున్నారు. అసలు నెరవేర్చని హామీలు ఏంట య్యా? అంటే పొంతన లేని సమాధానం చెప్పి అక్కడినుంచి పరుగో పరుగంటూ నిష్క్రమిస్తున్నరు.
మేధావులు అనే వర్గీకరణలోకి వచ్చేవారి పరిస్థితే గందరగోళంగా ఉన్నప్పుడు ఇతరులను నిందించటం అవివేకం అవుతుంది. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా అనేక పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ప్రపంచం బద్దలయ్యేంత అద్భుతం ఏదైనా జరిగి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం చేపడితే పథకాలు అమలుకు నోచుకోక ప్రజల జీవితాల్లో మరోసారి అంధకారం ఆవరించటం ఖాయం.
గత నెలరోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలలో తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై రకరకాల కథనాలు రాస్తున్నాయి. పోనీ వారి ప్రచారానికి హేతుబద్ధత ఉన్నదా? అంటే ఎంతమాత్రం కనిపించదు. సెఫాలజిస్టులు, ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తుంటారు. వారు కొన్ని శాంపిల్స్ తీసుకొని ఒక అంచనాకు వచ్చి ఫలానా కారణంగా అటు, ఇటుగా భ్రమలు కల్పిస్తారు. అప్పటికి తమ అంచనాల్లో ఐదు శాతం మీదికి, కిందికి ఎర్రర్ ఉంటుందని నమ్మ బలుకుతారు. అయితే వారికి తెలియనిది ఏమిటంటే కేసీఆర్ గురించి కానీ, బీఆర్ఎస్ గురించి కానీ అంచనా వేసేటప్పుడు ఈ హేతుబద్ధ్దత గురించి ఆలోచించకపోతే కచ్చితంగా తప్పు చేసినట్టే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నిక ఏదైనా ఓటమి తెలియని కేసీఆర్ పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు ఆధారపడుతాయి. తెలంగాణ ప్రజలను మందుతో, మాంసంతో కొనే వాతావరణం దాదాపుగా ఉండదు. అదీగాక మరికొంత ఆ పార్టీతో జరిగిన మేలు వల్ల వచ్చే ఓటు ఉంటుంది. సంప్రదాయ ఓటు బ్యాంకు, ఆయా సామాజికవర్గాల ఓటు కొంత ఉంటుంది. అభ్యర్థి ఇష్టాయిష్టాలు ప్రత్యర్థి ఎంతబలమైనవాడు, వారి చరిత్ర, మంచి, చెడులుంటాయి. పార్టీల అధినాయకత్వం విశ్వసనీయత అన్నది ప్రధానంగా ఉంటుంది. ఆ పార్టీ గతంలో ఏం చేసింది? భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందన్న విషయంలో ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు. ఇవన్నీ కూడా అభ్యర్థి గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయి. పలువురు వితండ విశ్లేషణ చేసినా ఎందుకు గెలువదని మాత్రం ఎక్కడా చెప్పలేక పోయారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థను, నగర ఆర్థిక వ్యవస్థనూ సమాంతరంగా అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించి నడిపించిన నాయకుడు నిస్సందేహంగా కేసీఆరే. రాబోయే ఎన్నికల్లో గెలిచేదీ, నిలిచేది కేసీఆర్. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ జీవితాలు మరోమారు అంధకారం కా కుండా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి.
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం విజయవంతమై తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనుమానాలు పటాపంచలు చేస్తూ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. ఉద్యమ సమయంలో ఎగతాళి చేసిన వ్యతిరేక శక్తులతో తెలంగాణ మరోసారి ఆత్మగౌరవ పోరాటం జరుపుతున్నది. ఎన్నికల్లో ఒక పార్టీ గెలవడం, మరో పార్టీ ఓడిపోవడం సాధారణమే. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు అలాంటి సాధారణ ఎన్నికలు కాదు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజకీయ చైతన్యం, సాధించిన అభివృద్ధిని తెలంగాణ ఉద్యమ నాయకత్వం పటిష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులన్నీ ఏకమై మరోసారి తెలంగాణను మోసం చేసేందుకు కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ సాకారమైనా, ఇప్పటికి ఇది నిజమేనా అనిపించేంత ఆశ్చర్యం. ఇప్పుడు మళ్లీ అవే పాత్రలు వేర్వేరు డైలాగులతో వేర్వేరు వేషాలతో మరోసారి తెలంగాణపై దండయాత్రకు వస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ రెండు బక్కపలచని కేసీఆర్ను ఓడించడానికి ఒకరు కామారెడ్డి, ఒకరు గజ్వేల్ కేంద్రంగా ఇరువైపులా చక్రం తిప్పుతున్నారు. ఉప్పు, నిప్పు లాగా ఉన్న రెండు పార్టీలు ప్రణాళి కా ప్రకారం కలిసి సాగుతున్నాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా విమర్శలు, రాజకీయ స్వ ప్రయోజనాలే పరమావధిగా భావించేవారు అవలివైపు నిలిచా రు. బీఆర్ఎస్ మాత్రం ఈ తొమ్మిదేండ్లలో ఏం చేశామో చెప్తూ వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తామో వివరిస్తున్నది. వీరి మధ్య విజేత ఎవరో తెలంగాణ ప్రజలు తెల్చే సమ యం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమ పార్టీకే పట్టం కడుతారనడంలోఎలాంటి సందేహం లేదు.
-నల్లా బానేశ్
77024 72947