మన ముందు తరం వారు ఎవరంటే… ఆ ముందు తరం వారు వేసిన తిరుగుబాటు విత్తనాలే. వారు మొలకలై, మానులై, శాఖోపశాఖలుగా తెలంగాణతనం వ్యాపింపచేసిన్రు. ఆకాశమంత ఎత్తున బావుటా ఎగరేసిన్రు. అదే సమయంలో భూమి పొరల్లోకి వేళ్లూనిన్రు. అస్తిత్వం ఎంత బలంగా లోలోనికి చొచ్చుకుపోతే ఆకాంక్ష అంతే ఎగిసిపోతది ఆకాశంలోకి.
రెండు మూడు తరాల త్యాగాల ఫలితంగా, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే విప్లవకారుడి రాజకీయ నేతృత్వం వల్ల పదేండ్ల కింద తెలంగాణ సిద్ధించింది. ఈ సామాజిక వాస్తవం విస్మరించి, ‘సోనియాగాంధీ అనే ఇటలీ అమ్మాయి తెలంగాణ ఇచ్చింది’ అని అందెశ్రీ అన్నరంటే… ఆయనకు ఈ నేల ఏమి అర్థమయినట్టు? బ్రిటిష్ వాళ్లు మనకు స్వాతంత్య్రం ఇచ్చిన్రు అనడం లాంటి మందబుద్ధి ఇది!
ఒక గొప్ప కళాసృష్టి (Work of art ) ఒకానొక కాలంలో అగ్గి రాజేసి ఉండవచ్చు, ఉర్రూతలూగించి ఉండవచ్చు, అది ఎప్పటికీ గొప్పదిగానే నిలిచిపోవచ్చు కూడా. కానీ, అనంతర కాలంలో ఆ కళాసృష్టి చేసినవారి తీరు సృష్టి (Work) వెనుకనున్న తాత్వికతకే అపసవ్య దిశలో సాగుతూ ఉంటే? ఇది కదా విషాదం? ఇపుడు అందెశ్రీ ఒక గూడు కట్టుకుని ఉన్న, ఆనవాలు కోల్పోతున్న, అస్తిత్వం ఉడిగిపోతున్న, ప్రశ్నిస్తే ఉడుక్కుంటున్న ‘కొత్త తెలంగాణ’కు సాక్షి, భాగస్వామి కూడా!
‘కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా’ అని ఏ ముహూర్తంలో అన్నరో రేవంత్ రెడ్డి! భౌగోళిక రాష్ట్రం నుంచి తెలంగాణ తనపు జాడ కూడా కనిపించకుండా చేయడంలో ఓవర్ టైం పని చేస్తున్నడతను. తెలంగాణ ఆనవాలు తీసేస్తే, కేసీఆర్ ఆనవాలు పోయినట్టే అనే ఎరుక ఉండటం రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు అది తెలంగాణ నుంచి కేసీఆర్‌ను విడదీయలేరనే నగ్న సత్యం!
విచిత్రమూ, విషాదమూ ఏమంటే ఈ ‘తెలంగాణ చెరిపివేత’లో రేవంత్‌రెడ్డికి కొందరు తెలంగాణ బిడ్డలు సహకరిస్తూ ఉండటం! వాగ్దానాలో, వాగ్దాన భంగాలో ఎక్కడో వీరికి వ్యక్తిగతంగా కేసీఆర్‌తో చెడింది. To be fair to them – అవి ఆస్తులూ, అధికారాల గురించి కాకపోవచ్చు. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని కినుక కూడా కావచ్చు. అలకలోనే అలసిపోయే అల్పత్వమా అని మీరంటే, నేనేమీ చేయలేను!
ఈ రాష్ట్ర సాధకుడి దురదృష్టం ఏమంటే ఆయన ద్వారా రాష్ట్రం సహా అన్నీ పొందినవారు సైతం ఆయనను అర్థం చేసుకోలేకపోవడం! వీలైతే నాలుగు రాళ్లేసి పోవడం! మెరమెచ్చు మాటలు, డాంబికాలు, హిపోక్రసీ లాంటివి మచ్చుకు కూడా లేని కేసీఆర్ ఎవరిలోనూ ద్వంద్వ ప్రవృత్తి సహించరు. అది మింగుడుపడని మేధావి వర్గమే నాడు ఆయనకు వ్యతిరేకంగా, నేడు రేవంత్‌కు బాసటగా నిలబడింది!
అందెశ్రీ ‘జయ జయహే’ గీతం గురించి ఉద్యమ సీఎం కేసీఆర్ పాట నిడివికి సంబంధించి ఒకటి రెండు మార్పులు సూచించిన్రట. అవి నచ్చని అందెశ్రీ దూ రంగా ఉండిపోయిన్రట. ఆ తర్వాతి కాలంలో అందెశ్రీ ఇతర ప్రొఫెసర్లూ, మేధావులతో కలిసి కేసీఆర్ మీద (బీఆర్ఎస్ మీద కాదు!)రాళ్లేయడం మొదలుపెట్టిన్రు.
రేవంత్ రెడ్డి అనే ఒక మరుగుజ్జు (భౌతికంగా కాదు) వీరందరికీ నచ్చుతున్నరు. కారణం సింపుల్. వాళ్లు వ్యతిరేకించింది కేసీఆర్ అనే వ్యక్తినే గానీ, సీఎంగా ఆయన సాధించిన వెలుగులను కాదు! ఇపుడు మెచ్చి మేకతోలు కప్పుతున్నది వారికి అడిగినప్పుడల్లా చాయ్ తాగనీకి సమయం ఇస్తున్న రేవంత్‌రెడ్డికే గానీ, పాలన గాలికి వదిలేసిన సీఎంకు కాదు!సారాంశంలో ప్రజలు, సమాజం, ప్రగతి, సంక్షేమం, దేశవ్యాప్త కీర్తి వీటి ముందు అల్పమైనయి. వ్యక్తిగత ఆభిజాత్యాలు ముఖ్యమైనయి!
రాష్ట్ర లోగో నుంచి తెలంగాణ అస్తిత్వ, సాంస్కృతిక చిహ్నాలను తొలగించే దుస్సాహసం చేసిన రేవంత్ రెడ్డి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘నిర్ణయాన్ని’ వాయిదా వేసిన్రు. ‘ఆయన తెలంగాణ వ్యతిరేక చర్యను నిస్సిగ్గుగా సమర్థించిన కోదండరాం ప్రభృతులు ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన్రు’ అనడానికి కూడా లేదు.
ప్రమాదం సమసిపోలేదు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర లాగ మరలా రెచ్చిపోతరు, సందు చూసుకుని. వారికి వంతపాడే తెలంగాణ ద్రోహ మీడియా ఎటూ ఉన్నది కదా! నిన్నా మొన్నా తిరగబడినట్టు సమాజం ఎప్పటికప్పుడు తెలంగాణ ద్రోహంపై తిరగబడాల్సిందే. అందుకు తాత్విక భూమికయే బీఆర్ఎస్ పార్టీ! చిహ్నాల విషయంలో ప్రభుత్వ వెనుకంజ తెలంగాణకు నైతిక బలం, బీఆర్ఎస్ ప్రాసంగికతకు రుజువు!
మంగలి షాప్‌లలో, రచ్చకట్టల మీదా, చాయ్ దుకాణాల దగ్గరా పామరులు వీరికంటే లోతైన వారు! ఒక వైపు దేశానికి మోదీ లాంటి నాయకుడు కావాలి అనే వారు కూడా, రాష్ర్టానికి కేసీఆర్‌ను మించిన మొనగాడు లేడనడం స్వయంగా నేను విన్న. కేసీఆర్ చేసిన కొన్ని తప్పులు అంటూ లెక్కపెట్టి మరీ చెప్తరు వారు. అయితే, కొద్దిపాటి శిక్షతో సరిపోయేది కదా (కొన్ని సీట్లు తగ్గించి), ఆయనను దించేసి తమను తామే శిక్షించుకోవాలా అని కూడా వారిలో మళ్లీ సంవాదం! ఎందుకంటే సామాన్య ప్రజలు కేసీఆర్ పాలనను చవిచూసిన్రు. అభివృద్ధి-సంక్షేమం-ఆత్మగౌరవాలు హక్కుగా అందుకున్నరు. చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రంతో పోల్చినా ఈ పదేండ్లలో మెరుగైన తమ జీవనం అద్దంలో చూపినట్టు కనబడుతూనే ఉన్నది దినమూ. కాబట్టే, మొన్న షేక్‌పేట్ గోవింద్ అన్నడు ఇన్ని చేసిన సారు, అంత పెద్ద తప్పు ఎట్లా చేసిండని! ఆయన కోపం ఏమంటే, సారు దిగిపోయి రేవంత్‌రెడ్డిని సీఎం చేసిండు కదా అని. గోవింద్ లాంటి వాళ్లది ధర్మాగ్రహం. అందుకే అంటున్నరు పల్లె ప్రజలు మా ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతది, సారే సీఎంగా ఉంటరు అనుకున్నం అని! ఎంతో ప్రేమ, అంతలోనే నిష్టూరం, వెంటనే చిగురించే ఆశ కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు!
సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలు చేసే ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ సైతం మొన్న దురదృష్టకరమైన ఒక వ్యాసం రాసిన్రు. ప్రతి పేజీలోనూ, ప్రతి అక్షరంలోనూ బీఆర్ఎస్పై, తెలంగాణపై విషం చిమ్ముతున్న ఆ పత్రిక యాజమాన్యపు పాలసీ ప్రెజర్‌కు కె. శ్రీనివాస్ కూడా గురవుతున్నరేమో అనేట్టుగా పార్టీ పేరు మార్పును కూడా సైద్ధాంతిక చర్చ చేసిన ఆయన… తమ పత్రిక పేరు ‘తెలంగాణ జ్యోతి’గా మార్చకపోతే రాజీనామా చేస్తా అని ఎవరికీ వినపడకుండా అయినా డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. చిహ్నాలను మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేయడానికి పూనుకున్న రేవంత్‌ను, ఆయనకు తందాన కొట్టే ఆర్కేను వదిలేసి బీఆర్ఎస్ సాంక్టిటీని ప్రశ్నించడం గడుసుదనం!! ఏమన్న అంటే, కాంగ్రెస్‌నూ విమర్శిస్తున్నం కదా అంటరు – తలుపు చెక్కతో బీఆర్ఎస్ను బాదుతూ, తమలపాకుతో కాంగ్రెస్‌ను తడుముతూ! ఆర్కే పూనిన శ్రీనివాస్ ఇంకా ఏమంటరంటే – బీఆర్ఎస్ చీలిపోయి కొత్త పార్టీ రావాలట! ఇదెక్కడి సామాజిక కార్యకర్తృత్వం? అదేమి వ్యాసం. పార్టీల చీల్చివేత రాజకీయంతో మీకేమి పని, మీ ఇంట్రెస్ట్ ఏంది?!
ఈ ప్రశ్నలు, ఈ జాగరూకత తెలంగాణ సమాజం తన కోసం కలిగి ఉండాలి. ఎందుకంటే… రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రేపు జూన్ 2తో తెలంగాణపై అన్ని హక్కులు కోల్పోబోతున్నది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా హైదరాబాద్‌పై. పదేండ్ల ఉమ్మడి రాజధానికి ముగింపు ఆ రోజుతో. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ప్రపంచంలోని అందరు ప్రజలూ మంచివారే. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కూడా ఏమీ పేచీ లేదు తెలంగాణకు. మనం అలర్ట్‌గా ఉండాల్సింది అక్కడి రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా సహా పెట్టుబడిదారులు, వలసవాదులతో. మరీ ముఖ్యంగా వారి తాబేదారుడైన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రితో. మొన్ననే అన్నరు రేవంత్ తిరుపతిలో.. ‘రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్త’నని. ఆయన అలవోకగా ఏమీ అనలేదు. ఆంధ్రలో కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు కంటే ఎక్కువగా కోరుకుంటున్నరు రేవంత్ రెడ్డి, ఆయన మిత్రుడు రాధాకృష్ణ! అపుడు తెలంగాణలో వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుందని ఉవ్విళ్లూరుతున్నరు.
చంద్రబాబుకు గానీ, రాధాకృష్ణకుగానీ వారి షడ్యంత్రం సాగాలంటే రేవంత్ రెడ్డిని మించిన నమ్మకస్తుడు దొరకడు. బ్రిటిష్ వారికి ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచిపెట్టిన భారత సామంత రాజుల లాంటివాడు రేవంత్ రెడ్డి! ఇవేవీ కేవలం వ్యక్తుల పేర్లు కాదు. వీరు ఆంధ్రా పెట్టుబడిదారుల, వలసవాదుల ప్రతీకలు, ప్రతినిధులు, ప్రతిరూపాలు. ఇందులో ఈషణ్మాత్రం సందేహం ఉండనక్కరలేదు!
ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే వచ్చిన వార్త.. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం కోసం రేవంత్‌రెడ్డిని కలవనున్నట్టు టీడీపీ వెల్లడించింది. అందెశ్రీ గీతం కీరవాణి పాలయింది. ఏ ఒక్క పబ్లిక్ మీటింగ్‌లోనూ ‘జై తెలంగాణ’ పలుకలేడు సీఎం. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం కోసం వారి లిస్టు తయారుచేయమని కోదండరాంకు చెప్పిండు రేవంత్‌రెడ్డి. ఆ లిస్టులో రేవంత్‌రెడ్డి పేరు చేరుస్తరో లేదో కోదండరాం, చూడాలి!
ఆర్నెళ్ల నుంచి అరిగోస పడుతున్న రైతాంగంపై కత్తి కట్టిండు రేవంత్‌రెడ్డి. వాళ్లకు కరెంటు ఇవ్వక, నీళ్లివ్వక, బోనస్ ఇవ్వక, రైతుబంధు ఇవ్వక, పంట కొనక… సమయమంతా కేసీఆర్‌ను బద్నాం చేయడానికి రాధాకృష్ణతో కలిసి రోజూ విషపు వంటకం వండుతున్నడు. ఆ ఇద్దరి కక్ష నిజానికి కేసీఆర్‌పై కంటే కూడా తెలంగాణపైనే. తెలంగాణ ఆనవాలు లేకుండా చేయడం కోసమే వీరు కృతనిశ్చయంతో ఉన్నరు. రాష్ట్ర చిహ్నాలను తొలగించడం ఆ పెద్ద కుట్ర తాలూకు ఒక tip of the iceberg మాత్రమే! అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయినయి ఆర్నెళ్లుగా. దానికంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి విచ్ఛిన్నమవుతున్నది. చిహ్నాలు మారడమే కాదు… తెల్లవారిని గొప్పవారు అనుకునే స్థితిలోకి ఆఫ్రికన్లను నెట్టినట్టుగా ఇపుడు తెలంగాణ మేధావులకు తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, వారసత్వం పనికిమాలినవి అయిపోతున్నయి.
‘కీరవాణి కంటే గొప్ప సంగీత దర్శకుడిని తెలంగాణలో చూపించు’ అని అందెశ్రీ అనడం ఈ దిగజారుడుతనానికి మేలిమి ఉదాహరణ. పాట అనేది తెలంగాణ ఇరుసు. ఈ మట్టిలో పుట్టిన ప్రజా కవులు, రచయితలు, గాయకులు లెక్కకు మిక్కిలి! తెలంగాణ మట్టి మనుషులు వారు. అడవితో, వెన్నెలతో, హక్కులతో, బాధ్యతలతో, పంచాయితీతో, పార్లమెంట్‌తో, రాష్ట్రంతో, దేశంతో అన్నిటితో ముడిపడిన బతుకు చిత్రాన్ని ప్రభావవంతంగా ప్రకటించే వాగ్గేయకారులకు నెలవు ఈ నేల. వారు రాసి, బాణీ కట్టి, స్వయంగా పాడే పాటలకు ఏ అంతర్జాతీయ దిగ్దర్శకుడు కూడా ఆత్మను ప్రకటించే సంగీతం ఇవ్వలేడు.
అందెశ్రీ ‘జయ జయహే’ పాటకు అసలు సంగీతమే అక్కర్లేదు. మ్యూజికల్ ఇన్స్ట్ట్రుమెంట్స్ పెట్టుకోవచ్చు, కానీ ఆ అరేంజ్మెంట్ చేసేవారు ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి, ఆయనకు మించి తెలంగాణకు దిక్కులేదని అందెశ్రీ అనడం నిజంగా విషాదం. ఆయనకూ, మిగిలిన ఆత్మ చచ్చిన తెలంగాణ వారికి ఒక ప్రశ్న. నాడు అందెశ్రీ గీతం నిడివి ఎక్కువ ఉందని, జాతి గీతం కోసం కొంచెం కుదిద్దామని (ఇపుడు మనం పాడుకునే ‘జన గణ మన’ కూడా కుదించిన గీతమే అని మనవి) అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే నిరాకరించిన, ఆ తర్వాత కేసీఆర్ తనను పట్టించుకోలేదని అభాండాలు వేసిన అందెశ్రీ… ఇపుడు రేవంత్‌రెడ్డి, కీరవాణి మ్యూజిక్కు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నడో చూస్తున్నరు కదా? ఇది కదా నిజమైన దరిద్రం!!
అభివృద్ధి-సంక్షేమాలు ముందో, వెనుకో నడుస్తనే ఉంటయి. ఆత్మ చచ్చిన తర్వాత, అస్తిత్వం కనుమరుగైన తర్వాత, తెలియని బానిసత్వంలోకి మరలా కూరుకుపోయిన తర్వాత… భాష, యాస, ఆహారం, ఆహార్యం, ఆచారం, వ్యవహారం అన్నింటా పరాయితనం ఆవరించిన తర్వాతి బతుకు ఎంత భయానకం? జూన్ 2, 2014కు మునుపటి చీకటి రోజులు మరలా వస్తున్నయనే ప్రమాద హెచ్చరికలు రోజూ జారీ అవుతూనే ఉన్నయి, భయం గొలుపుతూనే ఉన్నయి.
ఇందులోంచి తేరుకొని, రేవంత్ రెడ్డి చేస్తున్న ‘తెలంగాణ చెరిపివేత’పై నాటి ఉద్యమస్ఫూర్తితో 33 జిల్లాల సకలజనుల భాగస్వామ్యంతో ధిక్కార స్వరం వినిపించాలె. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మనమంతా నడుం కట్టాలె. రాష్ర్టావతరణ నాడు మనం పునరంకితం కావాలె. జాగో తెలంగాణ!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371