IND vs NZ : ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది. ఛేదనలో విరాట్ కోహ్లీ(93), శుభ్‌మన్ గిల్(56) అర్ధ శతకాలతో అలవోకగా గెలుస్తుందనుకున్న టీమిండియా.. కైలీ జేమీసన్ (4-41) తన ఆఖరి స్పెల్‌లో మూడు వికెట్లు తీయడంతో కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్(49)ను బౌల్డ్ అయ్యాక.. కేఎల్ రాహుల్(29 నాటౌట్) ఒత్తిడిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కాలి గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్(7 నాటౌట్) సాయంతో జట్టును గెలిపించాడు రాహుల్. క్లార్క్ వేసిన 49వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌తో టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో ఇటీవలే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ గెలుపొందిన భారత జట్టు మరో సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. ఆదివారం వడోదరలో న్యూజిలాండ్‌పై కాస్త కష్టంగానే గెలుపొందింది. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన న్యూజిలాండ్‌ను 300లకే కట్టడి చేసిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ(26)తన స్టయిల్లో శుభారంభమిచ్చాడు. పవర్ ప్లే తర్వాత గేర్ మార్చాలనుకున్న అతడిని కైలీ జేమసన్ వెనక్కి పంపాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(56) ఆచితూచి ఆడగా.. విరాట్ కోహ్లీ(93) ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ స్కోర్‌బోర్డును ఉరికించాడు.
Prevailing in a thriller! 👏
A victory by 4⃣ wickets for #TeamIndia to take a 1⃣-0⃣ lead in the three-match series 🥳
Scorecard ▶️ https://t.co/OcIPHEpvjr#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/1pT7kPjsU3
— BCCI (@BCCI) January 11, 2026
ఈ క్రమంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో 28వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. గిల్‌తో కలిసి విరాట్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపాడు. అర్ద శతకంత తర్వాత గిల్ ఔటైనా కోహ్లీ మాత్రం క్రీజును వదల్లేదు. శ్రేయాస్ అయ్యర్(49)తో కలిసి కివీస్ బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు. సెంచరీకి చేరువైన విరాట్‌ను జేమీసన్ ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అదే ఓవర్లో జడేజాను వెనక్కి పంపిన అతడు.. తర్వాత ఓవర్లో అయ్యర్‌ను బౌల్డ్ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. అప్పటికీ విజయానికి 53 బంతుల్లో 59 రన్స్ కావాలి.
చూస్తుండగానే మూడు బిగ్ వికెట్లు పడడంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టన్ అయ్యారు. అయితే.. హర్షిత్ రానా(29) జతగా కేఎల్ రాహుల్(29 నాటౌట్) సమయోచితంగా ఆడాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ రిస్క్ తీసుకోలేదు. సాధించాల్సిన రన్‌రేటు పెరిగిపోతుండడంతో హర్షిత్ దూకుడుగా ఆడాడు. రానా ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్(7 నాటౌట్) అండగా రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్లార్క్ వేసిన 49వ ఓవర్లో చివరి మూడు బంతుల్ని 4, 4, 6గా మలిచిన అతడు 4 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
Coming up clutch! 💪
KL Rahul seals victory for #TeamIndia in some style 🙌
Updates ▶️ https://t.co/OcIPHEpvjr #INDvNZ | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/wfo59uBEgE
— BCCI (@BCCI) January 11, 2026
టాస్ ఓడిన జట్టుకు కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు అర్ధ శతకాలతో శుభారంభమిచ్చారు. 21 ఓవర్ల వరకూ వికెట్ పడకపోవడంతో అలవోకగా మూడొందలకు పైగా కొడుతుందనిపించింది. కానీ, హర్షిత్ రానా(2-65) ఈ ఇద్దరిని వెనక్కి పంపి పరుగులకు అడ్డుకట్ట వేశాడు. ప్రసిధ్ కృష్ణ(2-60) పొదుపుగా బౌలింగ్ చేయగా మిడిలార్డర్ తోకముడిచింది. ఓవైపు వికెట్లు పడుతున్న డారిల్ మిచెల్ (84) ఒంటరి సైనికుడిలా పోరాడాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన అతడిని ప్రసిధ్ వెనక్కి పంపడంతో న్యూజిలాండ్ 300లకే పరిమితమైంది.