Special Police | ‘మాలోని వాడవే.. మావాడవే నీవు పొట్టకూటికి నేడు పోలీసువైనావు..’ అనే చెరబండరాజు ఆత్మీయ అక్షరాలింగనం గుర్తుకువస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు బెటాలియన్లలో రాజుకుంటున్న అసహనమే అందుకు కారణం. తెలంగాణ స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లు యూనిఫారాలు వేసుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులూ, పిల్లాపాపలతో గొంతు కలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇది అసాధారణమైన ఘటనే. ఇదేదో చెదురుమదురుగా జరిగిందీ కాదు. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక బెటాలియన్లు నిరసనలతో దద్దరిల్లాయి.
ఆందోళనలను అదుపు చేసే పోలీసులే ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దుర్భరమైన డ్యూటీలు, వెట్టిచాకిరీ, ఆపై వేధింపులు, అవమానాలు, కుటుంబాలకు దూరంగా గడపాల్సి రావడం వంటి సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. స్టేషన్ విధులు నిర్వహించే సిబ్బందికి, తమకు మధ్య పని పరిస్థితులు, జీతభత్యాల విషయంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలని బెటాలియన్ పోలీసులు కోరుతున్నారు. తమిళనాడు తరహాలో ఏక రీతి పోలీసు విధానం అమలు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. మహజర్లు సమర్పించడం సహా తమ ముందున్న అన్ని మార్గాలూ మూసుకుపోయిన తర్వాత మాత్రమే వారు వీధుల్లోకెక్కారన్నది వాస్తవం.
పోలీసుల ఆందోళన ఒక రకంగా రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలూ అతలాకుతలం అవుతున్నాయి. మొన్న రైతులు, నిన్న ఉద్యోగార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టడాన్ని చూశాం. పోలీసు వ్యవస్థ అందుకు మినహాయింపు ఏమీ కాదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం వీటి పట్ల వ్యవహరిస్తున్న తీరులో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సమస్యలపై దృష్టి నిలపకపోవడం కాగా.. పరిపాలనాపరమైన అపరిపక్వత రెండవది. పోలీసు వ్యవహారాలు చూసే హోం శాఖ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉందన్న సంగతి మరువరాదు.
బెటాలియన్లు ఏం కోరుకుంటున్నాయనేది ఆయనకు తెలియదా? అసంతృప్తి రగులుతున్న సంగతి పసిగట్టలేకపోయారా? సకాలంలో స్పందించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిశీలనకు స్వీకరించి, తగిన పరిష్కారం కనుగొంటే సరిపోయేది. కానీ, భేషజాలకు పోయి బెదిరింపులు, అరెస్టులకు పాల్పడటంతో పోలీసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సమస్యను శాంతిభద్రతల అంశంగా చూస్తూ రాష్ర్టాన్ని దిగ్బంధనంలో పెడుతున్న ప్రభుత్వ ధోరణి సర్వత్రా విమర్శల పాలవుతున్నది. ప్రభుత్వ పెద్దల నివాసాల వద్ద ఏర్పాటు చేసిన కంచెల గురించి అనవసరమైన హంగామా చేసినవారు ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్ రోడ్డు దాకా పోలీసు వలయం గురించి ఒక్కమాటా మాట్లాడటం లేదు. ఆ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టో వారికే తెలియాలి? ఈ నేపథ్యంలో ప్రజలు ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకోవడంలో వింతేమున్నది.
ఖాకీ యూనిఫారాలు వేసుకునేది మనుషులే. వారికీ కుటుంబాలుంటాయి. తీరుబడి, నిమ్మళం అనేది లేకుండా అహోరాత్రులు పనిచేయడానికి వారు యంత్రాలు కాదు, రోబోలు అసలే కాదు. ‘మమ్మల్ని కూడా మనుషులుగా చూడమ’ని వారు అడుగుతున్నారు. ‘మనసుపెట్టి మా సమస్యలు ఆలకించండి’ అని వేడుకుంటున్నారు. పరిస్థితులు చేయిదాటిపోకముందే ప్రభుత్వం పరిణతితో వ్యవహరించాలి. ఎన్నికలకు ముందు అందరికీ అన్నీ అన్నట్టుగా ఏక్ పోలీస్ విధానం తెస్తామని ఇచ్చిన హామీ అమలుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు కదలాలి. పోరుబాట పట్టిన పోలీసుల పట్ల ప్రతీకార ధోరణిని మానుకుని పరిష్కారానికి కృషి చేయడం రాష్ర్టానికి శ్రేయస్కరం.