‘మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టింది. అడవంతా పోలీసు క్యాంపులతో నింపేసింది. వేలాది పారామిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్ దళాలతో దండకారణ్యాన్ని కొన్ని రోజులుగా జల్లెడ పడుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలతో అడవి అణువణువునూ శోధిస్తున్నది. ఆదివాసీ గూడేలను తగలబెడుతున్నది. నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ పేరిట పచ్చని అడవిలో నెత్తురుటేర్లను పారిస్తున్నది. మావోయిస్టులను.. అమాయక ఆదివాసీ తెగలను ఊచకోత కోస్తున్నది. మారణహోమాన్ని సృష్టిస్తున్నది. మానవహక్కుల హననానికి పాల్పడుతున్నది. హింసతో, అణచివేతతో అడవిలో కల్లోలం రేపుతున్నది.
గతేడాది జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్‌లో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 500 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారంటే ఎంతటి భీతావహ పరిస్థితి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘన ఏ తీరుగా సాగుతున్నదో ఒక అంచనాకు రావచ్చు. మరోవైపు దండకారణ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని తెలంగాణ పౌరసమాజం నుంచి అంతే స్థాయిలో డిమాండ్ పెల్లుబుకుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభలో లక్షలాది జనం సాక్షిగా వేదికపై నుంచి పిలుపునివ్వడంతో రాజకీయవర్గాల్లోనూ ఒక కదలిక ప్రారంభమైంది. కానీ, కేంద్రం మాత్రం మావోయిస్టు నిర్మూలనే కాదు, అడవిలో మానవ మాత్రుడు ఉండకూడదనే ధ్యేయంతోనే ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టంగా తెలిసిపోతున్నది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతున్నది. మరింతకీ ఈ మావోయిస్టులు ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు?
అడవుల్లో ఎందుకు మగ్గుతున్నారు? ఆయుధాలు ఎందుకు చేపట్టారు? ఆదివాసులతో వారికి అనుబంధమెక్కడది? వారికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న వైరమేమిటి? స్వజాతి జనులపై ఎందుకోసం.. ఎవరికోసం ఈ హింస? ఎవరి వికాసానికీ రక్తపాతం? ఆపరేషన్ కగార్ ఆంతర్యమేంటి? ఎవరికి లాభం? మరెవరికి నష్టం? అనే మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి జవాబులు కూడా సుస్పష్టం. మావోయిస్టులు దిగంతాల నుంచి ఊడిపడలేదు. శత్రుదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులు కాదు. ఈ భారతావని బిడ్డలే. మన సోదరీ సోదరులే. ప్రభుత్వాలకు, వాళ్లకు, మనకు మధ్య ఉన్నది కేవలం సిద్ధాంత వైరుధ్యమే. అది శాంతిభ్రదతల సమస్య కాదు. ఒక రాజకీయ ఉద్యమం. దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షే దానికి కారణం. సూటిగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక స్రూతాల అమలు కోసం ఒక వర్గం తరాలుగా సాగిస్తున్న సాయుధ పోరాటం. బిర్సా ముండా, కుమ్రంభీమ్ల ఆశయాల ప్రతిరూపమే నూతన ప్రజాస్వామిక విప్లవం. మరెందుకు మావోయిస్టులపై ఈ ప్రభుత్వాల యుద్ధం అంటారా? దండకారణ్యం గర్భంలో దాగిన లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద కోసం.
దశాబ్దాల కిందటనే మైనింగ్ మొదలైనా అదింకా దండకారణ్యమంతటికీ విస్తరించలేదు. అందుకు ప్రధాన కారణం దండకారణ్యాన్ని పొదివి పట్టుకున్న ఆదివాసీలు. ఆ అడవిబిడ్డలకు ఆలంబనగా నిలుస్తున్న మావోయిస్టులు. అందుకే ఖనిజ సంపద దోపిడీకి ఏ అడ్డు లేకుండా చేసుకునేందుకు కార్పొరేట్‌శక్తులు, వాటి అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్ర ప్రభుత్వ పాలకులు ఆ ఆదివాసీలు, మావోయిస్టుల ఏరివేతకు కుట్రపూరిత ప్రణాళికలకు సైతం దశాబ్దాల కిందటే తెరలేపాయి.
ప్రపంచంలోనే అపారమైన, అత్యంత అరుదైన ఖనిజ నిల్వలకు చిరునామా మన భారతదేశం. అందులోనూ ప్రధానంగా దండకారణ్య ప్రాంతం. మన దేశంలో అటవీ విస్తీర్ణం 2.29 మిలియన్ చ.కి.మీ. ఆ మొత్తం విస్తీర్ణంలో మధ్య భారతంలోని దండకారణ్యం 9.60 శాతం. ఇక ఆంధ్రపదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర అతిపెద్ద రాష్ర్టాల్లో లక్షలాది చదరపు కిలోమీటర్ల పరిధిలో దండకారణ్యం విస్తరించి ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలో తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ పరిధిలోకి వస్తాయి. ఈ అటవీక్షేత్రం లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాల నిలయం. ఈ దేశ జాతి సంపద. దాని విలువ దశాబ్దకాలం కిందటనే రూ.9 వేల లక్షల కోట్లని ఒక ప్రాథమిక అంచనా. ఇప్పుడది అంతకు రెట్టింపు. ఆ ఖనిజ సంపదపై దశాబ్దాల కిందటనే సామ్రాజ్యవాదుల కన్ను పడింది. 1968లో జపాన్‌కు చెందిన బైలదిల్లా కంపెనీ మైనింగ్ ప్రారంభించి ఇనుప రజను కొల్లగొట్టడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత టాటా పోస్కో, ఎస్సార్ జిందాల్, రియో టింటో, బీహెచ్‌ఐ, మిట్టల్, వేదాంత రీసోర్సెస్ వంటి విదేశీ కార్పొరేట్ సంస్థలు జతకలిశాయి. ఇప్పుడు ఆ ఖనిజ సంపద దోపిడీకి అదానీ, అంబానీ తదితర దేశీయ కార్పొరేట్ శక్తులు క్యూ కట్టాయి. ఆయా కంపెనీలకు జాతి సంపదను గంపగుత్తగా దోచిపెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ఒప్పందాలు చేసుకున్నారు, చేసుకుంటూనే ఉన్నారు. రాబోయే మూడు దశాబ్దాల్లోగా అక్కడి ఖనిజసంపద యావత్ను కొల్లగొట్టే లక్ష్యంతో బడా పార్రిశామికవేత్తలు, వారి కనుసన్నల్లో నడుస్తున్న కేంద్రం ముందుకు సాగుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. అదిప్పుడు మరింత విశ్వరూపం దాల్చింది. కాంగ్రెస్ హయాంలో 90వ దశకంలో జన జాగరణ్ పేరిట మొదలైన ఊచకోత ఆ తర్వాత 2005లో సల్వాజుడుంగా రూపాంతరం చెందింది. ఆపై గ్రీన్‌హంట్‌గా, ఆపరేషన్ సమాధాన్ పేరిట ముందుకువచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం ఏకంగా అంతిమయుద్ధం ప్రకటించింది. యుద్ధరీతులు మారాయేమో కానీ దమననీతి మాత్రం మారలేదు. రూపమేదైనా వాటి లక్ష్యం ఒక్కటే. మైనింగ్ విస్తరింత. అందుకే అడవి పొత్తిళ్ల నుంచి ఆదివాసీల తరిమివేత. మావోయిస్టుల ఏరివేత. అదిప్పుడు విశ్వరూపం దాల్చింది.
కార్పొరేట్ శక్తుల కోసం సాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, శాంతిచర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు. ఆ శాంతి కోసం దేశ మేధావివర్గం కూడా గళం విప్పుతున్నది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనతో రాజకీయవర్గాల్లోనూ కదలిక వచ్చింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం శాంతిచర్చల ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలోనే దండకారణ్యంలో శాంతి కోసం ఇప్పుడు పౌర సమాజం కూడా డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆదివాసీల విస్థాపన తర్వాత.. మావోయిస్టులను ఏరివేశాక జరగబోయేది ప్రకృతి వినాశనమే. దండకారణ్యాన్ని ఛిద్రం చేయడమే. పోయేది అడవే కదా? అడవిబిడ్డలే కదా? అని అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. భారతదేశంలో ఎక్కడా లేని జీవ వైవిధ్యానికి ఆలవాలం దండకారణ్యం. అనేక నదుల జన్మస్థానం. విస్తారమైన వర్షపాతానికి మూలధారం.
భూగర్భజలాల పెంపులోనూ ఈ పర్వతశ్రేణులే కీలకం. లక్షల ఏండ్ల పర్యావరణ సమతుల్యతకు కేంద్రం. మరి ఖనిజ వనరుల కోసం అడవిని నరికేసి, పర్వతాలను పిప్పిచేశాక మిగిలేదంతా క్షామం. అంతేనా మైనింగ్ వ్యర్థాలతో నీరు, గాలి కాలుష్యం. వెరసి అడవంచు గ్రామాల్లో మానవ మనుగడే ఒక ప్రశ్నార్థకం. ఇదేమీ ఊహాజనితం కాదు. అమెజాన్ అడవిని నాశనం చేసుకొని నేడు త్రీవ కరువు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న బ్రెజిల్ దేశం ఓ సజీవ సాక్ష్యం. కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా ఖండంలో ఒక్కొక్క దేశం చరిత్ర చెప్తున్న సత్యం. మన దేశ నడిబొడ్డులో ఆ వినాశనం ఇప్పటికే మొదలైంది. అది క్రమంగా విశ్వరూపం దాల్చుతున్నది. అందుకే ఇప్పుడు శాంతికోసమే కాదు, భవిష్యత్తు తరాల భద్రత కోసమూ గళం విప్పాలి. కదం కదపాలి. అడవిని, ఆ అడవిని వెన్నంటి కాపాడుతున్న అడవి బిడ్డల పోరాటానికి బాసటగా నిలవాలి. అది అత్యావశ్యం. మరీ ముఖ్యంగా తెలంగాణ కర్తవ్యం. ఎందుకంటే రాష్ట్ర వరదాయినిగా నిలిచే గోదావరి జలాలకు ప్రాణాధారం. ప్రాణహిత జన్మస్థానం ఆ దండకారణ్యమే.