కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నది జగమెరిగిన సత్యం.
వ్యవసాయం, ఐటీ, అభివృద్ధి, ప్రకృతి సంరక్షణ, ప్రాజెక్టుల నిర్మాణం, రైతులు, దళితులను ఆదుకోవడం, సబ్బండ కులాల ఆదాయాలు పెంచడం లాంటి అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శ ప్రాయంగా ఉన్నది. తనను తాను ఏ మాత్రం సంస్కరించుకోకుండా, దేశమంతటా తామెందుకు ఓడిపోతున్నామో చర్చించుకోకుండా తెలంగాణలో గెలవాలని చూస్తున్నది కాంగ్రెస్. ఉత్పత్తి సంబంధమైన ప్రజల ఆదాయాలను పెంచే ఉద్యోగ కల్పన లాంటివేవీ చేయకుండా మత, అమానవీయ సెంటిమెంట్లను రెచ్చగొడుతూ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కుట్రలు పన్నుతున్నది బీజేపీ.
కేసీఆర్ తన వ్యూహాలతో, మానవీయ పథకాలతో, చాణక్య రాజకీయ ఎత్తుగడలతో కాంగ్రెస్, బీజేపీలను చిత్తు చేస్తూ క్రమంగా కేంద్రాన్ని శాసించే ఎత్తుకెదుగుతున్నారు. తెలంగాణను అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుపుతూ టీఆర్ఎస్ను అజేయశక్తిగా నిలబెట్టడం తమ పార్టీల గెలుపునకు అడ్డుకట్ట అన్న విషయం బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలుసు. అందుకే ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో సహా దేశాధ్యక్షులను పిలిపించి కేసీఆర్‌పై అనేక ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రావాల్సిన నిధులను ఆపడం, ధాన్యం కొనుగోలు లాంటి ఇతర విషయాల్లోనూ వివక్ష చూపిస్తున్నది. వీటన్నింటిని ఒంటి చేత్తో ఎదిరిస్తూ బంగారు తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, ప్రతి తెలంగాణ పౌరుడి కంచంలోకి బుక్కెడన్నం చేరడానికి తనను తాను అర్పించుకుంటున్నారు, అంకితమవుతున్నారు కేసీఆర్.
ఒక పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే, ఆ పార్టీ చేసిన ప్రజోపయోగ పనులు, ప్రజలకు కల్పించిన ఉపాధి కల్పన, నిర్మించిన ప్రాజెక్టులు, తమ పాలనలో చేసిన శాశ్వతంగా నిలిచిపోయే పనులు, అమలుచేసే పథకాలను చెప్పి ఓట్లడగటం ప్రజాస్వామిక పద్ధతి. ఉత్తమ రాజకీయ పంథా. అలా కాకుండా వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, గోబెల్స్ ప్రచారం, పసలేని ఆరోపణలు చేస్తూ గెలుపు తమదేనని చంకలు గుద్దుకోవడం ప్రజాస్వామిక పద్ధతి కాదు. కేసీఆర్ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదు, నీళ్లు, నిధులు, నియామకాలు, సాధించలేదని చేసిన ఆరోపణలన్నీ దూదిపింజల్లా గాలిలో ఎగిరిపోతే ఇక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏండ్ల తరబడి మొత్తుకోవడమే తప్ప, ఒక్క అవినీతి ఆరోపణ రుజువు కాలేదు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహబూబ్‌నగర్ లాంటి కరువు జిల్లాల్లోనూ నీటికళ, ఎండా కాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతున్న స్థితి ప్రస్తుతం ఉన్నది. రాష్ట్రమంతటా భూగర్భజలాలు పెరిగి బావులు, బోర్లలో నీళ్ళు పైకి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి అవతలున్న పాత అదిలాబాద్ జిల్లాకూ నీరందుతుంది. రాష్ట్రంలో నీటి వసతి మెరుగవ్వడంతో రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. ఇది వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టు వందలాది ఏండ్లు తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటి చేయడంలో తన వంతు పనిచేస్తూనే ఉంటుంది. ఓ యేడు వానలు పడకు న్నా, తక్కువైనా ఈ రిజర్వాయర్ల నీటిని ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకోవచ్చు.
లక్షలాది కోట్ల నల్లధనాన్ని ప్రపంచ బ్యాంకులో దాచుకున్నవారిని ఏమనకుండా, దాన్ని బయటకు తీసుకురాకుండా ‘వరల్డ్ వండర్’ ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులను ఆదుకుంటున్న కేసీఆర్ అవినీతి చేశాడనడం ఏ సంస్కృతికి నిదర్శనం? 13 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను ఎగ్గొట్టి ప్రపంచ ధనికులుగా చెలామణి అవుతున్న వాళ్లనుంచి ఆ డబ్బును తేకుండా తమ పాలనలో లేని రాష్ర్టాల నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం సబబేనా? అధికార పార్టీ ఎంపీల్లో సగం మంది అవినీతిపరులే అని వార్తాపత్రికలు కోడై కూస్తుంటే వాటిని పట్టించుకోని కేంద్రం, బీజేపీయేతర పార్టీల్లో పనిచేసే నాయకులను వేధించడం, బెదిరించడం ప్రజాస్వామ్యం అవుతుందా?
అవినీతి ఆరోపణలున్న ఇతరపార్టీల నాయకులు అధికార పార్టీలో చేరితే ఆ అవినీతంతా నీతిమయమైపోతుందా? ప్రజల కోసం పరితపిస్తూ అనేక పథకాలతో ముందుకెళ్తున్న కేసీఆర్ లాంటి నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు చేయడం ఎలాంటి రాజనీతి? అవినీతి రహిత ఢిల్లీ నినాదంతో అధికారంలోకి వచ్చి అలాగే పాలిస్తున్న కేజ్రీవాల్‌పై కూడా బీజేపీ ఆరోపణలు చేయడం కొసమెరుపు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ముందు తాము పునీతులై, ఇతరుల గురించి మాట్లాడితే మంచిది. ఆధారం చూపకుండా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ దోషిని చేయడం ధృతరాష్ర్టుడు అంధుడై తన కొడుకుల అపారమైన తప్పులను గమనించకుండా పాండవులను తప్పుబట్టడం లాంటిదే. అందువల్ల జరిగిన నష్టమేంటో, విజయం ఎవరిదో భారత కథ తెలిసినవారందరికీ విదితమే. ఈ కథ తెలంగాణలోనూ పునరావృతమవుతుంది.
గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరుగదన్నట్టు, ప్రపంచ అద్భుతం, ఇంజినీరింగ్ టెక్నాలజీ వండర్ అయిన కాళేశ్వరాన్ని చూడలేని ధృతరాష్ర్టులు వీళ్లు. ‘ఎండా కాలంలోనూ గోదావరి నదిలో 20 కి.మీ. మేర నీళ్లు వ్యాపించి ఉన్నాయని, ఇది తెలంగాణ జలసిరి’ అని ప్రముఖ వాటర్ ఇంజినీర్ రాజేందర్ సింగ్ అన్న మాటలు కూడా వీరి చెవికెక్కలేదు. అవును రూ.80 వేల కోట్లతో సింహభాగం పూర్తయిన ఈ ప్రాజెక్టు మరో నలభై వేల కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇది ఓర్వలేని ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరం. 56 ఏండ్లు దేశాన్నేలిన, ఎన్నో స్కామ్‌లలో ఇరుక్కున్న కాంగ్రెస్, అవినీతికే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
– డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567
రుక్మిణీ సందేశం