ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక ‘సోయి’ (సంపుటి-1, సంచిక-2)లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహితీమూర్తుల అస్తిత్వ అంశాల ప్రస్తావన లేవనే ఒక వాదన వినిపించింది. అప్పట్లో ఉద్యమకారుల్లో దీనిపై చర్చ జరిగింది. ఫలితంగా పాటలో కవి ఆమోదంతో, కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. ఇలా మార్చిన పాటను బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 2004 ఎన్నికల సమయంలో క్యాసెట్గా మలిచి, విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. ప్రజల్లోకి తీసుకుపోయింది. తర్వాత మరిన్ని అంశాలను చేరుస్తూ అందెశ్రీ ఈ పాటను 12 చరణాలకు పెంచారు.
పల్లవి: జయజయహె తెలంగాణ
జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల
తల్లీ నీరాజనం
పది జిల్లాల నీ పిల్లలు
ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
॥ జయ ॥
చరణం : 1
కవిగాయక వైతాళిక
కళలా మంజీరాలు
డప్పూడమొరుకము డక్కో
శారద స్వర నాదాలు
పల్లవులా చిరుజల్లుల
ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం
అమ్మ నీవు మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
॥ జయ ॥
చరణం: 2
జానపదా జనజీవన
జావళీలు జాలువార
జాతిని జాగ్రుతపరిచె
గీతాల జన జాతర
వేలకొలదిగా వీరులు
నేల ఓరిగి పోతెనేమి
తరుగనిది నీ త్యాగం
మరువనిది శ్రమ యాగం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
॥ జయ ॥
చరణం: 3
బడుల గుడులతో పల్లెల
ఒడలు పులకరించాల
విరిసే జన విజ్ఞానం
నీ కీర్తిని పెంచాల
తడబడ కుండా జగాన
తల ఎత్తుకొని బతుక
ఒక జాతిగా నీ సంతతి
ఓ యమ్మా వెలుగాల
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
॥ జయ ॥
చరణం: 4
గోదావరి కృష్ణమ్మలు
తల్లినిను తడుపంగా
పచ్చని మాగానాల
పసిడి సిరులు కురువంగా
సుఖ శాంతుల తెలంగాణ
సుభిక్షంగా వుండాల
ప్రత్యేక రాష్ర్టానా
ప్రజల కలలు పండాల
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
– (సోయి సంచికలో అందెశ్రీ మాతృగీతం..)
జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
పోతనదీ పురిటి గడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు
॥ జయ ॥
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద చక్కనైన పూవుల పొద
సిరులు పండే సారమున్న మాగాణమె కద నీ ఎద
॥ జయ ॥
జానపద జన జీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతిపరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం, అమ్మ నీవె మా ప్రాణం
॥ జయ ॥
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె
పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండాలె
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
॥ జయ ॥
– (2004 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ రికార్డు చేసిన పాట)