తెలంగాణ ఒక కల, ఒక లక్ష్యం, ఒక పోరాటం! ఆ పోరాటంలో గెలిచింది ప్రజలు. వారికి నాయకత్వం వహించింది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇది చరిత్ర. పోరాటం ద్వారా సిద్ధించిన తెలంగాణ పురోగమనం, అభివృద్ధి, స్వాభిమానం అనే విలువలతో ముందుకెళ్లిన వేళ, దాన్ని వెనక్కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆ చర్యలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకత మరింత పెరిగింది.
తెలంగాణ అభివృద్ధికి అవిరళ కృషి చేసిన నాయకుడు తిరిగి అదే దారిలో ప్రజలకు మార్గదర్శకత్వం అందించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత తరుణంలో తెలంగాణకు అవసరమైన నాయకత్వం ఎవరు అందించగలరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఫిబ్రవరి 19న హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ సమాజం చారిత్రక అవసరం దృష్ట్యా ప్రసవించిన బిడ్డ నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (నేటి బీఆర్ఎస్)ని నెలలు నిండకుండానే నలిపివేయాలని ఎన్నో కుట్రలు జరిగాయని, అయినా వాటన్నింటినీ అధిగమించి రాష్ర్టాన్ని సాధించామని ఆ సమావేశంలో కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఇప్పుడు మళ్లీ వలసవాద కుట్రలకు బలయ్యే ప్రమాదం ఉన్నది. గత అనుభవాల గాయాల నుంచి కోలుకుంటున్న తరుణంలో వలసవాద పాలకుల చేతిలో పడితే ఇబ్బందుల పాలవుతాం. అలా జరగకుండా ఉండాలంటే, తెలంగాణకు శాశ్వతంగా న్యాయం జరగాలంటే ప్రజలను పూర్తిస్థాయిలో చైతన్యపరచాలి. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ మాత్రమే. సమావేశం విశిష్టత గురించి కూడా కేసీఆర్ వివరించారు. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాల బాధలు పూర్తిగా మానిపోయి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనేలా, తెలంగాణ తనకు తాను నిలబడాలన్న ఆశయంతో పుట్టిందే మన పార్టీ అని, అటువంటి చారిత్రక పాత్రను పోషించేందుకు సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకు లోతైన చర్చ కోసం నిర్వహిస్తున్నదే ఈ ప్రత్యేక సమావేశమని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ఠ నిర్మాణం చేసి అటు పార్టీ విజయం కోసం, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఫిబ్రవరి 17న కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. వేలమంది అభిమానులు, అనుచరులు, వివిధ రంగాల ప్రజలు కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారని, వారి రాక ఓ అద్భుతమైన సంకేతంగా మారిందని, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యం, అత్యంత ఆవశ్యమని అర్థమైందని రాశారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ 25 ఏండ్లకు పైగా తెలంగాణ సమకాలీన రాజకీయాలను శాసించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టాన్ని పునర్నిర్మించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యులకు ఎంతో మేలు చేకూర్చాయి. అయినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన పునరాగమనానికి ఏవిధమైన ఆటంకాలు లేవనే విషయం త్వరితగతిన మారుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘రైతుబంధు’, ‘దళితబంధు’, ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణను ఆత్మనిర్భర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని రద్దు చేస్తూ రాష్ర్టాన్ని తిరిగి సంక్షోభం దిశగా నడిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పునరాగమనం మినహా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, భవిష్యత్తుకు బలమైన భరోసా మరోటి లేదు.
చరిత్ర పునరావృతమవుతుంది. తప్పును సరిదిద్దుకోవడం తప్పదనే విషయం ప్రజలకు అనుభవమే. ఇలాంటి సందర్భాలు ‘భారతదేశ రాజకీయ చరిత్ర’లో అనేకం ఉన్నాయి. పాలనా వైఫల్యానికి ప్రతిస్పందనగా ప్రజలు పునరాగమనానికి తలొగ్గారు. ఘోర ఓటమి తర్వాత ఇందిరాగాంధీ ప్రజా మద్దతుతో మళ్లీ గెలిచారు. సమాజాలను మార్చిన నాయకులు చరిత్రలో కనుమరుగు కారు. వారు మరింత బలంగా తిరిగి వస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చౌరస్తాలో ఉన్నది. స్థిరమైన, సంక్షేమాధారిత పాలన ప్రయోజనాలను అనుభవించిన ప్రజలు చేసిన తప్పును సరిదిద్దుకునే దశలో ఉన్నారు. నాయకత్వం అంటే పాలన మాత్రమే కాదు, అది రాష్ట్ర భవిష్యత్తును మలిచే అంశం. ఇది రాజకీయంగా మాత్రమే కాదు, తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ తిరిగి రావడం అవసరం, అనివార్యం.
బీఆర్ఎస్కు తిరిగి పుంజుకొనే శక్తి ఉన్నది. కేసీఆర్ పుట్టిన రోజు ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ మద్దతుదారులు సంస్థాగత శక్తికి ఒక ఉదాహరణ. కేసీఆర్ దూరదృష్టి, రాజకీయ మేధస్సు, బీఆర్ఎస్ పునరాగమనాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా సమీప భవిష్యత్తులో రాజకీయ పునరేకీకరణకు, సమీకరణకు మార్గనిర్దేశనం చేయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవడం వల్ల రైతులు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ అసంతృప్తిని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా క్రోడీకరించి, ప్రజలకు వారు కోరుకున్న రీతిలో బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలమన్న భరోసా కల్పించగలిగితే కేసీఆర్ తిరిగి కచ్చితంగా సీఎం అవుతారు. మారుతున్న రాజకీయ పరిస్థితులను అనుసరించి బీఆర్ఎస్ తన విధానంలో మార్పు చేర్పులు చేసుకోవాలి. తెలంగాణ చరిత్రాత్మకమైన మలుపులో నిలిచివున్న ఈ సమయంలో అనుభవం, దూరదృష్టి, సంక్షేమ ప్రధానమైన కేసీఆర్ నాయకత్వం అత్యంత అవసరం. కేసీఆర్ కేవలం ప్రాంతీయ నాయకుడు మాత్రమే కాదు, తెలంగాణకు అతీతంగా దూరదృష్టి కలిగిన జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఎదిగే సామర్థ్యమున్న రాజనీతిజ్ఞుడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపించిన తీరును ప్రజలు మళ్లీ గుర్తు చేసుకోవాలి. తెలంగాణకు అవసరమైన నాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి. జరిగిన తప్పును సరిదిద్దుకోవడం తప్పనిసరి. కేసీఆర్ రాక చరిత్రలో లిఖించినదే. మార్గదర్శి తిరిగి రావాల్సిందే!
– వనం జ్వాలా నరసింహారావు