నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నేలతల్లి గర్భంలోని పాటును కలిపి పంటకు ఊతమిచ్చిన రైతు చేతుల రేఖలు అరుగుతున్నాయి. కానీ తన తలరాత మారే అదృష్టం లేదని రైతు ధాన్యపు రాశి కుప్పల మీద, చేనుగట్టు, చెట్టుకొమ్మల చివరన, బావుల దాపు గుడిసెల్లోనా కూలుతున్నడు, వేలాడుతున్నడు. ఇది వర్తమాన తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రం.
రెండేండ్ల క్రితం ఎలా ఉండేది? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువలతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు. అరవై ఏండ్ల సీమాంధ్ర పాలనలో ఆ చెప్పుల లైన్లు, చలి, వాన తేడా లేకుండా రాత్రి, పగలు లేకుండా విత్తనాలు, ఎరువులు, కరెంటు సంగ్రామాలకు చరమగీతం పాడారు. మళ్లీ ఈ రెండున్నరేండ్ల నుంచి అవే దృశ్యాలు చూస్తున్నాం. ‘ఉన్నది తినుండ్రి బిడ్డా.. మీరు ఈష్కూళ్లకెళ్లి వచ్చేటాళ్లకు ఏమన్న జేసిపెడ్తాపోండి..మా అయ్యగాదూ..’అంటూ పుట్టెడు రంధితోటి మొగొడు, పెండ్లాం గలిసి ఎరువుల దుకాణానికి ఉరికిన చేదుగుళికలు చవిచూస్తున్నాం. కిందపడి, మీదపడి ఎరువుల బత్తాలు తెచ్చి పంటను సావకుండా ఓ కొలిక్కి తెచ్చి దిగుబడి తీయటం కొంతలో కొంత ఉపశమనం. మరి ఆ పండిన పంటైనా యాళ్లకు కొంటే అంతకన్న మహాభాగ్యం మరోటి ఉండదనుకున్న అన్నదాతకు అక్కడా అదే తీరు.
గింజ కూడా వదలకుండా కొంటాం..అనే ఆ భరోసా ఎప్పుడో పోయింది. కొనుగోలు కేంద్రాలకు తరలిన ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, వరదకు కొట్టుకపోతూ, అమ్మటానికి వెళ్లిన ఇంటాయన రేపొత్తడో మాపొత్తడో అని చూస్తూ ఇక్కడ అర్ధాంగి, నాయిన్న వస్తే మామిడికాయలో, అరటిపండ్లో, డబల్ రొట్టో తెస్తడని ఆశగా చూసే పిల్లలు..ఎవరి ఆశల్లో వారే వేసారిపోతున్నారేగానీ ధాన్యం అమ్మకం అయ్యింది లేదు, ఆశలు తీరిందీ లేదు.
కాంటా పెట్టటానికి మాయిశ్చర్ రాదు, మార్కెట్లో, కొనుగోలు కేంద్రంలోనో ఆరబెడితే వరుణుడు ఏం పుణ్యం కట్టుకుంటాడో తెలియదు. ధాన్యాన్ని కాంటా పెట్ట్టాలంటే బస్తాలు ఉండవు. బస్తాల నిరీక్షణ తీరేలోపల తరలించే వాహనాలు రావు. సరే వచ్చినా లేబర్ కొరత. ఇంటికాడి పని ఇంటికాన్నే. మార్కెట్ల మనిషి మార్కెట్లనే. అగ్గి కురుస్తున్న ఎండలకు అమ్మకానికి వెళ్లిన రైతు శవమై వచ్చే తీరు.. ఇంతకన్నా ఈ ప్రభుత్వంలో ఒరిగిందేమిటి?
కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం నెపాన్ని నెట్టుకుంటూ రైతును అగాధంలోకి నెడుతున్నారు. ఈ సీజన్లో 90 లక్షల టన్నుల వరి ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్న కొనాలని సర్కార్ నిర్ణయించగా లారీల కొరత, అవసరాలు మెడల మీద ఉండటంతో అమ్మకం ఆలస్యమైతే మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవటంతో 90 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం కాస్త 75 లక్షలకు కుదించింది కాంగ్రెస్ సర్కార్. పంట దిగుబడి మార్కెట్కు పోటెత్తటానికి ముందే ఏర్పాట్లు చేయాల్సిన పాలకులు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోవటంతో రైతన్న తీవ్రంగా నష్టపోవటమే కాదు, ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాడు. ఆ మాటకొస్తే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావటం వరకే బాధ్యత వహించాల్సిన అన్నదాత తన దరిద్రాన్ని తానే తిట్టుకుంటూ ధాన్యం లోడెత్తి రైస్మిల్లో, గోదాముల్లోకో వెళ్లే వరకు భుజాలపై వేసుకుని మోయాల్సిన దుస్థితి దాపురించింది.
ఇక వాహనాల లెక్కలైతే కాగితాల్లో కనిపించిన స్పష్టంగా మోకామీద లేవు. ధాన్యం రవాణాకు సుమారు 13 వేల పైచిలుకు వాహనాలను సమకూర్చుకున్నామని పౌరసరఫరాల శాఖ లెక్కలు చెప్తున్నా ఆచరణ శూన్యం. కాంట్రాక్ట్ దక్కించుకున్న పెద్దలు నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 35 శాతం మేరకే వాహనాలను సమకూర్చి చేతులు దులుపుకుంటున్నారు. తరలించే వాహనాలను రైతులు స్వయంగా సమకూర్చుకుంటున్నా సమస్య కొలిక్కిరావటం లేదు. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటికీ సుమారు 40 లక్షల టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉన్నది.
ఓవైపు కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకాలమంతా గడిచిపోతుంటే, రైతన్న ఇంకా పెంటలు తోలటం, సాగు భూముల్లో తుప్పలు, కంపచెట్లను తొలగించటం చేసుకోలేక కాలం నెత్తిమీదకొస్తుందని హైరానా పడుతున్నాడు. ఇంకా విత్తనాల కొనుగోలు చేయాల్సిన మోకా కూడా తరుముకొస్తున్న సందర్భంలో ధాన్యం తరలింపు ప్రక్రియే కొలిక్కిరాకపోవటం సర్కార్ ఘోర వైఫల్యం. ఇంకో 20 రోజులైనా తరలింపు కార్యక్రమం ఓ ముగింపునకు వచ్చే అవకాశాలు కనిపించకపోవటంతో తన్నుకొస్తున్న రుతుపవనాల వేగాన్ని తట్టుకుని నిలబడటం దేవుడెరుగు.. కాంగ్రెస్ సర్కార్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో మరింత బేజారవుతున్నాడు రైతన్న. పంట పండించినందుకు సంబురపడాలా..కొనేటోడు లేక ఆగమైతిమని బాధపడాల్నా తెలియక శ్రమజీవి నడిమిట్లనే నాలుక తెరుస్తున్నాడు.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక