అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం రాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోగా సిఫారసులను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటివరకు ఆ సిఫారసులు కమిషన్ నుంచి తెప్పించుకోలేదు. పైగా మొదటి వాయిదా ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 24 వరకు, రెండవ వాయిదా అక్టోబర్ 24 నుంచి 2026 మార్చి 31 వరకు, 2026 మార్చి నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి ఉపాధ్యాయ, ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారు.
వాస్తవానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతనాలను స్థిరీకరించి, తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు, వేతన సవరణ సంఘం సిఫారసులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం, ఐదేండ్లలో ధరల స్థిరీకరణ, సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి, లోపాలను సవరించి, వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూలవేతనం, కరువుభత్యం, ఫిట్మెంట్లను కలిపి, వచ్చిన మొత్తాలను తాజాగా మూలవేతనాలుగా మాస్టర్ స్కేల్, ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించాల్సిన ఆవశ్యకత కమిటీకి ఉంటుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఆర్ బిశ్వాస్ చైర్మన్‌గా 2018లో మే 18న మొదటి పీఆర్సీ కమిటీని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. 2021 నుంచి 43% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా, కరోనా కష్టాలు వెంటాడినా రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల పాత్రను గుర్తించి అంతటి భారాన్ని కూడా భరించేందుకు సిద్ధపడింది. మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్. శివశంకర్‌ను చైర్మన్‌గా వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఆరు నెలల్లోగా రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇదిలావుండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలంటేనే జంకుతున్నారు. ఒకసారి ‘నన్ను కోసినా పైసలు లేవు అని, మరొకసారి మీకు జీతాలు పెంచి ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలా? లేక రైతు భరోసా, కల్యాణ లక్ష్మి పథకాలు, సామాజిక పెన్షన్లు తగ్గించాలా?’ అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు అసమంజసం, ప్రమాదకరం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా పీఆర్సీ నివేదికను తెప్పించుకోకుండా, దానిని అమలు చేయకుండా బీఆర్ఎస్ సర్కార్‌ను ఆడిపోసుకొని, పబ్బం గడుపుకోవాలని అనుకోవడం దుర్మార్గం. సెప్టెంబర్ 2026 వరకు పీఆర్సీ నివేదికను వాయిదా వేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఐదు శాతం ఐఆర్‌తో పాటు 40% ఫిట్మెంట్ 2023 జులై 1 నుంచి అమలు చేయాల్సిన బాధ్యత ఎంతో ఉన్నది. ఈ విషయంలో జాప్యం చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల నుంచి తీవ్ర నిరసనను చవిచూడాల్సి వస్తుంది.
(వ్యాసకర్త: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు)
– జి. తిరుపతిరెడ్డి
98663 06366