కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్‌రావు) పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు. విప్లవోద్యమం, దళితోద్యమం, మలిదశ తెలంగాణోద్యమంలో అగ్గిగళంతో యుద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి, పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్.
అసమానతల సమాజంలో గద్దర్ తన జననం నుంచి మరణం వరకు అసామాన్య పోరాటం సాగించారు. 1949లో నిరుపేద కుటుంబంలో జన్మించిన గద్దర్ పాలకులు, భూస్వాముల అణచివేత, దోపిడీని ధిక్కరించారు. నూనూగు మీసాల వయసు నుంచే బీఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలను అర్థమయ్యేరీతిలో ఒగ్గు కథలు, బుర్ర కథల రూపంలో వినిపించి మట్టి మనుషుల్లో చైతన్యం రగిలించారు. గోసి, గొంగళి, కాళ్లకు గజ్జెలు, చేతి కర్ర, ఎర్రజెండా కలగలిపిన ఆహార్యంతో గద్దర్ ఒక ట్రెండ్‌ను సృష్టించారు.
‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ పాటలో ఒకవైపు ఆవేదన చెందుతూనే, మరోవైపు ‘ఎట్టోళ్ల మట్టి చిప్పవు.. గాయిదోళ్ల గండ్ర గొడ్డలివి’ అంటూ తిరుగుబాటును నేర్పడం గద్దర్‌కే చెల్లింది. ప్రభుత్వమిచ్చే ‘నంది అవార్డు’ను తిరస్కరించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. జీవితమంతా ప్రజా పోరాటాల్లో గడిపిన గద్దర్‌ను రాజ్యం 75 ఏండ్ల వయస్సు వరకు 32 పోలీసు కేసులతో వెంటాడింది. తుపాకీ గుండ్లను ఎదుర్కొన్న గద్దర్ ‘నన్నూ గన్న తల్లూలారా, తెలుగూ తల్లి పల్లెల్లారా.. మీ పాటనై వస్తున్నానమ్మో మా అమ్మాల్లారా’ అంటూ ప్రజల వెంట నడిచారు. నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్ 70 ఏండ్లు నిండాక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘భారత రాజ్యాంగమే మనకు రక్ష.. ఓట్ల విప్లవానికి సిద్ధం కావాల’ంటూ తన జీవిత చరమాంకంలో పిలుపునివ్వడం అంటే బహుజనులను రాజ్యాధికారం వైపు పయనించమన్నట్టే. అదే ఆయన చివరి సందేశంగా భావించాలి.
తన జీవిత కాలమంతా పోరుబాటలో నడిచిన గద్దర్ 2023, ఆగస్టు 6న అనారోగ్యంతో తుదిశ్వాసను విడిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించి, పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను పొందుపర్చాలి. అప్పుడే ఆయనకు మనం ఘన నివాళులు అర్పించినవారమవుతాం.
-నరేష్ పాపట్ల, 95054 75431