సుమారు తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనాకాలంలో తెలంగాణ మత్స్యరంగం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలకు దారులు చూపింది. కానీ, గత తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మత్స్యరంగం కక్షపూరితమైన నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగం మీద ఎన్నో ఆశలను పెట్టుకున్న లక్షలమంది మత్స్యకార కుటుంబాలు తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ అగమ్యగోచరంగా గత వైభవం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు పూర్తి వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగాన్ని దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో నిలిపేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలను సర్వతోముఖాభివృద్ధి దిశలో నడిపించేందుకు నడుం కట్టడమే కాకుండా, వేల కోట్ల రూపాయల వ్యయంతో అమల్లోకి తీసుకువచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుకుచేసుకుంటూ వర్తమానకాలంలో తాము ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను తలచుకొని తల్లడిల్లిపోతున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ మత్స్యరంగం వందేండ్లు వెనుకబడిపోయింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన మత్స్య రంగానికి కనీసం మంత్రి కూడా లేకపోవడం ఇప్పటి ప్రభుత్వ వివక్షపూరిత వైఖరికి నిదర్శనమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఉదార వైఖరితో రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, తద్వారా ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అనేక పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి నెలకొని ఉన్న పరిస్థితులకు, పదేండ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అమలుచేసిన కార్యక్రమాలను బేరీజు వేసుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మత్స్యరంగం పట్ల అనుసరిస్తున్న వివక్షత అర్థమవుతుంది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మత్స్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో మూడంచెల విధానాన్ని రూపొందించుకున్నది. ఆ విధానాన్ని పటిష్ఠమైన పద్ధతుల్లో అమలుపరిచేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. చేపల పెంపకానికి అవసరమైన చెరువులను పటిష్టపరిచి నీటి వనరులను స్థిరీకరించింది. మౌలిక వసతులను విస్తృతపరచడం, రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాలను, సభ్యులైన మత్స్యకారుల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనివ్వడం, సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం లాంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. కేవలం విధానపరమైన నిర్ణయాలను ప్రకటించి చేతులు దులుపుకోకుండా, వాటిని అమలుపరిచేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా నిర్మించిన జలాశయాలు, గోదావరి నదీ గర్భానికి సంబంధించిన బ్యాక్ వాటర్స్‌తో పాటుగా, మిషన్ కాకతీయ పథకాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాడు మన రాష్ట్రంలో కేవలం ఆరు లక్షల హెక్టార్లుగా ఉన్న నీటి విస్తీర్ణ సామర్థ్యం పై చర్యల ఫలితంగా ఏడున్నర లక్షల హెక్టార్లకు చేరుకున్నది. రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు ఏడాది పొడవునా చెరువుల్లో జల వనరులు అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఏటా మూడు నెలలు మాత్రమే కొనసాగిన చేపల వేట ఏడాది పొడవునా పూర్తికాలపు వృత్తిగా మారిపోయింది. ఫలితంగా చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2014లో తెలంగాణ ప్రాంతంలో సుమారు రెండు లక్షల టన్నులుగా నమోదైన వార్షిక చేపల ఉత్పత్తి 2023 నాటికి నాలుగున్నర లక్షల టన్నులు దాటింది. ఈ మేరకు రాష్ట్రంలోని మత్స్యకారుల ఆదాయ వృద్ధి కూడా నమోదైంది. గతంలో తెలంగాణలోని మత్స్యసహకార సంఘాలలో సభ్యులుగా నమోదు కావడానికి ప్రామాణికంగా నిర్ణయించిన హెక్టారు విస్తీర్ణాన్ని ఎకరం విస్తీర్ణానికి కుదించడంతో సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలోని మత్స్యసహకార సంఘాలలో సభ్యులుగా నమోదైన సుమారు రెండున్నర లక్షలమంది సభ్యుల సంఖ్య 2023 నాటికి నాలుగున్నర లక్షలకు పెరిగింది. ఈ మేరకు మత్స్యసహకార సంఘాల సంఖ్య కూడా గతంలో ఉన్న మూడున్నర వేల నుంచి ఆరు వేలకు పెరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంస్థాగతమైన మార్పులతో పాటు మత్స్యకారుల్లో ఆర్థిక స్వావలంబనను సాధించే దిశలోనూ సమాంతర కృషి జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలందుకున్న రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడానికి రెండేండ్ల ముందుగానే తెలంగాణలో అప్పటి ప్రభుత్వం 2016లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఈ పథకాన్ని కొనసాగించింది. రాష్ట్రంలో మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలో నడిపించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల భారీ నిధులను సేకరించి సమగ్ర మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలుపరిచింది. ఈ పథకం ద్వారా సుమారు లక్షా 30 వేల మంది మత్స్యకారులు తెలంగాణ రాష్ట్రంలో నేరుగా లబ్ధి పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మత్స్యరంగంలో ఉన్నత విద్యావకాశాలను మెరుగుపరిచేందుకు రెండు ఫిషరీస్ కళాశాలలను ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకున్నది. అందులో ఒక టి వనపర్తి జిల్లా పెబ్బేరులో ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల నుంచి ఇప్పటికే నాలుగు బ్యాచ్‌లకు సంబంధించిన విద్యార్థులు తమ డిగ్రీల ను పూర్తి చేసుకుని దేశంలోని పలు ప్రాంతాలలో ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య సహకార సంఘాలలో కొత్తవారిని సభ్యులుగా చేర్చుకునే ఏకైక లక్ష్యంతో రెండు దశల్లో దాదాపు ఏడాది కాలం పాటు ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే దక్కింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో పూర్వపు 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన దరిమిలా రాష్ట్రంలోని మత్స్యసహకార సంఘాలను కూడా విస్తరించేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మత్స్య, ఆక్వారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ మత్స్యరంగాన్ని తీర్చిదిద్ది, ఇక్కడి మత్స్యకారుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్‌లో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఒక సమీకృత మత్స్య శిక్షణా కేంద్రాన్ని, దానికి అనుబంధంగా అధునాతనమైన ఒక వసతి గృహాన్ని కూడా నిర్మించింది. ఇక్కడే ఒక అధునాతన ఫిషరీస్ లాబోరేటరీని కూడా స్థాపించాలని సంకల్పించింది. రాష్ట్రంలో చేపల ఆహార వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఫిష్టారెంట్లను ఏర్పాటుచేసి సంస్థాపరంగానే నిర్వహించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా గత సంవత్సరం మృగశిర కార్తె రోజున ప్రారంభించుకొని మూడురోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. పైన పేర్కొన్న ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏటా బహుకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చేపల ఉత్పత్తి రాష్ట్రం అవార్డుకు 2021కి గాను తెలంగాణ రాష్ర్టాన్ని ఎంపిక చేసింది. మంచి నీటి చేపల పెంపకానికి సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకతలను సాధించడంతోపాటుగా మొత్తం పది అంశాలలో ఉన్నతమైన ప్రమాణాలను సాధించినందుకుగాను అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అప్పటి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాలా చేతుల మీదుగా 2021, నవంబర్ 21న భువనేశ్వర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ అధికారులు అందుకున్నారు.
అయితే, ఈ ఘన కార్యాలన్నీ తెలంగాణ రాష్ర్టానికి గత చరిత్రగా మిగిలిపోవడం విచారకరం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మత్స్యరంగాన్ని బుద్ధిపూర్వకంగా విస్మరించి, నిర్లక్ష్య ధోరణులను ప్రదర్శించినట్టుగానే వర్తమాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. సుమారు పదేండ్ల పాటు తెలంగాణ రాష్ర్టాన్ని కంటికిరెప్పలా కాపాడిన కేసీఆర్ తెలంగాణ మత్స్యరంగాన్ని ఉన్నతస్థాయికి తీర్చిదిద్దేందుకు వేసిన పునాదులను కూకటివేళ్లతో పెకిలించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. అంతేకాదు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి తూట్లుపొడిచింది. జలాశయాల్లో రొయ్య పిల్లల పంపిణీని పూర్తిగా రద్దుపరిచింది. జిల్లా మత్స్యసహకార సంఘాలకు పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రస్థాయి ఫిషరీస్ ఫెడరేషన్‌కు పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేసేందుకు అవరమైన ఎన్నికల ప్రక్రియనును నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖను కూడా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు కనీసం ఈ శాఖపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ముఖ్యమంత్రి తన మానస పుత్రికగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అక్వాకల్చర్ రంగానికి సంబంధించి కనీసం ఒక్క కోర్సును కూడా ప్రవేశపెట్టలేదు. కేంద్రప్రభుత్వ నిధులతో అమలు జరుపుతున్న ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాన్ని రాష్ట్రంలోని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఫిషరీస్ ఫెడరేషన్‌కు సంబంధించిన గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను అమలుపరుచకుండా తాత్సారం చేస్తున్నది. ఇలాంటి పలు అంశాలు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మత్స్యరంగం పట్ల అనుసరిస్తున్న కక్షపూరిత నిర్లక్ష్య విధానాలకు అద్దం పడుతున్నాయి.