పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైతుల పట్ల ప్రధాని మోదీ వైఖరిని తప్పుబడుతున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణలో నీళ్లు, కరెంటు, పెట్టుబడి లేక వ్యవసాయం కుంటుపడింది. వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారాయి. ఎక్కడచూసినా రైతుల ఆత్మహత్యలతో కర్షక లోకం కన్నీరు కార్చేది. కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్ల మోతలతో గ్రామాలన్నీ విషాదంలో మునిగి ఉండేవి. సమయానికి నాణ్యమైన విత్తనాలందక రైతు విలవిలలాడేవాడు. పంటలకు ఎరువులు దొరకక తంటాలుపడేవాడు. విత్తనాల కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన రైతులెందరో. ఎరువుల కోసం లైన్లో నిలుచునే ఓపిక లేక చెప్పులు పెట్టి నిరీక్షించిన సందర్భాలెన్నో. పోలీసు స్టేషన్లలో అమ్మకాలు పెట్టి రైతులను లాఠీలతో కొట్టిన చరిత్ర ఉమ్మడి, పరాయి పాలకులది.
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆత్మహత్యలు లేని తెలంగాణను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్ధులై కృషిచేస్తున్నారు. స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ తెలంగాణ రైతుల కష్టాలను అర్థం చేసుకున్నారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు తెచ్చారు. ‘మిషన్ కాకతీయ’ పథకంతో చెరువులకు జలకళ తెచ్చి, కాళేశ్వరం బహుళార్థసాధక ప్రాజెక్టును నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేసి పూర్తిచేశారు. వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలను భర్తీ చేశారు. భూసార పరీక్షలు చేయించి రైతులకు పంటల మీద అవగాహన కల్పించారు. ‘రైతుబంధు’ పేర పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు బీమా ప్రవేశ పెట్టారు. కరోనా కాలంలో కూడా వ్యవసాయరంగాన్ని సంరక్షించారు. ధరణి పోర్టల్ ద్వారా భూ వివాదాలకు స్థానం లేకుండా చేశారు.
కాళేశ్వరం నీళ్లు , 24 గంటల నాణ్యమైన కరెంటు, రైతు బంధు రూపంలో పెట్టుబడి సాయం అందడంతో తెలంగాణలో వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. గతంలో బీళ్లుగా ఉన్న వ్యవసాయ భూములన్నీ – నేడు పచ్చని పైర్లతో దర్శనమిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం పండుతున్నది. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఎదిగింది. ఎటుచూసినా ధాన్యం రాసులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రం సిద్ధించాక రైతుల ఆత్మహత్యలు నిలిచిపోయాయి. గతంలో ఎకరానికి లక్ష రూపాయలు ధర పలుకగా, నేడు కనీసం రూ.20 లక్షలు పలుకుతున్నది. ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతం సుసంపన్నమైంది. ధనిక రైతులు దేశంలో ఎక్కడ ఉంటారంటే.. తెలంగాణ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ ఘనత అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.
తెలంగాణ సాధించిన విజయాలను నిండు మనసుతో హర్షించవలసిన కేంద్రం రైతులను వేధింపచూస్తున్నది. రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్న సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై కన్ను కుట్టింది. రాజ్యాంగం ప్రకారం రైతు పండించిన ధాన్యా న్ని కొనాల్సిన కేంద్రం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్న సాకుతో వేసంగిలో వరి వేయొద్దంటూ హుకుం జారీ చేయటం గర్హనీయం. రానున్న రోజుల్లో వరిధాన్యాన్ని కొనబోమని స్వయాన కేంద్ర మంత్రులే ప్రకటించటం బాధ్యతారాహిత్యమే. కేంద్ర ప్రభుత్వం తప్పంతా తాము చేసి, రైతులముందు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నది. రాష్ర్టాలకు అన్నివిధాలా అండగా నిలిచి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, సంకుచిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నది. ధాన్యం కొనుగోలులో తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది.
రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేం ద్రానిదే. ఇది రైతులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రైతులను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోంచే దేశవ్యాప్తంగా రైతులు మేల్కొని కొత్తగా తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో కేంద్రం తోకముడిచింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని రైతు లు కూడా అధైర్యపడొద్దు. తెలంగాణ రైతాంగమంతా సం ఘటితమై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. రైతులకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. మన ప్రయోజనాలను మనమే కాపాడుకోవాలి. జాతీయపార్టీలను నమ్ముకుంటే మోసపోతామని గ్రహించాలి. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని గుర్తించి ఆయనకు అండగా నిలువాలి. బంగారు తెలంగాణ సాకారం కోసం రాష్ట్రంపై సాగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఆసన్నమైంది.
అనంతుల రమేష్
99084 21285