Telangana | పోయిన డిసెంబర్లో తెలంగాణకు కాంగ్రెస్ రూపంలో గ్రహణం పట్టింది. అయితే, దానికంటే ఒకటి రెండేండ్లకు ముందే తెలంగాణ మేధావులు అనబడేవారు కేసీఆర్ పాలన మీద ఉన్నవీ, లేనివీ ప్రచారం చేయడం మొదలైంది.
‘వారికి అధికారం ఇచ్చి, మన మీద అంధకారపు నీడలు పరిచే అవకాశం ఇవ్వడానికి బాధ్యు లం మనమే కదా. మన చేతల ద్వారా, చేతల లేమి ద్వారా కూడా!’.. రాష్ట్ర పరిస్థితి గురించి చర్చ సందర్భంగా ఓ ఢిల్లీ జర్నలిస్టు అన్న మాటలివీ. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, పదవులు ఇవ్వలేదనో, ఇంకా ఏవేవో కారణాలతో ఆయన మీద కోపం పెంచుకొని పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణపై కాయతొలిచే పురుగుల్లా ఆ మధ్య మేధావి వర్గం విరుచుకుపడ్డది. కాబట్టే, ఈ రోజు వారు రేవంత్ ప్రభుత్వపు అరాచకాలను మౌనంగా భరిస్తున్నరు, పదవుల ఆశకో, బెదిరింపుల భయానికో! నిజానికి వీరిలో ఎందరికో రేవంత్ వ్యక్తిత్వం వశపడుతలేదు. అట్లా అని నోరు తెరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే, అవతల ఉన్నది బోళాశంకర చంద్రశేఖర్‌రావు కాదు, తేడా వస్తే అంతుచూసే రేవంత్‌రెడ్డి.
ఎవరైనా ఊహించారా ఇంత పతనం? కోదండరాం అనుకున్నారా… హైదరాబాద్‌కు కర్ఫ్యూ రోజులు రాబోతాయని? హరగోపాల్ సంతోషించే విషయమా… హక్కులు అడుగుతున్న పోలీసులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తారని? ఆకునూరి మురళి శాంతిస్తారా… ట్యాంక్‌బండ్‌పైన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగోడ కట్టడాన్ని చూసి? పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్టత చెందింది. పదేండ్ల కేసీఆర్ పాలన ప్రతిరోజూ గుర్తుకువస్తున్నది జనానికి. ఇది బీఆర్ఎస్కు కరెక్షన్ కాలం అయితే, కాంగ్రెస్‌కు పోయే కాలం! ఎంత గొప్ప నాయకులైనా, ప్రభుత్వాలైనా ప్రజాగ్రహానికి గురవుతాయి. అయితే అందుకు ఐదేండ్లో, పదేండ్లో పడుతుంది. కానీ, నవమాసాలు కూడా నిండకుండానే కాంగ్రెస్ భ్రష్ఠుపట్టడానికి ఏకైక కారణం రేవంత్‌రెడ్డి. రెండో ఏకైక కారణం రాహుల్‌గాంధీ!
‘తెలంగాణ లోగో మార్చడం పిచ్చి ఆలోచన’ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే అన్నాడే? మరి రేవంత్‌కు అర్థం కాదా? ఆయనను సహిస్తున్న రాహుల్ గ్రహించలేడా? తన అసమర్థ పాలన, అమానవీయ స్పందన వల్ల ఎంత ప్రజాగ్రహం మూటగట్టుకున్నడో రేవంత్ ఇంటి దగ్గర పెంచిన సెక్యూరిటీయే తార్కాణం! సీఎం గురించి వాట్సాప్ వీడియోలలో బాధిత మహిళలు మాట్లాడుతున్న భాష ఇక్కడ రాయలేం కానీ, వారిది ధర్మాగ్రహం. కాసులు, కేసులకు అలవాటు పడి రాష్ట్రంలో జనాల గోడు పట్టించుకునే మూడ్‌లో లేడు రాహుల్‌గాంధీ! మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కోసం మూసీ జనాన్ని ముంచో, అదానీని ప్రాధేయపడో డబ్బులు తెమ్మన్న రాహుల్ ఏ మొహం పెట్టుకొని నిలదీయగలడు? ఒకవైపు కాంగ్రెస్ అధిష్ఠానానికి కప్పం కడుతూ, మరోవైపు బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నడు రేవంత్.
రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రుల ప్రవర్తన ఇదే చెప్తున్నది. హైడ్రా అంశంలో, కొండా సురేఖ విషయంలో ప్రభుత్వంపై కోర్టులు సహా జన బాహుళ్యం దుమ్మెత్తి పోసినా రేవంత్ పట్టించుకోవడం లేదు సరికదా, ఎవరు అడ్డొచ్చినా తాను మారనంటూ పబ్లిక్‌గానే చెప్తున్నడు. విదేశాల్లోనూ, దేశంలోనూ ఫేక్ కంపెనీలు, మోసపు చరిత్ర ఉన్న కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వజూపుతున్నా; రాష్ట్ర బీజేపీ నాయకులు అడపాదడపా విమర్శలకు పరిమితం అవుతున్నరు తప్ప, ఒక్కదానిపై విచారణ కోరడం లేదు, హెచ్చరికా లేదు. మోదీ అనుగ్రహం రేవంత్‌కు పుష్కలంగా ఉన్నదని ఢిల్లీ వర్గాలు బల్లగుద్ది చెప్తున్నయి.
‘కాంగ్రెస్ అంటే నాకెందుకో ఓ మూల కొంత గౌరవం ఉండేది. ఎంత కాదనుకున్నా, చాలా అసంతృప్తి ఉన్నా, కొంత లౌకికవాదం, కొంత సోషలిజం దాంట్లో ఇంకా మిగిలి ఉన్నాయని. కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, పార్టీ, నేతలు, ప్రభుత్వాన్ని చూస్తుంటే… అయ్యో ఇది కాదే నా ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్వహణ పరంగా బీఆర్ఎస్ చేసిన ప్రత్యేకమైన, తీవ్రమైన తప్పిదాలు కనబడలేదు. కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, రైతుబంధు… ఇలా దాదాపు అన్ని వర్గాలను సంతోషపరిచినట్టే కనబడింది. పేదల పార్టీ అనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తన ఇమేజ్‌కు తగ్గ ఒక్క పనీ చేయలేదు. సరికదా పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది.
ముఖ్యంగా హైడ్రా పేరుతో అది పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న తీరు, సినీ నటి వ్యవహారంలో ప్రవర్తించిన తీరు చూస్తుంటే అసలు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సేనా అనే అనుమానం వస్తున్నది.’ అన్నరు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ డైరెక్టర్ డాక్టర్ అవధానం రఘు కుమార్ అనే న్యాయవాది. అసలు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీడీపీ బీ టీం, లేదా బీజేపీ బీ టీం అని ఆయనను ఊరడిస్తున్నరు మిత్రులు! అంతిమంగా చెప్పేదేమంటే రేవంత్‌రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని తప్పులు, మరింత విధ్వంసం, ఇంకింత అరాచకం చేస్తడు. కేటీఆర్, హరీశ్‌లే కాదు; ఎవరు తనను నిలదీసినా తట్టుకోలేడు. ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతడు. అది సత్యం!
‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు వంద సీట్లకు తగ్గవు. అంతలా మిస్ అవుతున్నరు కేసీఆర్ పాలనను’ అన్నరు ఒక పత్రికా సంపాదకుడు. శుభమస్తు!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల 90309 97371