కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పదే నిరూపించింది. ప్రజల జీవన అనుభవాల నుంచి పుట్టిన ఆలోచన, ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న కార్యాచరణ, కార్యాచరణలో కనిపించిన బాధ్యత.. ఈ మూడింటి సంగమమే ప్రజాస్పర్శ కలిగిన నాయకత్వానికి మూలాధారం. అటువంటి నాయకత్వం వ్యక్తిగత విజయానికి కాదు, సమూహ ఆత్మగౌరవానికి ప్రతినిధిగా నిలుస్తుంది. ఈ కోణంలో చూస్తే, కేసీఆర్ నాయకత్వం కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాకుండా, అస్తిత్వానికి దిశ చూపిన ఒక ఆలోచనా ప్రవాహంగా కనిపిస్తుంది.
కాలానికి అనుగుణంగా ప్రత్యేక విధానాన్ని కనుగొనడమే కాకుండా, దిశ చూపగలిగిన నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన రాజకీయ దృష్టి కలిగిన వ్యక్తిగా కేసీఆర్ పేరు ప్రజాస్మృతిలో నిలిచిపోయింది. ఆయన రాజకీయ ప్రయాణం అధికార ఆశలతో ప్రారంభమైనది కాదు. ప్రజల జీవితాల్లో గౌరవం, స్వాభిమానాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో నడిచిన దీర్ఘ యాత్ర. ప్రజా సమస్యలను కేవలం గణాంకాలుగా కాకుండా, జీవిత అనుభవాలుగా అర్థం చేసుకునే తత్వం కేసీఆర్‌ది. గ్రామం నుంచి రాజధాని వరకు, రైతు నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఆయన ఆలోచనల్లో ఒక భాగంగా కనిపిస్తుంది. మాటల్లో కన్నా కార్యాచరణను విశ్వసించే వ్యక్తిగా ఆయన ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించారు.
సాధారణంగా కొందరి రాజకీయ నాయకత్వం నిర్ణయాలకే పరిమితం అవుతుంటే, కేసీఆర్ నాయకత్వం ఒక ఆలోచనాధారగా ఎదిగింది. సమస్యను చూసే కోణం, పరిష్కారాన్ని అమలు చేసే పద్ధతి, దానికి ఇచ్చే ప్రాధాన్యం ఇవన్నీ ఆయనను ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రజల మధ్య నుంచి వచ్చిన అనుభవం, ప్రజల కోసమే పని చేయాలనే తపన ఆయన ప్రతి చర్యలో కనిపిస్తుంది. కేసీఆర్ మాటల్లో స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత ప్రజలకు భరోసాగా మారుతుంది. నాయకుడి మాట ప్రజల్లో భరోసాను నింపినప్పుడే పాలనకు అర్థం వస్తుంది అనే భావనను ఆయన ఆచరణలో చూపించారు. అందుకే కేసీఆర్ పేరు కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా, ప్రజల దైనందిన సంభాషణల్లోనూ చోటు దక్కించుకున్నది.
సామాజిక సమతుల్యత, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అవగాహన కేవలం సిద్ధాంత స్థాయిలో ఆగిపోలేదు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధానాలుగా, కార్యక్రమాలుగా రూపుదిద్దుకున్నది. పాలన అనేది అధికార ప్రదర్శన కాదు, బాధ్యత అనే భావన ఆయన నాయకత్వానికి మూలాధారం. కాలం మారుతున్నకొద్దీ ప్రజల ఆశలు కూడా మారుతుంటాయి. ఆ మార్పును ముందుగానే గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా తన ఆలోచనలను మలుచుకునే సామర్థ్యం కేసీఆర్‌కు ఉన్న గొప్ప లక్షణం. అందుకే ఆయన నాయకత్వం స్థిరంగా కాకుండా, చలనశీలంగా ఉంటుంది.
రాజకీయ జీవితం ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా, నేలపై నిలబడే గుణం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. ప్రజల సమస్యలను విన్నప్పుడు, వాటిని వ్యక్తిగతంగా స్వీకరించే తత్వం ఆయనను ఒక పాలకుడిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. మొత్తంగా చూస్తే, కేసీఆర్ నాయకత్వం ఒక వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయం కాదు. అది ఒక ఆలోచనా ప్రవాహం. ప్రజల స్వాభిమానాన్ని, ఆశలను, భవిష్యత్తుపై నమ్మకాన్ని ఒకే దారిలో నడిపించాలనే సంకల్పమే ఆయన రాజకీయ జీవిత కేంద్రబిందువు. అందుకే కేసీఆర్ పేరు కేవలం ఒక నాయకుడిగా కాకుండా, ప్రజాస్పర్శ కలిగిన నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది.
అస్తిత్వం కోసం జరిగే పోరాటాల్లో మొదటి దశ గుర్తింపు. తమది కూడా ఒక ప్రత్యేక జీవన అనుభవమని, తమదైన గొంతు ఉన్నదని ప్రజలు తెలుసుకోవడం. కేసీఆర్ ఈ గుర్తింపుని ప్రజల మనసుల్లో నాటారు. ప్రజలు తమను తాము చూసుకునే దృష్టికోణాన్ని మార్చే కృషి ఆయన నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అనేక చోట్ల అస్తిత్వ ఉద్యమాలు భావోద్వేగాలకు పరిమితమై ఆగిపోయిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ఆలోచన భావోద్వేగాన్ని కార్యాచరణతో మేళవించింది.
అస్తిత్వం అనేది నినాదంగా మాత్రమే కాకుండా, జీవన విధానంగా మారాలన్న దృక్పథం ఆయన నాయకత్వానికి బలంగా నిలిచింది. ప్రజల దైనందిన జీవితంలో మార్పు కనిపించినప్పుడే అస్తిత్వానికి అర్థం వస్తుందని ఆయన విశ్వసించారు. అందుకే ఆయన మాటల్లో స్వాభిమాన భావన కనిపించినా, ఆచరణలో బాధ్యత భావన ప్రధానంగా కనిపిస్తుంది. అస్తిత్వం అంటే ఎదుటివారిని తక్కువ చేయడం కాదు.. తనను తాను గౌరవంగా నిలబెట్టుకోవడం అనే భావన ఆయన ఆలోచనల్లో ఉంటుంది.
ప్రపంచ దేశాలలో అస్తిత్వ పోరాటాలు సాధారణంగా ఒక తరం వరకు పరిమితమైపోతాయి. కానీ దీర్ఘకాల ప్రభావం చూపిన ఉద్యమాలు మాత్రం తదుపరి తరాలకూ ఆలోచనా దిశను చూపగలుగుతాయి. కేసీఆర్ నాయకత్వం దీర్ఘకాల ప్రభావం చూపేదిగా నిలుస్తుంది.
ఆయన రాజకీయ ప్రయాణం ఒక కాలానికి పరిమితమైనది కాకుండా, ఒక ఆలోచనా వారసత్వంగా రూపుదిద్దుకునే లక్షణాలు కలిగి ఉన్నది. అస్తిత్వం కోసం పోరాడే నాయకత్వానికి అవసరమైన మరో ముఖ్య లక్షణం ప్రజలతో ఉన్న భావోద్వేగ అనుబంధం. ప్రజలతో కేసీఆర్ మాట్లాడినప్పుడు కనిపించే సరళత, వినే సమయంలో చూపించే సహనం, నిర్ణయాల్లో ప్రతిబింబించే స్పష్టత ఇవన్నీ ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన అస్తిత్వ నాయకత్వాలకు కనిపించే లక్షణమే.
కేసీఆర్ రాజకీయ ప్రయాణం ఒక వ్యక్తిగత విజయం కథ కాదు. అది ఒక సమూహ అస్తిత్వానికి ప్రతినిధిగా నిలిచిన నాయకత్వ గాథ. ప్రపంచ దేశాల్లో అస్తిత్వం కోసం సాగిన పోరాటాల సరసన నిలబడి, తన నేలపై తన ప్రజల స్వరాన్ని స్పష్టంగా వినిపించిన నాయకుడిగా ఆయన పేరు గుర్తుండిపోతుంది. అందుకే కేసీఆర్‌ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా చూడటం సరిపోదు. అస్తిత్వానికి స్వరం ఇచ్చిన ప్రతినిధి ఆయన. ప్రజల ఆత్మగౌరవాన్ని ఆలోచనగా, ఆ ఆలోచనను కార్యాచరణగా మార్చిన నాయకత్వానికి ఆయన ఒక స్పష్టమైన ఉదాహరణ.
చరిత్రలో కొన్ని నాయకత్వాలు కాలంతో కలిసి మసకబారిపోతాయి, కొన్ని మాత్రం కాలాన్నే ప్రశ్నించే ఆలోచనలుగా మిగులుతాయి. కేసీఆర్ నాయకత్వం రెండో కోవకు చెందుతుంది. అది కేవలం ఒక రాజకీయ దశను సూచించేది కాదు, ప్రజలు తమను తాము కొత్తగా చూసుకునే దృష్టిని అందించిన ఆలోచనా మలుపు. అస్తిత్వాన్ని నినాదంగా కాకుండా, జీవన విలువగా మార్చాలన్న సంకల్పం ఆయన నాయకత్వానికి ప్రాణం. ప్రజల మౌన అనుభవాలకు అర్థం ఇచ్చి, ఆ అర్థాన్ని కార్యాచరణగా నిలబెట్టిన ఈ నాయకత్వం, భవిష్యత్తు తరాలకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది నాయకత్వం అంటే అధికారమా, లేక ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమా? ఆ ప్రశ్నకు సమాధానంగా నిలిచే పేరే కేసీఆర్.
ప్రపంచ దేశాల్లో అస్తిత్వ పోరాటాలు సాధారణంగా ఒక తరం వరకు పరిమితమైపోతాయి. కానీ దీర్ఘకాల ప్రభావం చూపిన ఉద్యమాలు మాత్రం తదుపరి తరాలకూ ఆలోచనా దిశను చూపగలుగుతాయి. కేసీఆర్ నాయకత్వం దీర్ఘకాలం ప్రభావం చూపేదిగా నిలుస్తుంది. ఆయన రాజకీయ ప్రయాణం ఒక కాలానికి పరిమితమైనది కాకుండా, ఒక ఆలోచనా వారసత్వంగా రూపుదిద్దుకునే లక్షణాలు కలిగి ఉన్నది.
-చిటికెన కిరణ్ కుమార్ ,94908 41284