తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం నుంచి పురుడుపోసుకున్న పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ ప్రజలను ఏకం చేసి, వారిలో విశ్వాసాన్ని నెలకొల్పి ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి, ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎన్నెన్నో దీక్షలు చేసి, సమైక్య లాబీయింగ్‌ను జయించి, దేశాన్ని ఒప్పించి స్వరాష్ర్టాన్ని సాధించిన గులాబీ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ శుభ సందర్భంలో బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు, నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ ఎన్నారైల తరఫున నా హృదయపూర్వక వందనాలు!
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గాడాంధకారమే. వలసల వలపోతలే. అప్పులపాలైన రైతన్నలు, అవి తీర్చలేక ఆత్మహత్యలే కనిపించేవి. చుక్క నీరు కో సం దిక్కులు చూసే పరిస్థితి నాటి తెలంగాణది. అలాంటి తరుణంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న వివక్షపై ధిక్కార స్వరమై గులాబీ జెండా పురుడుపోసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించా రు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి స్వరాష్ర్టాన్ని దేశంలోనే సగర్వంగా నిలబెట్టారు.
కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలం పాటు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా, దేశానికి రోల్‌మోడల్‌గా కేసీఆర్ నిలిపారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందినప్పటికీ తెలంగాణ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా గులాబీ పార్టీ అహర్నిశలు శ్రమించింది. నిత్యం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అలుపెరగకుండా కృషి చేసింది. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, సంక్షేమ ఫలాలు అందని కుటుంబం లేదనే రీతిలో కేసీఆర్ పాలించారు. నాడు అధికారంలో ఉన్నా, నేడు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అమెరికాతో అవినాభావ సంబంధం ఉంది.
కేటీఆర్ అమెరికాలోనే ఉన్నత చదువులు చదివారు. ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడతామని అనుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి ఉద్యమ రథసారథి కేసీఆర్‌కు అండగా ఉండాలని తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణకు వచ్చేశారు. రాష్ట్ర సాధనోద్యమంలో భాగస్వాములయ్యారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఎప్పటికప్పుడు తెలంగాణ గళాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఖండాంతరాలకు విస్తృతం చేసింది. ప్రపంచం నలుమూలల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణే మా తొలి ప్రాధాన్యం.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా పార్టీ పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాలను ఎన్నారైలు విజయవంతం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా పార్టీతో మాకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ గర్విస్తున్నాం. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణకు, పార్టీకి సేవలు చేస్తూనే ఉంటాం. ఎన్నారై విభాగం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ఉంటాం.
రాష్ట్ర సాధన ఉద్యమం, పదేండ్ల పునర్నిర్మాణం వెరసి బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ రజతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జూన్ 1న యూఎస్ఏలోని డల్లాస్‌లో చరిత్రలో నిలిచిపోయేలా వేడుకలు జరిపేందుకు బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం, అడ్వైజరీ చైర్మన్ మహేష్ తన్నీరు నాయకత్వంలో వేడుకలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, దిలీప్ కొణతం, శ్రీనివాస్ సురకంటి, శ్రీనివాస్ వీటిని పర్యవేక్షిస్తున్నారు.
విదేశాల్లో తెలంగాణ వాణిని వినిపించేందుకు, మన ఘనతలను ఖండాంతరాలకు చాటేందుకు డల్లాస్ వేదిక కానున్నది. తెలంగాణ అవతరణ దినోత్సవాలు, రజతోత్సవాల్లో భాగంగా మన సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గేయాలు, బతుకమ్మ, కోలాటం తదితర కార్యక్రమాలు ఈ వేడుకల్లో నిర్వహించనున్నారు. అమెరికాలోని వివిధ రాష్ర్టాల్లో ఉన్న తెలంగాణవాదులు, కేసీఆర్, బీఆర్ఎస్ అభిమానులు కుటుంబసభ్యులతో సహా విచ్చేసి తెలంగాణ పండుగను విజయవంతం చేయాలని మనవి.
-డెలావేర్, యూఎస్ఏ భాస్కర్ పిన్న