తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వంటి రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నది. వాస్తవానికి మన అభివృద్ధి గురించి ఏదో నివేదిక చెప్పవలసిన అవసరం లేదు. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అన్నట్టు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలే చెబుతారు. ఊరూరా మనం సాధించిన ప్రగతి స్పష్టంగా కనబడుతున్నది. చెరువులు నిండుగా నీటితో మిలమిలలాడుతున్నాయి. ఊరూరా ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలోనూ మానవ సంక్షేమంపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఫలితాలనిచ్చింది.
గౌతమ బుద్ధుడు బోధించినట్టు- ఎవరితోనూ మనకు పోటీ లేదు. నిన్నటి మనం నేడు ఎంత ఎదిగామనేదే మన అభివృద్ధికి సూచిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి సాగిస్తున్నది. తక్షణ అవసరాలు తీర్చడంతో పాటు దూరదృష్టితో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వివిధ పథకాలు చేపడుతున్నది. మన ప్రాధాన్యాల ప్రకారం మనం అభివృద్ధి చెందుతూ సాగుతున్నాం. ఎనిమిదేండ్ల కిందటే అవతరించిన చిన్న వయస్సు రాష్ట్రం ఎంత వేగంగా పయనిస్తున్నదనేది గమనించాలి. ఒకప్పుడు తెలంగాణ అంటే- కల్లోలిత ప్రాంతాలు, ఎన్కౌంటర్లు, ఆకలి మరణాలు, దిక్కులేని వలసలు, బీడు పడిన పొలాలు, మంచి నీటి కోసం పొద్దుపొద్దున్నే మైళ్ళకొద్దీ మహిళల నడక- ఎటు చూసినా దుర్భర పరిస్థితి. నాడు తెలంగాణ అంటేనే విషాదం. ఇప్పుడు కళ్ళ ముందే అభివృద్ధి కనిపిస్తున్నది. అనేక రంగాలలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకొంటున్నాం. మారుమూల గిరిజనులతో సహా ప్రజలందరికీ మంచినీటి కొరత తీర్చడాన్ని మించిన గొప్ప పాలన ఏముంటుంది!
పారిశ్రామికాభివృద్ధిలో భళా అనిపించుకుంటూ, ప్రజల సంక్షేమానికి పాటుపడటం కత్తి మీద సాము వంటిది. కానీ పారిశ్రామికాభివృద్ధికి విప్లవాత్మక విధానాలను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక అభివృద్ధిపైనా అదే రీతిలో దృష్టి సారించారు. వ్యవసాయాధార దేశంలో నీటిపారుదల వ్యవస్థకున్న ప్రాధాన్యం తెలిసిందే. వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడంతో పాటు గ్రామీణ వృత్తులకు కూడా చేయూత ఇవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. మూల ధన వ్యయంపై దృష్టి సారించినందున ఆ ఫలాలు అందుతున్నాయి. తెలంగాణ పరిస్థితులకు అనుగుణమైన సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని కేసీఆర్ రూపొందించి అమలు చేసిన ఫలితాలు సామాజిక- ఆర్థిక రంగాలలో కనబడుతున్నాయి. అందుకే తెలంగాణను దేశానికి రోల్మాడల్గా చెప్పుకోగలుగుతున్నాం.