రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించింది. ఈ మేరకు ప్రజల నుంచి 75 ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వీఏవోలు ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతున్నది. గతంలో రేవంత్ సర్కార్ నిర్వహించిన పలు సర్వేల డేటా ఎంట్రీ సమయంలో అనేక తప్పిదాలు చోటుచేసుకోవడమే అందుకు కారణం.
ఆరు గ్యారెంటీల అమలు కోసం గతంలో ‘ప్రజాపాలన’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించింది. ఆ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రభుత్వ ఆపరేటర్లతో పాటు ప్రైవేటు ఆపరేటర్లను కూడా నియమించుకున్నది. పలుచోట్ల కార్యాలయాల్లో జాగ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనూ ఆన్లైన్లో నమోదు చేయించారు.
ప్రాంతాలను బట్టి ఒక్కో దరఖాస్తుకు రూ.10-15 వరకు ప్రభుత్వం వారికి చెల్లించింది. ఆపరేటర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఆధార్, రేషన్‌కార్డుల నంబర్లు, గ్యాస్, కరెంట్ మీటర్ల వివరాల నమోదులో అనేక తప్పులు దొర్లాయి. దీంతో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయి. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ ప్రయోజనాలు లక్షలాది కుటుంబాలకు దక్కలేదు. ఆ తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. అయితే, విచిత్రమేమంటే.. చాలా దరఖాస్తు లు మాయమయ్యాయి.
మాయమైన దరఖాస్తులు రో డ్లు, చెత్తకుప్పల్లో కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్య క్తం చేశారు. గోప్యంగా ఉంచాల్సిన తమ కుటుంబ వివరాలను రోడ్డుపాలు చేశారని ప్రభుత్వంపై మండిపడ్డా రు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న సమగ్ర సర్వే లో సేకరిస్తున్న వివరాలను కూడా అలాగే రోడ్డుపాలు చేస్తారా? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నది.
ఇటీవల ప్రభుత్వం కోతలు, కొర్రీలతో రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. 40 లక్షల మందికి పైగా రైతులకు రుణాలుండగా.. సుమారు 22 లక్షల మంది రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. ఇందుకు ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు, పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, రుణాల వివరాలు తప్పుగా నమోదవడమే కారణం. అయితే, బ్యాంకర్లు సరైన వివరాలు పంపలేదని ప్రభుత్వం బుకాయిస్తున్నది. అంటే డేటా ఎంట్రీ తప్పుల కారణంగానే లక్షలాది మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారన్నది వాస్తవం.
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి జీవితకాల గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయాలని మూడేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా అకౌంట్ అకడమిక్ పర్మినెంట్ ఆటోమేటెడ్ రిజిస్ట్రీ (అపార్) పేరిట 12 అంకెలతో కూడిన కార్డు జారీ చేస్తారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల రికార్డుల్లో పేర్ల నమోదులో తేడాలు ఉండటంతో అపార్ కార్డుల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కూడా డేటా ఎంట్రీ తప్పిదాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేటా ఎంట్రీలో జరుగుతున్న తప్పిదాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అందుకే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మొదట కులగణన చేసేందుకే సర్వే చేపడుతున్నట్టు చెప్పిన ప్రభుత్వం తర్వాత వ్యక్తిగత విషయాలకు సంబంధించి 70 రకాల ప్రశ్నలను అడుగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వస్తున్న అధికారులు, ఎన్యూమరేటర్లకు సమాధానాలు చెప్పకుండా వారినే తిరిగి ప్రశ్నిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని, వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని అధికారులను నిలదీస్తున్నారు. పైగా ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులకే అతీగతీ లేదంటే, మళ్లీ సర్వే ఏమిటని మండిపడుతున్నారని ఎన్యూమరేటర్లు వాపోవడం గమనార్హం. ఒక సర్వే విషయంలోనే కాదు, ప్రభుత్వం అవలంబించే విధానాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
నిన్నటికి నిన్న సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కలెక్టర్, మండలాధికారులు, వారి వాహనాలపైనా దాడులు జరిగాయి. కాబట్టి, ప్రభుత్వం ఇకనైనా ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలి. అంతేకానీ, నిరంకుశ, నియంతృత్వ పోకడలతో ముందుకువెళ్తామంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– ఫిరోజ్ ఖాన్
96404 66464