రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నేతలు చేస్తున్న ప్రకటనలు, అనుసరిస్తున్న వ్యవహారశైలి పూటకూళ్ల రాజకీయాన్ని తలపిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంగా బీజేపీ చేస్తున్న రాజకీయం కేవలం స్వార్థపూరితమే. రాష్ట్ర ప్రజల బాగుకోసం ఏ మాత్రం కాదు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ ప్రజలకు తప్పుగా చూపించే ప్రయత్నంలో ఎంతటి అబద్ధాలకైనా తెగిస్తున్నది.
రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రి మొదలుకొని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుని దాకా ఇదేవరస. ఇక ‘పసుపు బోర్డు బాండ్ పేపర్’ ఎంపీ వాచాలత్వం, అహంకారపూరిత ప్రసంగాల గురించైతే చెప్పనక్కర్లేదు. ఆసాంతం అబద్ధాల ప్రచార పునాదులపై ఉప ఎన్నికల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే విషయమైతే అబద్ధాలను కళగా అభివృద్ధి చేశారు. వీరందరికి పోటీ అని ప్రచారం జరుగుతున్న మరో కొత్త ఎమ్మెల్యే నేనెక్కడ వెనుకబడతానో అనుకొని కేసీఆర్‌ను దూషించడం, అసత్యాల ప్రచారమే దినసరి పనిగా చేస్తున్న పద్ధతిని చూస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు సాధారణమైపోయాయి. ఇంతమంది నాయకుల మధ్య అబద్ధాలు, తిట్ల పురాణం సరిపోదనుకున్నాడేమో, ఐకేపీ కేంద్రాల సందర్శన పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త నాటకమాడుతున్నాడు. తెలంగాణ రైతుల పట్ల బీజేపీ వివక్షా ధోరణిని ప్రశ్నించినందుకు ఏకంగా రైతులపై దాడి చేయిస్తున్నాడు. తద్వారా ప్రచార రేటింగ్‌ల పోటీలో అగ్రభాగాన నిలిచాడు. ఓట్లు, అధికారం కోసం అవసరమైతే మతాల మధ్యన వైషమ్యాలు కూడా రెచ్చగొడతామని బాహాటంగా ప్రకటనలిచ్చే వారినుంచి ఇంతకంటే ఏం ఆశించగలం. విషయ పరిజ్ఞానం, కనీస అవగాహన లేని గాలివాటం నాయకులు జాతీయపార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగడం విచిత్రం, దురదృష్టకరం.
పూటకూళ్ల రాజకీయంలో ఆరితేరిన నాయకులకు మాట్లాడుతున్న అంశాలపై నిజనిజాలు తెలుసుకునే ఓపిక లేదు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా సదరు నాయకులకు అర్థం కాదు. అందుకే ఒక బాధ్యత కలిగిన స్థాయి నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఆ అంశాలు రాష్ట్రస్థాయిలో ప్రజల ముందుకెళ్తున్నపుడు, వారు వ్యక్తపరిచిన భావాలు, ఎంచుకున్న ప్రాతిపదిక ప్రజలకు, రాష్ర్టానికి ఉపయోగమా, హానికరమా అనే ఇంగితజ్ఞానం కూడా లేకపోవడం విచారకరం, గర్హనీయం. ఒక పార్టీ అధ్యక్షుల స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు అవి అనివార్యంగా ప్రజలను కొంతమేరకు ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏ రకమైన రాజకీయమో ప్రజలు అర్థం చేసుకోవాలి.
బీజేపీ నాయకుల వ్యవహారశైలి జుగుప్సాకరం. వరిపంట కొనుగోలు విషయంలో.. మొదట, ఈ వానకాలం పంట విస్తీర్ణం 62 లక్షలు ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దానికి వెంటనే స్పందించిన బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు పంట విస్తీర్ణంపై సీఎం ప్రకటన అబద్ధం, అంత ఎక్కడుందో చూపాలని బీరాలు పలికారు. ఆ తర్వాత కేంద్రమే ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రాష్ట్రం ప్రకటించిన లెక్కలు దాదాపు నిజమని నిర్ధారించింది. కానీ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనటంలో విఫలమవుతున్నదనే కొత్తరాగం అందుకున్నారు.
వచ్చే యాసంగి దొడ్డు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో, ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం యత్నిస్తున్నది. దీనిపై కూడా పూటకూళ్ల రాజకీయం మొదలు.. ఆ వెంబడే బీజేపీ రాష్ట్రనేత ఎండకాలంలో కూడా వరి పండించాలనీ, రాష్ట్రం ఎట్లా కొనదో చూస్తామని రైతులను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. మరి కేంద్రం వచ్చే ఎండకాలంలో వరి వద్దంటున్నది కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారి పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి భిన్నంగా, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు భంగకరంగా ఎలా ప్రవర్తిస్తారనడిగినా సమాధానాలుండవు. పైపెచ్చు రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారంటారు! ఎలా అంటే వివరణ ఉండదు. బట్టకాల్చి మీదేస్తాం, మీ సంగతి మీరే చూస్కోండంటారు. వాస్తవాలు కాదు, మా పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే విధంగా ప్రవర్తిస్తారు.
విచిత్రమేమంటే రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రి సింపుల్‌గా బీజేపీ ‘రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడాడో’ నాకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వారి అస్పష్టతను, నిర్లక్ష్యాన్ని, వారి పార్టీలోని సమన్వయలోపాన్ని ఇది తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి అన్నీ మాట్లాడే సదరు కేంద్రమంత్రి, వారి పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, తప్పుడు ప్రచారాలకు, రైతులపై దాడులకు పూనుకుంటుంటే కనీస స్పందన లేకుండా సరిదిద్దాలనుకోకపోవటం విడ్డూరం. అదే సమయంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేయకపోవడం, వారిని ఎన్నుకున్న తెలంగాణ ప్రజల దురదృష్టం.
మరో అంశమేమంటే, సీజన్లో ధాన్యం సేకరణకు ఒక నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయించి, తదనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రోజువారీగా వచ్చిన పంటను వీలైనంత త్వరగా కొని మిల్లులకు తరలిస్తారు. కొంతమంది మొత్తం ఒకేసారి ఒక్కరోజులోనే కొనుగోలు పూర్తిచేయాలన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇంకా మొత్తం కొనుగోలు పూర్తి చేయలేదంటూ దబాయిస్తారు. ఇదంతా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం తప్ప మరేం కాదు. ఇది ఆ నాయకుల కుటిలత్వాన్ని, చౌకబారు ప్రవర్తనను తెలియచేస్తున్నది. గత సీజన్లో ఇదే సమయానికి కొన్న ధాన్యం కంటే ఈ సీజన్లో ఎక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేసినా అర్థం కానట్లు ప్రవర్తించటం మూర్ఖత్వమే!
సదరు నాయకుని అవగాహనా లేమి, తెలివి తక్కువతనం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరద నష్టానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలుండనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్ వ్యాఖ్యాత ప్రశ్నలకు తడబడుతూ ఇచ్చిన సమాధానాలతో అభాసుపాలైన సంగతీ తెలిసిందే. గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు విషయంలో సరైన సమాధానాలివ్వలేక అబద్ధాలతో నవ్వులపాలైన సంగతీ చూశాం.అబద్ధానికి ఆడంబరం ఎక్కువ. కానీ నిజానికి, చిత్తశుద్ధికి శక్తి ఎక్కువ. కేసీఆర్ రూపంలో.. ఆ శక్తి తెలంగాణ వ్యతిరేకుల పీచమణచడం ఖాయం. అధికారం కోసమే బీజేపీ, ఇతరపక్షాలు చేస్తున్న విషప్రచారాలకు సమాధి కట్టడం ఖాయం.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
రావుల శ్రీధర్‌రెడ్డి
99855 75757