తొమ్మిదేండ్లు…రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు. 22 లక్షల మందికి ఉపాధి. ఇది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ట్రాక్ రికార్డ్. కొత్తగా పురుడు పోసుకున్న ఓ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఆల్ టైమ్ రికార్డ్‌గా దూసుకెళ్తున్నది. ఇంత తక్కువ వ్యవధిలో అదెలా సాధ్యమవుతోందని దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది.
ఏదో మాయ మంత్రం చేసి…అబ్రకదబ్ర అంటే అద్భుతాలు జరిగిపోవు. దీని వెనుక చాలా పరిశ్రమ ఉంటది. పెద్ద పెద్ద కంపెనీలు ఉట్టిగానే పెట్టుబడులు పెట్టవు. ముందు వెనుక అన్ని సక్కగా ఉన్నాయనుకుంటేనే…వాళ్లకు అనుకూల వాతావరణం కల్పిస్తేనే వస్తాయి. ఇగో ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ర్టాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా చేసే పనిలో పడ్డారు.
అంతర్జాతీయ సంస్థలు ఎక్కడన్నా వ్యాపారం షురూ చేయాలంటే లా అండ్ ఆర్డర్, సుస్థిర ప్రభుత్వం, మానవ వనరుల లభ్యత, వాతావరణ సమతుల్యత ఇలా చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను చక్కబెట్టే పని పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేసి హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు అంతర్జాతీయ సంస్థలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో తెలియజెప్పే పనిచేసిన్రు. నిరంతరం ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఫస్ట్ గుర్తొచ్చే పేరే హైదరాబాద్ అన్నట్టుగా మార్చేశారు.
అసలు ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే వ్యాపారవేత్తలకు అసలు సిసలు జంజాటమే ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులు పొందటం. ఇదొక ప్రయాసనే. వ్యాపారం చేయటమంతా ఒక ఎత్తయితే…ఆ కంపెనీకి పర్మిషన్లు తీసుకోవటం ఇంకో ఎత్తు. ఈ తతంగం తట్టుకోలేని ఎన్నో సంస్థలు అసలు ఇలాంటి సమస్యలున్న ప్రాంతం దిక్కే చూడవు. అధికారులు లంచం కావాలంటూ పనికి మాలిన రూల్స్ పేరుతో వ్యాపారవేత్తలను వేధిస్తూనే ఉంటారు. ప్రభుత్వ అధికారుల నుంచి పర్మిషన్ పొందడం ఎంత కష్టమో. అగో వ్యాపారం చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకునే వాళ్లకు గింత గోస తెలంగాణ స్టేట్‌లా ఉండనే ఉండొద్దని కేటీఆర్ తలచిండు. అందులో నుంచి పుట్టిందే టీఎస్ ఐపాస్ విధానం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా పరిశ్రమలకు అనుమతిచ్చేదే ఈ టీఎస్ ఐపాస్. సింగిల్ విండో పేరుతోని ఒక్కటే దగ్గర అన్ని పర్మిషన్లు జస్ట్ 15 రోజుల నుంచి రెండు నెలల్లో ఇచ్చుడు షురూ చేసిన్రు. ఈ విధానం ఫుల్ సక్సెస్ అయ్యింది. స్మాల్ అండ్ మీడియం స్కేల్ పారిశ్రామికవేత్తలకు ఊహించనంతా వేగంగా పర్మిషన్లు రావటంతో తెలంగాణలో పొట్టు పొట్టు పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టిన్రు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 22 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఫాక్స్ కాన్ అనే తైవాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ సంస్థకు జస్ట్ రెండున్నర నెలల్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చిన సంఘటన మనం తాజాగా చూసినం. పరిశ్రమలు ఏర్పాటైన తర్వాత అవి సజావుగా నడవాలంటే కరెంట్ ఉండాలె. గతంలో ఉమ్మడి ఏపీలో పవర్ హాలీడేస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టేవో అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో ఇప్పుడు పరిశ్రమలకు కూడా 24 గంటల కరెంటు అందిస్తున్నారు. అందుకే పెట్టుబడుల వరద పారుతోంది.
కేసీఆర్ విజన్ ఒకవైపు అయితే. మనం కచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో పేరే కేటీఆర్. ఇప్పుడాయన తెలంగాణకు అంబాసిడర్.
కేసీఆర్ విజన్‌ను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ర్టానికి పెట్టుబడులను తెస్తున్నది మంత్రి కేటీఆరే. నిజానికి కేటీఆర్ కాకుండా మరెవారైనా సరే కచ్చితంగా రాష్ర్టానికి ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చేవి కాదంటే అతిశయోక్తి కాదు. ఆయనకున్న అపారమైన పరిజ్ఞానం, ఇంగ్లీష్ మీద పట్టు, అంతర్జాతీయ కంపెనీలలో గతంలో పని చేసిన అనుభవం ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికి మేలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా సరే వాటి గురించి అంతర్జాతీయ కంపెనీలకు వివరించటం ఒక సవాలే. కొన్ని కొన్ని సంస్థలైతే అసలు అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా గగనమే. ఆయా సంస్థలను ఒప్పించి మెప్పించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తమ వద్ద పెట్టుబడులు పెడితే వారికి ఏ విధంగా లాభమో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలి. అది వారికి నచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడులు అనేవి సాధ్యం. ఈ మొత్తం బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. ఆయన ఒక కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ప్రజెంటేషన్ ఇచ్చారంటే ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టి తీరాల్సిందే. గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటే అడోబ్ అనే అంతర్జాతీయ సంస్థ ఒకటి ఉన్నది. ఆ సంస్థను పెట్టుబడులు పెట్టాలని కోరేందుకు వెళ్లగా ఆ సంస్థ అధినేత జస్ట్ 15 నిమిషాలు మాత్రమే కేటీఆర్‌కు టైమిచ్చారు. కానీ కేటీఆర్ ప్రజెంటేషన్ చూసి దాదాపు గంటపాటు ఆ టైమ్‌ను పొడిగించారు. ఇలాంటి అనుభవాలెన్నో చాలా సంస్థల్లో. ఇదంతా మాటలు చెప్పినంత సులభంగా జరిగిపోదు. ఇందుకోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు.
నిజానికి ఉద్యోగ కల్పన అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే కావు. అందరికీ సర్కార్ నౌకరీ ఇచ్చుడు ఎవరి వల్లా కాదు. ఆ విషయం తెలిసే ప్రైవేట్‌లో ఎంత వీలైతే అన్ని అవకాశాలు కల్పించాలన్న దానిపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టిన్రు. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలను కలుస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లాంటి పెద్ద పెట్టుబడుల ఫ్లాట్ ఫామ్ సహా ఎక్కడ కంపెనీలుంటే అక్కడికి పోతుండు. ఏడాదికి మూడు నాలుగు సార్లు విదేశాలకు వెళ్లి…హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ నుంచి పెట్టుబడుల వరద పారుతోంది. మొన్నటికి మొన్న యూకే పర్యటనలో పలు సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇక అమెరికా పర్యటనలో అయితే రోజుకో పెద్ద కంపెనీ ఈడ పెట్టుబడులు పెడతామని చెప్పినయ్. కొన్ని సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తామన్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు సెకండ్ హెడ్డాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక వాటికి వార్నర్ బ్రదర్స్ లాంటి సంస్థ కూడా జత చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్, మల్టీ మీడియా, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ లాంటి దాదాపు 14 సెక్టార్లకు సంబంధించిన సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. విదేశీ సంస్థలు మాత్రమే కాదు…దేశీయ దిగ్గజ సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. గచ్చిబౌలికి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వివిధ సంస్థలు మరో 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో వస్తున్న కంపెనీల కారణంగా హైదరాబాద్ విస్తీర్ణం ఎంతో పెరిగింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన అనే యజ్ఞాన్ని చేస్తూ పోతున్నది.
-రచ్చ దినేశ్
89787 40475