శాసనసభలో సమస్యలపై చర్చ జరిగి పరిష్కారాలు కొంతవరకైనా లభిస్తాయేమోనని తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురుచూశారు. తీరా అసెంబ్లీ సమావేశాలు వచ్చేసరికి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మొదటి రోజు ప్రధాన ప్రతిపక్షం బారీకేడ్లు దాటకుండానే అరెస్టులు, దాడులకులోనై వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. రెండో రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో ప్రజలకు తెలియకుండా మరొక ప్రేరేపిత నిరసన కార్యక్రమంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. మూడవ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులందరినీ శీతాకాల సమావేశాల నుంచి బహిష్కరించింది. ఇక ప్రధాన సమస్యలు, ప్రజల గోస ఎజెండా మీదకు రాకుండానే సమావేశాలు సాగుతున్నాయి.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నయి. సమావేశాలు 7న మొదలయ్యాయి. శనివారం మండలి నిరవధికంగా, అసెంబ్లీ 16కు వాయిదా పడ్డాయి. ఈ ఐదు రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదనే విషయం స్పష్టమైంది. ఓ వైపు సభ్యులను సభకు రాకుండా అడ్డుకోవడం, సభ జరుగుతుంటే బయట గందరగోళం సృష్టించడం కాంగ్రెస్ నేతల తొండి వైఖరికి నిదర్శనంగా నిలిచింది. అలాగే పాలకపక్షం నేతలు వింత చేష్టలకు పాల్పడ్డారు. కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు పేరిట ఆందోళన నిర్వహించారు. ప్రజల దృష్టిని అసెంబ్లీ నుంచి మళ్లించేందుకు కుట్రలు పన్నారు. ఇందుకు అధికార పక్షమే బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి మీద చర్చ జరగాలని వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినా అధికార పక్షం నిర్లక్ష్యం వ్యవహరించింది.
తెలంగాణలో కేసీఆర్ కంటే మెరుగైన పాలన తెస్తామంటూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పారదర్శక పాలన పేరిట కాంగ్రెస్ హామీలు గుప్పించింది. కానీ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన మార్పు లేదు. కేసీఆర్ పాలనను చేజార్చుకున్నందుకు ప్రజలు బాధ పడుతు న్నరు. ప్రజాస్వామ్యవాదులకు నైరాశ్యమే మిగులుతున్నది. శాసనసభ వేదికగా ప్రజాసమస్యలపై జరుగవలసిన అర్థవంతమైన చర్చలను పక్కనపెట్టి, నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, ప్రాంగణం వెలుపల పోలీసులతో అడ్డుకోవడం ఆందోళనకరం. కొండంత హామీలిచ్చి, ఆ హామీలను నెరవేర్చడంలో, ప్రజలను పట్టిపీడిస్తున్న క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతున్నది. శాసనసభలో ప్రశ్నలను తప్పించుకోవడం, వీధుల్లో నిరసనలను పోలీసు బలప్రయోగంతో అణచివేయడం ద్వారా ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి పూర్తిగా తప్పుకొంటున్నది.
ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి లభించే ఒక బాధ్యత. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పరిశీలిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి లేదా క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేదనేది స్పష్టమవుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలు’ సహా ఎన్నో ఆకర్షణీయమైన హామీలను ప్రభుత్వం అమలు చేయలేక చేతులెత్తేసింది.
రైతుభరోసా, రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలు అటకెక్కాయి. కనీసం ఎప్పుడు అమలు చేస్తారో కూడా ప్రభుత్వం చెప్పడంలేదు. స్పష్టమైన కాలానుగుణ ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు లేకుండా కేవలం కాలయాపన చేస్తున్నది. హామీల అమలుపై శాసనసభలో ప్రశ్నలు సంధించినప్పుడు ప్రభుత్వం వద్ద తగిన డాటా కానీ, స్పష్టమైన సమాధానాలు కానీ లభించడం లేదు.
శాసనసభను చర్చల వేదికగా కాకుండా, అణచివేత సాధనంగా మార్చడం ఆక్షేపణీయం. సభలో ప్రతిపక్షాలపై పేర్కొన్న ఆరు కీలక సమస్యలపై సమగ్ర చర్చను కోరినప్పుడు, ప్రభుత్వం వాటికి సమాధానాలు చెప్పి పరిష్కార మార్గాలు చూపాలి. కానీ, ప్రతిపక్ష సభ్యులను వరుసగా సస్పెండ్ చేయడం ద్వారా సభాహక్కుల ఉల్లంఘన చేస్తున్నది. అసెంబ్లీ గేట్ల వద్దే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ అభద్రతా భావాన్ని, నిర్లక్ష్యాన్ని తెలియజే స్తున్నది. సభలో చర్చలు జరక్కుండా, ప్రజల దృష్టి మళ్లించేలా సభను త్వరితగతిన ముగించడం లేదా హడావుడిగా బిల్లులు పాస్ చేసుకోవడం ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి పారిపోవడమే అవుతుంది.
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా నేడు సంతోషంగా లేదు. భూమి హక్కులు కోల్పోయిన బాధితులు, ఫీజు రీయింబర్స్మెంట్ లేక సతమతమవుతున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, దాదాపు ఆరు విడతల డీఏలు బకాయిలు పడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోజువారీగా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఆందోళనకారుల వద్దకు వెళ్లి మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ప్రభుత్వం, వారిపై పోలీసు కేసులు పెట్టడం, ముందస్తు నిర్బంధాలు, అసెంబ్లీ ముట్టడి పిలుపులను భగ్నం చేయడానికి సరిహద్దుల్లో బారికేడ్లు కట్టడం వంటి చర్యలకే ప్రాధాన్యమిస్తున్నది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నతమైనది, అలాగే సభాపతి స్థానం అత్యంత గౌరవప్రదమైనది. స్పీకర్ పదవికి ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీకి చెందినవారైనా, ఆ పీఠంలో కూర్చు న్న తర్వాత రాజ్యాంగబద్ధంగా, రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. సభలో అధికార, ప్రతిపక్షాల హక్కులను పరిరక్షించడం స్పీకర్ ప్రాథమిక బాధ్యత. అయితే, ప్రస్తుతం స్పీకర్ స్థానం నిష్పాక్షికతను కోల్పోయి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, సభా కార్యకలాపాల నుంచి వారిని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతున్నదనే విమర్శలు రావడం చాలా బాధాకరం. ప్రజాప్రతినిధులపై ఎలాంటి ప్రామాణికమైన లేదా అధికారిక ఆధారాలు లేకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ వేటు వేయడం అత్యంత విచారకరం. ఈ ధోరణిపై అత్యున్నత నాయస్థానం పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది.
రాజారామ్ పాల్ కేసులో (2007) సభకు చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, ఆ అధికారాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాలని, న్యాయ సమీక్షకు అతీతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో (2022) ఎమ్మెల్యేలను సుదీర్ఘకాలం (ఏడాదిపాటు) సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని, అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని తేల్చిచెప్పింది.
ఓ ఎమ్మెల్యేను సభ నుంచి ఏకపక్షంగా దూరం పెట్టడం అంటే కేవలం ఆ వ్యక్తిని శిక్షించడం మాత్రమే కాదు, ఆ సభ్యుడిని ఎన్నుకున్న ప్రజల ప్రాతినిధ్య హక్కును కాలరాయడమే. ప్రతిపక్షం లేని సభ ప్రజాస్వామ్యాన్ని రక్షించలేదు. స్పీకర్ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే పార్లమెంటరీ విధానాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన పారిపోయే ధోరణిని వీడాలి. శాసనసభను ప్రజాప్రతినిధుల అరెస్టులకు, హడావుడి వాయిదాలకు వేదికగా మార్చకుండా, ప్రతిపక్షాలు ప్రస్తావించే సమస్యలపై, నిష్పాక్షికమైన చర్చ జరపాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలి. నిధులు కేటాయించి, సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని చేతల ద్వారా నిరూపించుకున్నప్పుడే ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో మనుగడ ఉంటుంది.