తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆ మాటలన్నీ అన్నారా! అందులో ఆశ్చర్యం ఏముంది? ఆయనకు అనేక విషయాల్లో ఎప్పటినుంచో నోరు అదుపులో లేని సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తిగత స్వభావం ఒకటి కాగా, ఇప్పటికి సరిగా 12 సంవత్సరాల క్రితమే తమ రాష్ట్రమైన కర్నాటకలో, తమ ప్రధానమంత్రి మోదీ తెలంగాణ గురించి ఏమన్నదీ తేజస్వికి బాగా గుర్తుండే ఉంటుంది. నాయకుడి ఆలోచనా ధోరణి ఏమిటో తెలిసిన తర్వాత తేజస్వి అందుకు భిన్నంగా మాట్లాడగలరని భావించటమే పొరపాటు. కనుక తనను వదిలివేస్తే, తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, నాయకులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరన్నదే సిగ్గుచేటుగా ఉంది.
తేజస్వి సూర్య 16వ తేదీ గురువారంనాడు సభలో చర్చించబూనిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు, ఆంధ్రప్రదేశ్‌ను విభజించటానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉందని తనకు తోచినట్లయితే అది ఏ విధంగానో చెప్పవలసింది. అదేమీ లేకుండా ‘విభజన’ అనే ఒక్కమాటనే సూత్రంగా చేసుకుంటూ రెండు విభజనలకు లేని ముడిని పెట్టి ఖండించారు. న్యాయశాస్త్రం చదివిన ఆయనకు చరిత్ర, రాజ్యాంగం, చట్టాలు, తర్కం, వాటితోపాటు ఇంతవరకు జరిగిన రాష్ట్ర విభజనల గురించి తెలియాలని మనం ఆశిస్తాము. పార్టీలోకి రాకముందు ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు కూడా అయినందున తెలంగాణ రాష్ట్రం డిమాండు పట్ల ఆర్ఎస్ఎస్ తీసుకున్న వైఖరి ఏమిటో తెలిసి ఉంటుందని కూడా అనుకుంటాము.
చివరగా, విభజన విషయమై స్వయంగా బీజేపీ అనుసరించిన విధానం కూడా. ఇవేవీ తెలిసి ఉండకపోతే మనం అనగలిగిందేమీ లేదు. లేదా తను ఆర్ఎస్ఎస్ను, బీజేపీని ఖండిస్తూ, నరేంద్ర మోదీ వైఖరిని బలపరుస్తున్నారనుకోవాలి. ఆ పార్టీలో ఇపుడు చాలామందికి తమ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కన్న, పార్టీ మౌలిక విధానాలకన్న, అధికారం, సంపాదనలు ముఖ్యమైపోయాయి గనుక, ప్రధానమంత్రి కేంద్రంగా ఆ వ్యవహారాలు సాగుతాయి గనుక, మోదీ 2014 ఫిబ్రవరిలో కర్ణాటక నుంచి మొదలుకొని 2023 సెప్టెంబర్‌లో పార్లమెంటు వరకు వరుసగా పదేండ్లపాటు తెలంగాణ పట్ల చూపిన వ్యతిరేకత, ఆంధ్ర ప్రాంతంపై ప్రదర్శించిన ప్రేమానురాగాలు తేజస్వి మనసులో బలమైన ముద్ర వేసి ఉంటాయి.
సందర్భం వచ్చింది గనుక రెండు మాటలనుకోవాలి. తేజస్వి చట్టమైతే చదివి డిగ్రీ సంపాదించారు గాని చరిత్ర చదవలేదన్నది స్పష్టం. ఆయనకు భారతదేశ విభజన చరిత్ర తెలియదు. ఆంధ్రప్రదేశ్ విభజన గురించి తెలిదు. తన ప్రధానమంత్రికి, హోంమంత్రికి, తనకు కూడా ఎవరో చెప్పినవి ఏవో మెదళ్లలో నాటుకుపోయాయి. అదిగాక మరేవో ‘కన్సిడరేషన్స్’ అనేవి ఉండి ఉంటాయి. లేనట్లయితే, సాక్షాత్తూ ఆర్ఎస్ఎస్, తమ పార్టీ బీజేపీ అధికారికంగా బలపరచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నరేంద్ర మోదీ అటువంటి హీనమైన భాషలో ఆక్షేపించటం జరిగేది కాదు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించటం’, ‘సీమాంధ్ర ప్రాంతం అనాథ కావటం’, ‘అవమానకరమైన రీతిలో విభజన’ ‘ఆంధ్ర నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్’, ‘దర్వాజాలు బంద్’, ‘రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ ప్రజలు ఉత్సవాలు చేసుకోలేదు’. ఒక ప్రధానమంత్రి స్థాయికి ఇవి ఎంత సత్యదూరమైన మాటలు, ఎటువంటి దిగ్భ్రాంతికరమైన భాష! అటువంటి నాయకుని అనుయాయిగా తేజస్వి సూర్య అంతకన్న భిన్నంగా మాట్లాడగలరా?
తేజస్వి సూర్య సరే. నిజం చెప్పాలంటే అటువంటి మనిషి మాటలను పట్టించుకోవటం, ఆందోళన చెందటం సమయాన్ని వృథా చేసుకోవటమే. సమస్య వస్తున్నది ‘వీరి’ నుంచి. వీరంటే, తేజస్వి మాట్లాడుతున్న సమయంలో సభలోనే గల తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ సభ్యుల విషయం. సభలో కాకున్నా పార్లమెంటు ఆవరణలోనే ఉండిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగతి. వీరందరిలో ఎవరూ నిరసన ప్రకటించలేదు.
కాంగ్రెస్ సభ్యులైతే వెంటనే తేజస్విని బలంగా అడ్డుకుని ఖండించవలసింది. మధ్యలోనే బయటకు వెళ్లి గాని, కనీసం సభ ముగిసినాకగాని ము ఖ్యమంత్రికి వివరాలు తెలియజేసి మీడియాతో మాట్లాడించవలసింది. కాని ఏమీ చేయలేదు. సభలోని తెలంగాణ బీజేపీ సభ్యులు పార్టీ పరిమితుల వల్ల ఖండించటమంటూ చేయలేకపోయినా, కనీ సం అదే చర్చ సందర్భంగా లేచి వివరణ ఇవ్వటం తప్పక వీలయేదే. కాని వారు కూడా ఏమీ చేయలేదు. తాము పుట్టిన గడ్డ, తమను ఎన్నుకున్న గడ్డ చరిత్ర తెలిసి కూడా, ఆ గడ్డ అవమానాలకు గురవుతుంటే, ఏ ఒక్కరికీ నోరు పెగలలేదు. అందువల్ల, తెలంగాణకు సమస్య ‘వీరి’తో.
ఈ దృశ్యాలు సహజంగానే తెలంగాణ ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. ఆ రోజు, మరునాడు విమర్శలు చెలరేగటంతో, కాంగ్రెస్ వారు అప్పుడు నిద్ర నుంచి మేల్కొని మాట్లాడటం మొదలుపెట్టారు. బయట, సభలో కూడా. ఆ ధోరణిని ఆపద్ధర్మ ఎత్తుగడ అంటారు. వారికి తెలంగాణ స్పృహ అంటూ నిజంగా ఉంటే, తమ నేలకు అవమానం జరిగినపుడు ఆగ్రహం వెంటనే దానంతట అదే తన్నుకుని ఎగిసి వస్తుంది. ఈ స్థితిని ఎత్తిచూపేందుకు మీడియా, అదే తేజస్వి అదే ప్రసంగంలో తమిళ భాష గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయగా, ఆయన ఉద్దేశించింది డీఎంకే పార్టీని అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా తమిళనాడు సభ్యులంతా ఒక్కుమ్మడిగా ప్రతిఘటించటాన్ని ఉదాహరిస్తున్నది. తెలంగాణ సభ్యుల చీము నెత్తురు లేనితనం గురించి ఇంకా చెప్పనక్కరలేదు.
తెలంగాణ బీజేపీ నాయకత్వానిదైతే ఇంతకన్న దారుణమైన ధోరణి. వారు 2014 వరకైతే ప్రత్యేక రాష్ర్టానికి అనుకూలంగా వ్యవహరించారు గాని, ఆ సంవత్సరంలో ప్రధాని అయిన మోదీ వైఖరి అర్థం కావటంతో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వరుసగా మాట్లాడుతూ పోయినా నోళ్లకు సీళ్లు వేసుకున్నారు. ఆయనను నేరుగా ఏమీ అనలేకపోయినా ఆర్ఎస్ఎస్కు తమ అభిప్రాయం తెలియజేయగల వెసులుబాటు ఉంది. అటువంటిది ఏమైనా జరిగినట్లు మనకైతే వార్తలు లేవు. జరగకపోవటానికే అవకాశం ఎక్కువ. ఎందుకంటే, పైన చెప్పుకొన్నట్లు, బీజేపీలో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అధికారం కోసం అర్రులు చాచే కొత్తతరం వచ్చింది. అటువంటపుడు సైద్ధాంతిక నిబద్ధతలు, వాటితోపాటు వెన్నెముకలు కూడా మాయమైపోతాయి. అధికారంలో ఉన్నవారి భజనలు సాగుతుంటాయి.
ప్రస్తుతం జరిగింది అటువంటిదే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అదేరోజు హైదరాబాద్‌లో మాట్లాడుతూ, తేజస్విని సమర్థించారు. ఆయన వ్యాఖ్యలను భూతద్దంలో చూస్తున్నారన్నారు. భారత-పాకిస్థాన్ విభజన సమయంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, తెలంగాణ ఏర్పాటు కూడా ప్రాణత్యాగాల తర్వాతనే జరిగిందని, ఆ విషయం చెప్పటం తేజస్వి ఉద్దేశమని వివరించబూనారాయన. కనుక ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన రాజకీయ శాస్త్రం, న్యాయశాస్త్రం కూడా అభ్యసించినందున ఈ కుంటి సమర్థన అయినా మరింత బాగా ఉండ వలసింది. అట్లా లేనందున తన అ-వాదనలను (నాన్ ఆర్గ్యుమెంట్స్) అపహాస్యంగా భావించి కొట్టివేయటమైనది. తను గాని, తన వలెనే వెన్నెముక లేని, పవర్-సీకర్స్ తరానికి చెంది, సంఘ్ పరివార్ నైతికతలను వదలివేసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గాని అంతకన్న ఏమి మాట్లాడగలరు గనుక. కిషనన్న గురువారం రాత్రి సభలో అంతే అసమర్థ సమర్థనలు చేయబూనారు. పైగా తేజస్వి, తానూ క్షమాపణలు చెప్పకుండానే చెప్పామన్నారు.
మొత్తం మీద తెలంగాణ ప్రజలకు పాఠమేమంటే, ఎన్నెన్నో పోరాటాలు, త్యాగాలు చేసి స్వరాష్ర్టాన్ని సాధించుకుని 12 సంవత్సరాలు గడిచిపోయినా ప్రధాని, హోంమంత్రి, చంద్రబాబు మొదలుకొని వీరందరి కడుపుల్లో, తెలంగాణ తమ దోపిడీ పరిధి నుంచి తప్పిపోయిందన్న కక్షపూరితమైన విషం ఇంకా అట్లాగే ఉందన్నమాట. 1956 నుంచి 2014 వరకు సీమాంధ్ర ధనిక వర్గాలకు, రాజకీయ ప్రాబల్య వర్గాలకు మోచేతి నీళ్లు తాగే దళారులుగా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ వారి వారసత్వం కూడా ఇంకా కొనసాగుతున్నదన్నమాట.
ఈ రెండు విధాలైన అవశేష విషాలు కొనసాగినంతకాలం అవి వేర్వేరు విధాలుగా బయటపడుతూనే ఉంటాయి. తేజస్వి వ్యాఖ్యలు, బీజేపీ వారి ధోరణి, ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ వారి తీరు, అటునుంచి నాలుగు రోజులకొకసారి చంద్రబాబుతోపాటు సీమాంధ్ర ధనిక వర్గాల అవమానకర ప్రకటనలు ప్రతిఫలించేది దీనినే. దీనంతటికి విరుగుడు తెలంగాణ ప్రజలు, యువతరం, తమ ఉద్యమకాలం నాటి స్ఫూర్తిని తిరిగి ఆవాహన చేసుకుని తమ అస్తిత్వాన్ని అన్నివిధాలా బలోపేతం చేసుకోవటమే.