యంత్రభూతాలు ఉక్కు పిడికిళ్లతో కలల లోగిళ్లను బద్దలు కొట్టే బీభత్స భయానక దృశ్యాలకు ఇకనైనా తెరపడుతుందా? సత్వర న్యాయం పేరిట జరుగుతున్న అరాచకానికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు? బుల్డోజర్ పీడకలకు ముగింపు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే బుధవారం నాటి సుప్రీంకోర్టు తీర్పు. పరిపాలనా వ్యవస్థ నిరంకుశ, సంకుచిత విధానాలకు చెంపపెట్టు లాంటి ఈ తీర్పు బాధితులు ఎందరికో ఊరటనిస్తుందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి చేసిన నేరానికి అతని కుటుంబాన్ని శిక్షించే విపరీత ధోరణికి తగిలించిన పేరే ‘బుల్డోజర్ న్యాయం’. నిజానికి ఇది అన్యాయం, అక్రమం. నేరాభియోగాల పేరిట జరిపే దురన్యాయం ఇక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం ముదావహం. ‘నాకంటూ ఓ గూడు ఉండాలి.. తల మీద ఇంత నీడ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ కలతోనే జీవిస్తారు. ఈ కల ఎన్నడూ దూరం కావద్దనేది ప్రతి మనసు కోరిక’.. హిందీ కవి ప్రదీప్ రాసిన ఈ పంక్తులతో మొదలయ్యే తీర్పు పాఠం బుల్డోజర్ విధాన రూపకర్తలకు గుణపాఠం. వ్యక్తులు, కుటుంబాల మౌలిక ఆకాంక్షలకు, సుస్థిరత, సురక్ష భావనలకు ఇల్లు అనేది ప్రతీక లాంటిదనడం ఒక ఆర్ద్రమైన నిర్వచనమే. అంతేకాకుండా అదొక ప్రాథమిక హక్కు అని తేల్చిచెప్పడం గమనార్హం.
నిజానికి కూల్చివేతలకు సంబంధించి నిర్దిష్టమైన విధివిధానాలు మన దేశంలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. ఎలాంటి కూల్చివేత అయినా అధికారులు ముందస్తు నోటీసు ఇచ్చి, దానికి సమాధానం ఇచ్చేందుకు 15 రోజుల వ్యవధి ఇవ్వడం తప్పనిసరి. కానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తోసిరాజని ఇష్టారాజ్యంగా ఇండ్ల మీదకు బుల్డోజర్లను నడిపిస్తున్నాయి. కుటుంబాలను, పిల్లాపాపలను వీధుల పాలుచేస్తున్నాయి. ఈ తరహా బుల్డోజర్ న్యాయాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టడం గమనార్హం. ప్రజల హక్కులకు రక్షణగా నిలిచే మార్గదర్శకాలను సుప్రీంకోర్టు గుర్తు చేయాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడటం దురదృష్టకరం. మనది చట్టబద్ధ పాలనతో కూడిన ప్రజాస్వామిక దేశం. మనకు ఓ రాజ్యాంగం ఉంది. అయినా ఏ చట్టాలతో ప్రమేయం లేకుండా పరిపాలనా విభాగం న్యాయవిధులను తన చేతుల్లోకి తీసుకుని నేరనిర్ధారణ చేయడం, శిక్ష పేరిట ఇండ్లు కూల్చడం వైపరీత్యమే. ఇది అరాచకం తప్ప మరోటి కాదన్న ధర్మాసనం వ్యాఖ్య ఓ కనువిప్పు. కేవలం నేరారోపణల ఆధారంగా పౌరుల నివాసాలను ఏకపక్షంగా కూల్చడం చట్టబద్ధ పాలన సూత్రాల ఉల్లంఘన, అంతిమంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనేది తీర్పు సారాంశం.
యూపీలో మొదలైన ఈ కూల్చివేతల దురాచారం క్రమంగా మధ్యప్రదేశ్ వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలకు వ్యాపించింది. ఈ తతంగమంతా మైనారిటీలు లక్ష్యంగా జరుగుతున్నదనే ఆరోపణలూ వచ్చాయి. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలవనరుల పరిధిలోకి వస్తాయంటూ, అనుమతులు లేవంటూ రకరకాల కారణాలు చెప్తూ బుల్డోజర్ కూల్చివేతలకు తెగబడింది. ఏండ్లకేండ్లుగా నివాసముంటున్న కుటుంబాలను రాత్రికిరాత్రే గూడు చెదిరిన పక్షులుగా మార్చివేసింది. హైకోర్టు మందలింపుతో దూకుడు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు విస్తృతస్థాయిలో నివాస హక్కును బలపరచడం ముదావహం.