కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధింపులకు గురిచేసేవి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం మొదలు రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగ విరుద్ధంగా బర్తరఫ్ చేయడమే గవర్నర్ల వ్యవస్థ లక్షణంగా మారిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పెద్దగా తేడాలు లేవని మనకు ఇటీవలి కాలంలో తేలిపోయింది. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను చికాకు పరిచేందుకు గవర్నర్ గిరీని వినియోగించడంలో బీజేపీ రెండాకులు ఎక్కువే చదివినట్టు గత పదేండ్ల పైచిలుకు అనుభవం రుజువు చేసింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలను తొక్కిపెట్టిన ఇదివరకటి గవర్నర్ సతాయింపులు మనం ఇంకా మరిచిపోలేదు.
ఇటీవలి కాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వంతో గిల్లికజ్జాలకు దిగడం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. మరీ ముఖ్యంగా శాసన వ్యవస్థ నిర్ణయాలను ఆయన తొక్కిపెట్టడం తీవ్ర వివాదాలకు దారితీసింది. కోర్టులు మొట్టికాయలు వేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రాష్ట్ర శాసనవ్యవస్థ ఆమోదించిన, రాష్ట్ర మంత్రిమండలి సానుకూలంగా సిఫారసు చేసిన పది బిల్లులను ఆయన తొక్కిపెట్టడం ఈ ధోరణికి పరాకాష్ఠ. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినప్పటికీ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించడం మరీ విడ్డూరం. అలా చేయడమంటే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం చేతుల్లో పెట్టడం తప్ప మరోటి కాదు. గవర్నర్ అధికారాలకు గల పరిమితిని ఆయనకు గతంలో ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు గుర్తుచేసింది. అయినా అవేవీ ఆయన పట్టించుకున్నట్టు లేదు. తాజాగా బిల్లుల నిలిపివేతపై సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు మైలురాయి లాంటిదని చెప్పవచ్చు. గవర్నర్ రవి చర్యను రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నివేదనపై రాష్ట్రపతి తీసుకునే ఎలాంటి చర్యలైనా నిలబడజాలవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద తనకు దఖలు పడిన విశిష్టమైన అధికారాలను ఉపయోగించుకొని ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టుగా ప్రకటించడం గమనార్హం.
ఈ కీలక తీర్పులో సుప్రీంకోర్టు సమయ ప్రణాళికను సూచించింది. రాష్ట్ర మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా రాష్ట్రపతికి పంపాలనుకుంటే మూడు నెలల్లోగా ఆ పనిచేయాలి. రెండోసారీ, అదీ ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా బిల్లును పంపితే నెల రోజుల్లోగా గవర్నర్ రాజముద్ర వేయాలని నొక్కిచెప్పింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనకు సారథిగా ఉండాల్సిన గవర్నర్లు తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారడం ప్రజాస్వామ్యానికీ, సమాఖ్యవాదానికీ శోభించదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే గవర్నర్ల తీరు ఒకరకంగా, భిన్నపార్టీల ప్రభుత్వాలుంటే మరోరకంగా ఉండటం ఆమోదయోగ్యం కాదు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో గవర్నర్ల తీరు మారుతుందని ఆశించడంలో తప్పు లేదు.