తెలంగాణ శాసన సభ్యులు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, వ్యతిరేకంగా ఇచ్చినా అది చరిత్రాత్మకం అవుతుంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడమంటే ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టే. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. కాబట్టి ప్రజలు అభ్యర్థికి విడిగా ఓటువేయరు. ఒక పార్టీ ప్రతినిధిగానే ఓటు వేస్తారు. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరడమంటే ప్రజల తీర్పును కాలరాసినట్టే. ఇప్పటి వరకు పార్టీ మార్పిడి చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారుతున్నారు. ఇప్పటి వరకు ఇది బాగానే సాగింది. చట్ట వ్యతిరేక చర్య అందరూ చేస్తే అది చట్టబద్ధం అవుతుందా ?
శాసన సభ్యులు ఇలా పార్టీలు మారడం ఇదే మొదటిసారి కాదు. ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లడమూ మొదటిసారి కాదు. కానీ సుప్రీంకోర్టు ఈసారి సీరియస్‌గానే స్పందించింది. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? మహారాష్ట్రలో మాదిరిగా శాసన సభ్యుల పదవీకాలం ముగిసే నాటికి నిర్ణయం తీసుకుంటారా?’ అని ఘాటుగా ప్రశ్నించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా శాసన సభ్యులు పార్టీ మారినప్పుడు ఆ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తుంది. నిర్ణయాధికారం స్పీకర్‌దే. పేరుకు స్పీకర్ తటస్థులని చెప్పుకున్నా అలా ఉండడం సాధ్యం కాదు. స్పీకర్ కూడా ఐదేండ్లు కాగానే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి. పార్టీ టికెట్ కావాలి. రాజకీయ మనుగడకు పార్టీ ఆశీస్సులు కావాలి. అందుకోసం స్పీకర్ సహజంగానే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు. పార్టీ మారి అధికార పక్షంలోకి వచ్చిన శాసన సభ్యులను కాపాడటానికి సహకరిస్తారు. కానీ, చట్ట ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయరు. అయితే, చట్ట ప్రకారం వ్యవహరించినట్టుగా నటించడం కోసం శాసనసభ్యుల సభ్యత్వ గడువు ముగిసే సమయంలో నిర్ణయం తీసుకుంటారు.
పెండ్లిలో అదిగదిగో అరుంధతి నక్షత్రం అని పూజారి చూపిస్తే పెళ్లికొడుకు అరుంధతి నక్షత్రం మా మేనత్తే అన్నంత ధీమాగా పెళ్లి కూతురుకు నక్షత్రాన్ని చూపుతూ ఫొటో దిగుతాడు. అరుంధతి నక్షత్రం నిజానికి వారెవరికీ కనిపించదు. పెండ్లిలో ఇదో తంతు మాత్రమే. పార్టీ మార్పిడి నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం సైతం ప్రజాస్వామ్యంలో ఉత్తుత్తి తంతుగా మారింది. తెలంగాణ శాసన సభ్యుల పార్టీ మార్పిడి కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంతకాలం హాస్యాస్పదంగా మారిన పార్టీ మార్పిడి నిరోధక చట్టానికి కోర్టు తన నిర్ణయంతో గౌరవాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో స్పందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసు ఇచ్చింది. వారు గడువులు కోరుతూనే ఉంటారు. శాసనసభ సభ్యత్వ కాలం ముగిసేంత వరకు సమాధానం ఇవ్వడానికి గడువు కోరుతూనే ఉంటారు. అదే జరిగితే పార్టీ మార్పిడి నిరోధక చట్టం లేనట్టే. అధికార పక్షంలోకి మారితే ఏమీ కాదు, విపక్షంలోకి మారితే సభ్యత్వం రద్దు అవుతుంది అని చట్టం చెప్పినట్టే.
శాసనసభ, న్యాయ వ్యవస్థ స్వతంత్ర సంస్థలు. ఒక వ్యవస్థ తన బాధ్యత నెరవేర్చనప్పుడు, బాధితులు తనను ఆశ్రయించినప్పుడు న్యాయ వ్యవస్థ స్పందించాలి. చట్టాన్ని కాపాడాలి. శాసన సభ్యులు పార్టీ మారినప్పుడు న్యాయ వ్యవస్థ తనంతట తానే స్పందించి చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకున్నట్టు భావించవచ్చు. కానీ ఈ వ్యవహారంలో స్పీకర్ చర్య తీసుకోలేదని బాధిత పక్షం న్యాయ వ్యవస్థను ఆశ్రయించింది. చట్ట సభల ప్రతినిధులు తాము రూపొందించిన చట్టాన్ని తామే గౌరవించనప్పుడు న్యాయ వ్యవస్థ తీర్పు చట్టం గౌరవాన్ని పెంచినట్టు అవుతుంది.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం సమావేశానికి పొరపాటున ఇద్దరు పార్టీ మారిన శాసన సభ్యులు వస్తే ‘సుప్రీంకోర్టులో కేసు ఉంది మీడియా కంట పడకండి’ అని వారిని దొడ్డిదారిలో వెనక్కి పంపించిన వార్త నవ్వు తెప్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘జై భీం’, ‘జై బాపు’, ‘జై సంవిధాన్’ పేరుతో రాజ్యాంగ పరిరక్షణ కోసం గొప్ప సభ నిర్వహించింది. దేశంలోని కాంగ్రెస్ పెద్దలంతా వచ్చి బీజేపీ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రాజ్యాంగం ఎంత పవిత్రమైందో చెప్తూ, దానిని పరిరక్షించే బాధ్యత మన భుజాలపైన పడిందని చక్కగా మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి పదిమంది శాసన సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు. ఇలా పార్టీ మారిన వారిలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు కానీ సంవిధాన్ సభలో రాజ్యాంగం గురించి, విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే రేవంత్ కన్నా కడియం శ్రీహరి అద్భుతంగా మాట్లాడేవారు. కడియం నిరంతరం రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడేవారు.
మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రి పదవి రాగానే మీడియాను భోజనానికి పిలిచారు. భోజనం చేస్తుంటే ఈ భోజనం బిల్లు నా సొంత జేబు నుంచి చెల్లిస్తున్నాను, కాంట్రాక్టర్ల ద్వారా కాదు అని చెప్పుకొచ్చారు. అప్పుడాయన ఇరిగేషన్ మంత్రి. సాధారణంగా భోజనం సమయంలో బిల్లు ఎవరు ఇస్తారు అనే చర్చ రాదు. నాకు రాజకీయాల్లో విలువలు ముఖ్యం అందుకే ఇది చెప్తున్నానని అప్పుడు కడియం సమర్థించుకున్నారు. అంతటి విలువలతో కూడిన రాజకీయాలు నడిపే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నారు. చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమార్తెకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కేటాయించే వరకు ఉన్నారు. ఓ వర్షం కురిసిన రాత్రి మెరుపు మెరిసి జ్ఞానోదయం అయినట్టు బీఆర్ఎస్లో నియంతృత్వం కనిపించి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరితే విలువలతో కూడిన రాజకీయం అనే ఉపన్యాసాలకు సార్థకత ఉండేది.
ఇక, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి సైతం వెళ్లలేని పరిస్థితి పార్టీ మారిన శాసన సభ్యులది. సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆధారాలు ఇచ్చినట్టు అవుతుందని పదిమందినీ దూరం పెట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
స్పీకర్‌గా ఒకప్పుడు శాసనసభను నడిపిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు పార్టీ మారి ‘ఆధారం దొరుకుతుందని’ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి వెళ్లలేని దుస్థితి. పార్టీ మారిన ఈ పదిమంది శాసన సభ్యుల పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడి’ సామెతలా మారింది. తెలంగాణలో పదిమంది బీఆర్ఎస్ శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడంపై రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. తన నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి బహిరంగంగానే మండి పడ్డారు. హై కమాండ్ పిలిచి ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పే సరికి చల్లబడ్డారు.
ఒక వైపు విలువలకు తిలోదకాలు ఇస్తూ శాసన సభ్యులను చేర్చుకుంటూ, దానిని తమ విజయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ సభలు పెడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఉపన్యాసాలు ఇవ్వడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. పార్టీ మారిన శాసన సభ్యుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. పార్టీ మార్పిడి నిరోధక చట్టం గౌరవం నిలుస్తుందా? కాగితం పులిగా మిగులుతుందా? అనేది సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంటుంది.