బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సాగిన రాజ్యాంగ పోరాటంలో సుప్రీంకోర్టు గురువారం నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించింది. మూడు నెలల గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ తీర్పుపై వార్తాపత్రికలు, వెబ్సైట్లు సహా మీడియా విశ్లేషణలు వెలువరించాయి: ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు వీగిపోవడాన్ని అనుమతించరాదు. అంటే పార్లమెంటు చేసిన చట్టం వీగిపోవడాన్ని అనుమతించవచ్చు అని కాదు.’ ‘ఎద్దు చచ్చినా వాత కుదిరిందన్న ధోరణిలో అన్ని విషయాల్లో వ్యవహరించలేము..’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ కొంచెం గట్టిగానే తలంటుపోయడం రాజ్యాంగ బద్ధత తక్షణావశ్యకతను నొక్కిచెప్తున్నది.
‘2028 వరకు వేచి చూస్తూ, విధానం అపహాస్యం అయ్యేలా వదిలేయడమేనా?’ కాలవ్యవధి విధించరాదన్న వాదనలను తిరస్కరిస్తూ ధర్మాసనం ఈ ప్రశ్నను సంధించింది. ఫిరాయింపు తర్వాత ఎన్నికలు రానేరావని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో ముఖ్యమంత్రి ఈ మాటలు అనడం.. పదో షెడ్యూల్‌ను ఎద్దేవా చేయడమేనని పేర్కొన్నది.
న్యాయవ్యవస్థలో భిన్నాభిప్రాయం
రాజ్యాంగంలో ఏమున్నదనే దానితో నిమిత్తం లేకుండా, సభలోని సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో కోర్టులకు ఎలాంటి ప్రమేయం ఉండబోదని పదో షెడ్యూల్ చెప్తున్నది. అయితే, అనర్హతను నిర్ణయించే ట్రిబ్యునల్‌గా వ్యవహరించే సమయంలో మాత్రం స్పీకర్‌పై న్యాయపరిశీలన జరుపవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం అన్ని ట్రిబ్యునళ్లపై సుప్రీంకోర్టు సర్వోన్నత సంస్థగా ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది.
స్పీకర్ నిష్క్రియాపరత్వంపై రాజుకుంటున్న ఆగ్రహాన్ని సూచనప్రాయంగా వెల్లడిస్తూ గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. హేతుబద్ధమైన కాలవ్యవధి అంటే ఏది? మరో రాజ్యాంగ ఆవర్తనం వరకు మేము వేచి చూడాలా? అని న్యాయమూర్తులు ప్రతివాదులను నిలదీశారు. (రాజ్యాంగం పూర్తిగా అవసాన దశకు చేరుకుని మరో ఉజ్జీవ దశను పొందడాన్ని రాజ్యాంగ ఆవర్తనం అంటారు.)
సర్వోన్నత న్యాయస్థానం ధిక్కార హెచ్చరికలు బాహాటంగానే వ్యక్తమయ్యాయి. అయితే మాటలు కొంత ఆచితూచి వాడింది. రాజ్యాంగ విధానాలను నిర్లక్ష్యం చేస్తే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పింది.
స్పీకర్ జాప్యం చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన 3 మాసాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అసెంబ్లీలో రాజకీయ ప్రకటనలను ప్రస్తావిస్తూ, రాజ్యాంగ సూత్రాలను తృణీకరించడాన్ని మందలించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యాన్ని తిరస్కరిస్తూ, ఏకసభ్య ధర్మాసనం విధించిన కాలవ్యవధిని పాటించి ఉండాల్సిందని చెప్పింది. రాజకీయ పార్టీల హక్కులను ప్రస్తావిస్తూ, వాటిని సంరక్షించాలని, జాప్యం ద్వారా వాటిని నిర్వీర్యం చేయరాదని నొక్కిచెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైన స్వరంతో, సారంతో కూడుకుని ఉంది. స్పీకర్ కాలావధికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పింది. రాజ్యాంగ సంప్రదాయాలకు న్యాయవ్యవస్థ సంరక్షణ అవసరాన్ని పునరుద్ఘాటించింది. రాజకీయ జోక్యం, శాసనపరమైన నిశ్చలత పట్ల బెంచ్ విస్పష్టంగా వ్యక్తం చేసిన అసంతృప్తిలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే ఎత్తుగడల పట్ల ఏ మాత్రం సహనం చూపరాదనే ధోరణి వ్యక్తమైంది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ప్రక్రియకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపడం కాదు, అది రాజ్యాంగపరమైన అభిశంసన.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఓ న్యాయ గర్జన వంటిది. రాజ్యాంగ ఆదేశాలను చూరులో చెక్కవద్దని ఎలాంటి శషభిషలకు తావు లేకుండా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. రాజకీయ పటాటోపంతో న్యాయ విధానాన్ని కమ్మేయడం కుదరదని నొక్కిచెప్పింది. స్పీకర్ వ్యవహరణకు కచ్చితమైన కాలవ్యవధి, జవాబుదారీ నిర్దేశించడం ద్వారా సుప్రీంకోర్టు ఫిరాయింపు నిరోధక చట్టం పనితీరుపై మైలురాయి వంటి తీర్పును వెలువరించింది.