ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గురించి మీకందరికీ అంచనాలు ఉన్నయి. కానీ, మనందరినీ అప్రతిభులను చేస్తూ; కొందరు మేధో నక్కల దింపుడుగల్లం ఆశలు వమ్ము చేస్తూ రోజురోజుకూ తన గొయ్యి వెడల్పు చేసుకుంటున్నరు రేవంత్!
తాజాగా హెచ్‌సీయూ విద్యార్థులను బొక్కలో వేయాలనుకొని తనే బొక్కబోర్లా పడ్డరు. అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశానికి ముందు ఇబ్బంది వద్దనుకున్న అధిష్ఠానం ‘మీ దౌష్ట్యాన్ని కాస్త వాయిదా వేసుకోండి’ అన్నట్టుంది!
మొహం చెల్లని రేవంత్ విద్యార్థులపై కేసులు వద్దని ఆర్థికమంత్రి ద్వారా పోలీసులకు ఆదేశాలు ఇప్పించిన్రు. విద్యార్థులు నిర్దోషులైతే, వారి పక్షాన కొట్లాడిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు దోషులు యెట్ల అవుతరు? వారిపై కేసులు యెట్ల కొనసాగిస్తరు? ‘ఫేక్ వీడియోలు’ పెట్టినవారిపై చర్యలకు అనుమతించాలంటూ కోర్టుకు యెట్లపోతరు? సుప్రీంకోర్టు ఆపేసిన మీ దుశ్చర్యలకు హైకోర్టు నుంచి రక్షణ పొందుతరా? తెలివి ఉన్న పనులేనా? నగుబాటుకు గురవ్వడంలో మీకు కనీస అలసటైనా రాదేమీ!
తమ ఆవాసం చెదిరిపోయి, భీతిల్లిన వన్యప్రాణుల హాహాకారాలు ఎంతోమంది హృదయాలను కదిలించినయి. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, తటస్థంగా ఉండేవారు సైతం తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కిన్రు. అయినప్పటికీ మేలుకోని రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాను దుమ్మెత్తి పోస్తున్నరు. మార్ఫ్ చేసిన ఫొటోలు, ఫేక్ వీడియోలు అంటూ ఆక్రోశపడుతున్నరు. కేసులు పెట్టండి, బొక్కలో తోయండి అంటూ హుకుం జారీ చేస్తున్నరు. సోషల్ మీడియాను హోరెత్తించి, జనాగ్రహాన్ని ప్రస్ఫుటింపజేసిన ఫొటోలు, వీడియోలు ఏఐ సహాయంతోనే చేసి ఉండవచ్చును కానీ, వాస్తవదూరంగా లేవు కదా?
ప్రభావశీల వ్యక్తీకరణలకు విశేషణాలు, ఉపమానాలు తోడ్పడినట్టే టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుంది. గూడు చెల్లాచెదురై జనావాసాలలోకి వచ్చి కుక్కలదాడిలో మరణించిన మూగజీవుల బాధ ప్రపంచానికి తెలియడం కోసం, అందుకు కారణభూతులను బోనులో నిలబెట్టడం కోసం ఎన్ని మార్ఫింగ్‌లు చేసినా న్యాయమే. సమస్య లోతుల్లోకి పోకుండా, తప్పులకు చెంపలు వేసుకోకుండా ఇంకా అదే మేకపోతు గాంభీర్యం, అదే ఆటవిక న్యాయం. అయినా… హైడ్రా పేరుతో పేదలు, మధ్య తరగతి వారిని తమ ఇండ్లలోంచి వీధుల్లో పడవేసిన మనిషికి (?); వారి రోదనకు చలించని రాతి గుండెకు పశుపక్ష్యాదుల వేదన ఒక లెక్కనా? నిజానికి సిసలైన ఫేక్ కింగ్‌లు కాంగ్రెస్ వారే కదా? తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టినోడు ఇపుడు తెలంగాణ రక్షకుడు అనడాన్ని మించిన ఫేక్ ఏముంటుంది? మార్ఫింగ్ జరిగింది దుర్మార్గ కాంగ్రెస్‌ను ప్రజా ప్రభుత్వంగా నమ్మించడంలో కాదా? ఆరు గ్యారెంటీలు, ప్రజాస్వామ్య వీచికలు, అనుదినం సీఎం దర్శనం లాంటి నకిలీ దృశ్యాల ఆవిష్కరణకు పాల్పడినవారికి రేవంత్ లెక్క ప్రకారం ఎన్ని శిక్షలు వేయాలి? కాంగ్రెస్ పార్టీకి బాండెడ్ లేబర్ లాంటి అబద్ధాల మేధో నక్కలను ఏ చెట్లకు కట్టేయాలి?
1969 తెలంగాణ ఉద్యమ ఫలితంగా వచ్చింది హెచ్‌సీయూ. నాడు ఇందిరా గాంధీ ఇచ్చిన 2300 ఎకరాల భూమిలో, నేటి మంత్రి శ్రీధర్ బాబు లెక్క ప్రకారమే 1500 ఎకరాలు మిగిలింది ఇపుడు అదీ నోటిఫై చేయలేదు. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినట్టు పోజు కొట్టే రేవంత్ రెడ్డి ‘మా పార్టీ ఇచ్చిన భూమి, మా భూమి’ అంటూ మాట్లాడుతున్నరు. ఘనత వహించిన పార్టీ ఇచ్చిన భూమికి లెక్కాపత్రం కూడా లేదు యూనివర్సిటీ దగ్గర. ప్రభుత్వం అంటే ప్రజలే అన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నరు. ‘మా ఇంట్లకెల్లి ఇచ్చిన భూమిపై మీ పెత్తనం ఏందన్న’ రీతిలో రాధాకృష్ణ-రేవంత్ కలసికట్టుగా న్యాయవ్యవస్థను నిలదీస్తున్నరు. కోర్టులను మేనేజ్ చేయడం బాగా వచ్చని చంద్రబాబు నాయుడుకు పేరున్నది. ఆయనను మించిపోయిన ఆర్కే-రేవంత్ ద్వయం మాత్రం న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టడం, అప్రతిష్ఠ పాలు చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నరు.
హెచ్‌సీయూలో ఏమీ జరగకపోతే, పులుగడిగిన ముత్యం లాంటిదే ఈ ప్రభుత్వం అయితే… సుప్రీంకోర్టు ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? ఎందుకు సొంత విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ మీనాక్షీ నటరాజన్‌కు ఫిర్యాదు చేసింది? రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లి, హెచ్‌సీయూ భూములను కాపాడమని ఎందుకు అర్జీలు ఇచ్చింది?
ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటమై తనకే పూట గడవడం లేదు, ఇంకా అధిష్ఠానానికి కప్పమెట్లా కట్టేది? దాంతో పైనుంచి ఒత్తిడి. ఇపుడు అర్జెంటుగా ఏదో ఒకటి అమ్మాలి. అప్పు చేసి పప్పు కూడు కాదు, అప్పు చేసి చిప్ప కూడు అయింది పరిస్థితి. ఈ సందర్భంలో హెచ్‌సీయూ 400 ఎకరాల మీద కన్ను పడింది. ఎకరం వంద కోట్లు ఖరీదైన భూముల వేలం ద్వారా 40 వేల కోట్లు దండుకోవాలని పన్నాగం. అందులో 10 వేల కోట్లు ముడుపుల కోసమే అన్నది ఇప్పుడు బయటపడింది. అసలు విషయం ఇట్లా ఉండగా, రెండు వేల ఎకరాల ఎకో పార్క్ అని బాకా మీడియా యెంత ఊదినా లాభం లేదు. అందుకే ముఖ్యమంత్రికి నిరంతర ఫ్రస్ట్రేషన్!
‘మిమ్మల్ని సీఎం చేసినా కూడా, వారిని జైలుకు పంపడం లేదు ఎందుకు అని నన్ను అడుగుతున్నరు’ అంటూ నిండు సభలో అధమ స్థాయి మాటలు మాట్లాడిన కురచ మనిషి రేవంత్. సీఎం పదవి తెచ్చుకున్నది అంత చీప్ లక్ష్యం కోసమా? వ్యక్తిగత కక్ష కోసమా? ఆయన తిరిగే కక్ష్య పరిధి అంతేనా? వేల లక్షలే మీ లక్ష్యమా? ఆయన కన్నా కురచబుద్ధుల రాధాకృష్ణ ఆయనకు రాజగురువు అయినంక ఇంతకంటే ఏమి ఆశించగలం? ఆయనేమో సభలోనూ, బయటా సుప్రీంకోర్టును సైతం అగౌరవిస్తరు. ఆయన రాజగురువేమో న్యాయవ్యవస్థనే బోనులో నిలబెడుతడు! ఎట్లాంటి బఫూన్ల పాలయింది తెలంగాణ!
రేవంత్ దౌష్ట్యాలకు గురవుతున్న ప్రజలు తిరగబడుతున్నరు. మూగజీవులు తిరగబడలేవు కనుక బలవుతున్నవి. కన్నీరు కూడా పెట్టలేని వృక్షాల తలలు మౌనంగా నేలకు ఒరుగుతున్నవి. కానీ, సహజన్యాయం అనేది ఒకటి ఉంటుంది. అందరి లెక్కలూ కాపరి రాస్తూ ఉంటడు. శిక్షలు తప్పవు. ఇది కర్మ సిద్ధాంతం అనుకోండి లేదా కవితాన్యాయం అనుకోండి. జరిగే తీరుతుంది!