సంస్కృత మహాకవి, గీర్వాణ వాచస్పతి, మహామహోపాధ్యాయ పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి
యుగకర్తా యుగోద్దర్తా! చక్రవర్తీ యుగస్యచ సరస్వతీసుతోత్తంసః! జీయాత్ విజయ సారథిః!!
అని తర్కవాగీశ భట్టాచార్యులచే ఉత్తర భారతంలో జరిగిన సంస్కృత కవి సమ్మేళనంలో ప్రశసంలందుకున్న కవి విజయసారథి.
సంస్కృత భాషలో యావద్భారతంలో గల పండితులలో వేళ్ళపై లెక్కించదగినవారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. 1936లో కరీంనగర్ జిల్లా చేగుర్తిలో గోపమాంబ-నరసింహాచార్యులకు జన్మించారు. ఈయనకు సంస్కృతం అంటే అభిమానం. ఎనిమిదేండ్లకే కవిత్వం రాయడం ప్రారంభించారు. 11వ ఏట ఇంటినుంచి పారిపోయి బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని చేరుకొని ప్రార్థించి ‘శారదాపదకింకిణీ’ అనే కావ్యాన్ని రచించారు. జనగాం దగ్గర పాలకుర్తిలోని సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసించారు. యువకుడిగా ఉన్నప్పుడే సంస్కృతంలో ‘శబరీ పరిదేవనమ్’ కావ్యం రచించారు. శబరీ పరిదేవనమ్ లోని కథ రామాయణంలోని శబరి కాదు. ఆధునిక కాలంలో ఒక గిరిజన స్త్రీ జీవితాన్ని విషాదంగా చిత్రిస్తూ అది పార్వతీదేవిపై ఆరోపించి అభ్యుదయ భావాలను ప్రకటించారు. అమర భాషలో ఆధునికతను అభ్యుదయ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన ఘనత నవ్యత శ్రీభాష్యం విజయసారథిది. వ్యాకరణ, జ్యోతిష, సాంఖ్య, తర్క, మీమాంసాది శాస్ర్తాల్లో నిష్ణాతులు. వేదమంత్రాలు, వాటి అర్థాలు వివరించి ఏ మంత్రాలను ఏ యజ్ఞాలలో పఠించదగినవో సూచించేవారు. సంస్కృత భాషలో గేయ ఛందస్సును సృష్టించి, మందాకినీ కావ్యం రచించి, స్వయంగా ఉత్తరభారతదేశంలో జరిగిన కవి సమ్మేళనంలో గానం చేశారు. విజయసారథి గానాన్ని విన్న తర్కవాగీశ భట్టాచార్యులు ‘యుగకర్తా యుగోద్ధర్తా, సరస్వతీ సుతోత్తంసా’ అని ప్రశంసించారు.
దేశాభిమానం చాటుతూ ‘భారత భారతి’, సమ సమాజాన్ని ఆశిస్తూ ‘క్రాంతిగీతం’ రాశా రు. ‘జనని జాగృహి భారతావని జనని జయజయ పూత చరితే/ సకలజనతానందవాహిని నిఖిల మానవ శాంతి సారిణి’ అని లయాత్మకం గా సాగే దేశభక్తి ప్రబోధ గీతాలు గేయ సంప్రదాయాన్ని కూడా చాటాయి. క్రాంతిగీతమ్లో దేశంలోని కుల, మత వైషమ్యాలు, వరశుల్కం వంటి దురాచారాలు, అన్యాయాలు, అధర్మాల ను నిరసిస్తూ యువతను ప్రబోధిస్తూ రాసిన ఉత్తేజపూరితమైన గేయాలున్నాయి. భాషలో ఈ గేయ సంప్రదాయాన్ని సృష్టించి ఆకర్షింపజేసిన మార్గదర్శకులు విజయసారథి. భక్తి భావసౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే ‘రాసలీల’, ‘ఆవాహనమ్’, వంటి కావ్యాలెన్నో రచించారు. ఆధునిక కాలంలో రూపాయి ఆధిక్యాన్ని అధిక్షేపిస్తూ ‘రూపసూక్తమ్’, కపట భక్తులకు హితవుగా ‘కౌలేయ సూక్తమ్’ వంటి నవీన సూక్తులను రచించారు.
తెలంగాణ గురించి ‘తెలంగాణ కౌశలం సక ల సత్కలా లాలితం/ తెలంగాణ పౌరుషం సమరవీర సంభాషితమ్/ తెలంగాణ వైభవం బహు సమృద్ధి సంభావితం/తెలంగాణ గౌరవం జయతు’ అని శ్లాఘించారు. తను పుట్టిన ఊరిలోని ‘చేగుర్తి వేంకటేశ్వరస్వామి’కి, ప్రసిద్ధ క్షేత్రం ‘చిలుకూరి బాలాజీ’కి, ఇల్లందకుంట ‘శ్రీరామచంద్రుని’కి, ఇంకా ఎన్నో సుప్రభాతాలు రచించారు. శివకేశవ భేదం లేకుండా అనేక ప్రసిద్ధ దేవాలయాలకు సుప్రభాతాలు, స్తోత్రాలు రాశారు. ‘పద్మాక్షీ పదచారణమ్’ పేరుతో హనుమకొండ పద్మాక్షీ దేవాలయంపై కావ్యం రచించారు. సాంఖ్య దర్శనం గురించి తెలుగులో విపులంగా విశ్వదర్శనం కావ్యాన్ని వైజ్ఞానిక శాస్ర్తానుసారంగా నిరూపించి రచించారు. సంస్కృత భాషలోని చమత్కారాలను ‘ప్రహేళికలు’ పేరుతో సేకరించారు. సంస్కృత నాటకాలలో నాందీ ప్రస్తావనల గురించి పుస్తకం రచించారు.
ఉదాహరణ ప్రక్రియలో ‘కరీణ్ణగర ప్రశసి’్త, ‘కామాయనమ్’, మొదలైన ఆధునిక అభ్యుదయ భావాలతో కూడిన కావ్యాలెన్నో సంస్కృతంలో రచించారు. సంస్కృతంలో కొత్త ఛందస్సులను, సూక్తాలను, దేశీయ స్థితిని చూసి ‘విషాద లహరి’ పేరుతో దేశంలోని కులమతాల వైరుధ్యాలను, అనైక్యతను చూపుతూ కావ్యాలు రచించారు.
వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగా ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దారు. ‘సమ సమాజం, సంస్కారవంతమైన సమాజం, సమజీవన విధానం రావాలని, యజ్ఞం కాని, దైవపూజకాని మానవులను సంస్కరించేవిగానే ఉండాలి కాని స్వార్థాన్ని పెంచేవిగా, స్వంతకామనలకోసం చేసేవిగా ఉండరాద’ని ఆయన ఆశయం. సర్వవైదిక సంస్థానంచే నిర్వహింపబడే వ్రతాలలో, పూజలలో అన్ని కులాలవారిని ఆహ్వానించి, స్త్రీలందరినీ కలిపి పాల్గొనేటట్లు చేసిన ఆచరణశీలి విజయసారథి. సర్వవైదిక సంస్థానం నెలకొల్పి వేదజ్ఞానమే ప్రధానంగా ప్రచారం చేశారు. శైవ, వైష్ణవ, శాక్తేయాది భేదాలు లేని జ్ఞానమే ప్రధానమని, వేద ధర్మమే ప్రధానమనే భావనతో గడిచిన మూడు దశాబ్దాలుగా కృషి చేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ ఖిల్లాపై జరిగిన స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో విజయసారథిని విశిష్టంగా సన్మానించారు. బిర్లా ఫౌండేషన్ వారు ‘వాచస్పతి’ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ పూర్వ సాహిత్య అకాడమీ ప్రత్యేక పురస్కారా న్ని ప్రదానం చేశాయి. షిమ్లా పూర్వ ఉపకులప తి అభిరాజ రాజేంద్ర మిశ్రా వీరి కవిత్వాన్ని చది వి ‘యద్భారతదేశే అస్మిన్ స్వయమేవా అసౌ ఏకతః కవిసార్వభౌమః’ అని అభివర్ణించారు.
తెలుగులో ‘సృష్టిదర్శనం’ పేరుతో వేదాలలో పేర్కొన్న శాస్ర్తాంశాలను, ఆధునిక విజ్ఞాన శాస్త్రం లో పేర్కొన్న అంశాలతో సమన్వయం చేసి ఒక పుస్తకం సామాన్యులకు అర్థమయ్యే విధంగా రచించారు. సాంఖ్యయోగం, న్యాయ వైశేషికాలను తెలుగులో సరళశైలిలో రాశారు. నాటకాల్లో నాందీ ప్రస్తావనల గురించి పుస్తకం రాశారు. కావ్యరచనలే కాక, శాస్త్ర, భక్తి, అభ్యుదయ భావపూరితమైన, దేశభక్తి ప్రధానమైన రచనలు బాలభట సంఘం (స్కౌట్స్ ) గురించి, ఇటీవల మనం ఎదుర్కొన్న ‘కొవిడ్’ గురించి ‘కరోనా మూలతో జహి’ సమూలంగా తొలగించాలనే అర్థంలో ఒక లఘుకావ్యం రాశారు. సూక్తాలు, లేఖలు, ఉదాహరణలు, ఇట్లా అనేక ప్రక్రియలలో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధ్యాత్మికత అభ్యుదయం వైరుధ్యాలు కావని రెండూ సమాజ హితానికి తోడ్పడుతాయని శతాధిక రచనల ద్వారా నిరూపించిన మహాపండిత కవి శ్రీభాష్యం విజయసారథి.
భారత ప్రభుత్వం 2020లో విజయసారథిని ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది. ఎన్నో పురస్కారాలు పొందినా ఆయన ప్రధాన లక్ష్యం ఉత్తమ సమాజస్థాపనే. నిర్విరామంగా రచనలు చేస్తూనే ఉండేవారు. ఆశువుగా కూడా సంస్కృతంలో శ్లోకాలు, కవిత్వం చెప్పే సమర్థుడు. జ్యోతిషవాస్తు శాస్ర్తాలలో దేవాలయాల స్థాపనాదులు కూడా చేయించారు. బహుముఖ పాండిత్యం, ప్రజ్ఞ, కవితాశక్తి, ఉపాసనాబలం కల మహాకవి, మహాజ్ఞాని శ్రీభాష్యం. రాసేవారుంటే కడదాకా కూడా శ్లోకాలు అలవోకగా చెప్పగల కవితావాహిని శ్రీభాష్యం. నిత్య భావుకుడు, నిరంతర సమాజహితైషి, ఆశుధారా కవితావ్రతుడు, అందరిపట్ల అత్యంత వాత్సల్యం ప్రకటించగల ఉత్తమ ఉదాత్త వ్యక్తిత్వం గల ఆచార్యులు, గురువు అయిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి సాహితీలోకాన్ని వీడటం విషాదకర దుర్దినం. తెలంగాణ గర్వించదగిన ఒక మహాకవికి శ్రద్ధాంజలులు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ ఖిల్లాపై జరిగిన స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో విజయసారథిని విశిష్టంగా సన్మానించారు. బిర్లా ఫౌండేషన్ వారు ‘వాచస్పతి’ పురస్కారాన్ని,ఆంధ్రప్రదేశ్ పూర్వ సాహిత్య అకాడమీ ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేశాయి. వారణాసి సంపూర్ణానంద సంస్కృత వర్సిటీ పూర్వ ఉప కులపతి అభిరాజ్ రాజేంద్ర మిశ్రా వీరి కవిత్వాన్ని చదివి ‘యద్భారతదేశే అస్మిన్ స్వయమేవా అసౌ ఏకతః కవిసార్వభౌమః’ అని అభివర్ణించారు.
డాక్టర్ గండ్ర లక్ష్మణరావు